ఇండియా-చైనా యుద్ధం వస్తే ఎవరికి నష్టం? చైనాకా.. మనకా?
భారత్-చైనా సరిహద్దులోని సిక్కిం సెక్టర్లోని డోక్లామ్ వివాదం ఫలితంగా రెండు ఆసియా దేశాల మధ్య యుద్ధమే వస్తే ఏ దేశానికి ఎక్కువ నష్టం? ఈ ప్రశ్నకు సమాధానంగా.. చైనాకే ఎక్కువ నష్టమనే అభిప్రాయం వ్యక్తమౌతోంది.
న్యూఢిల్లీ: భారత్-చైనా సరిహద్దులోని సిక్కిం సెక్టర్లోని డోక్లామ్ వివాదం ఫలితంగా రెండు ఆసియా దేశాల మధ్య యుద్ధమే వస్తే ఏ దేశానికి ఎక్కువ నష్టం? ఈ ప్రశ్నకు సమాధానంగా.. చైనాకే ఎక్కువ నష్టమనే అభిప్రాయం వ్యక్తమౌతోంది.
ప్రపంచ జనాభాలో 35 శాతం(260 కోట్లు) నివసించే ఈ రెండు భారీ దేశాలూ ఓ చిన్నపాటి సరిహద్దు గొడవతో అసలు పోరుకు దిగుతాయా? అన్నదే ప్రస్తుత ప్రశ్న. అయితే ప్రస్తుతం ఈశాన్య సరిహద్దులో భారత, చైనా సేనలు కేవలం 150 మీటర్ల ఎడంలో నిలబడి ఉన్నాయి.
ఒకవేళ యుద్ధమే మొదలైతే పోరు ఒక్క సిక్కిం సెక్టార్ కే పరిమితం కాదనీ, అరుణాచల్ నుంచి జమ్మూకశ్మీర్ వరకూ దాదాపు నాలుగు వేల కిలోమీటర్ల మేర విస్తరిస్తుందని యుద్ధ నిపుణులు అంచనా వేస్తున్నారు.

పూర్తి స్థాయి యుద్ధం జరిగితే...
1962లో మాదిరిగా పూర్తిస్థాయి యుద్ధమే జరిగితే చైనాకు ఎదురయ్యే అననుకూల పరిస్థితులే అధికం. చైనాకు 80 శాతానికి పైగా ముడి చమురు రవాణా జరిగే మలాకా జలసంధి(మలేసియా, ఇండొనేషియా మధ్య) అండమాన్ దీవులకు సమీపంలో ఉన్న కారణంగా ఈ రవాణాపై యుద్ధం ప్రభావం పడుతుంది. అండమాన్ నికోబార్ దీవుల్లో భారత్ కు భారీ నౌకాదళ కేంద్రం ఉంది. పోరు సమయంలో చైనాకు ముడి చమురు నౌకల ప్రయాణం సాఫీగా సాగదు. ఇండియన్ నేవీ చురుకుగా రంగంలోకి దిగితే, చైనా ఓడలు అండమాన్ సముద్రం పక్క నుంచి పోవడం కష్టమే. భారత నావికా దళానికున్న అతి పెద్ద స్థావరాల్లో ఇదొకటి. ఈ కారణంగానే 1999 కార్గిల్ యుద్ధ సమయంలో పాకిస్తాన్ కు సాయం చేసేందుకు చైనా ముందుకు రాలేదు.
Recommended Video


పొరుగు దేశాలన్నిటితోనూ చైనాకు తగవులే!
చైనా చెప్పినట్టు డోక్లామ్ వివాదం యుద్ధంగా మారితే, అది సిక్కిం సెక్టార్ కు మాత్రమే పరిమితం కాదనీ, భారత ఉత్తర సరిహద్దు యావత్తూ యుద్ధరంగంగా మారుతుందని చైనా ఇటీవల హెచ్చరించింది. ఇదే నిజమైన పక్షంలో.. చైనా-పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ ప్రాజెక్టులో భాగంగా పాక్ ఆక్రమిత కశ్మీర్ లో చైనా భారీగా పెట్టిన పెట్టుబడులు, ఆర్థిక, పారిశ్రామిక మౌలిక సౌకర్యాలు భారత సేనల దాడులకు లక్ష్యంగా మారతాయి. అప్పుడు చైనా భారీగా నష్టపోతుంది. ఇప్పటికే చైనా సర్కారు ఇక్కడ 4,500 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టింది. అలాగే, బర్మా రేవు చిట్టగాంగ్, మయన్మార్ లోని కోకోస్కీలింగ్ పోర్టులో చైనా ఆర్థిక కార్యకలాపాలు ఎక్కువ. ఇంకా ఇటీవల శ్రీలంకలోని హంబంతోతట్ రేవు, పాకిస్తాన్ లోని గ్వాదర్ పోర్టులో చైనా కొన్ని సౌకర్యాలు పొందడానికి ఒప్పందాలు కూడా చేసుకుంది. ఆఫ్రికా ‘కొమ్ము' దేశం జిబూటీలో చైనా సైనిక స్థావరం శరవేగంతో పూర్తి చేస్తోంది.

14 దేశాలతో సరిహద్దు వివాదాలు...
రెండు దేశాల మధ్య యుద్ధం ఆరంభమయ్యాక ఈ ప్రాంతాలన్నీ భారత నౌకాదళ దాడుల పరిధిలోకి వస్తాయి. చైనాకు తన సరిహద్దుల్లోని 14 దేశాలతో సరిహద్దు వివాదాలున్నాయి. ఇప్పటివరకూ అదుపులో ఉన్న ఈ వివాదాలు ఒకసారి భారత్, చైనాల మధ్య పోరు మొదలైతే మళ్లీ వేడెక్కుతాయని అంచనా. ఇటీవల దక్షిణ చైనా సముద్రంలో చైనా దూకుడు కారణంగా అమెరికా, జపాన్ లు సైతం దానికి ప్రత్యర్థులుగా మారాయి. భారత్ తో జరిగే యుద్ధంలో చైనా నేవీ నిమగ్నమైతే, దక్షిణ చైనా సముద్రంలో దాని పరిస్థితి బలహీనమౌతుందని రక్షణ నిపుణులు అంటున్నారు. హైదరాబాద్ కు చెందిన తెలుగువారి ఔషధాల కంపెనీ గ్లాండ్ ఫార్మా లోని 86 శాతం మూలధన వాటాను కొనుగోలు చేయడానికి చైనా ఫార్మా దిగ్గజం ఫోసన్ ఫార్మా చేసిన ప్రతిపాదనకు ఈ డోక్లామ్ వివాదం కారణంగా తాజాగా కేంద్ర సర్కారు అనుమతివ్వలేదని వార్తలొస్తున్నాయి.

ఇండియాకూ ఇబ్బందులే!
ఆసియాలో చైనా, జపాన్ తరువాత మూడో పెద్ద ఆర్థికశక్తిగా అవతరించిన భారత్ కు కూడా చైనాతో తలపడితే కష్టాలు తప్పవు. చైనా అధీనంలోని టిబెట్ ఎత్తయిన పీఠభూమి కావడంతో అక్కడ నుంచి పోరాటం జరిపే చైనా సైనిక దళాలకు ఇండియాపై దాడులు సులువని అంచనా. అతి శీతల వాతావరణమున్న సరిహద్దుల్లో భారత సాధారణ సైనిక దళాలు చాకచక్యంగా పోరుసాగించలేవనీ, అస్సాం రైఫిల్స్, ఇండో టిబెటన్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వంటి ప్రత్యేక దళాలపై ఎక్కువగా ఆధారపడాల్పి ఉంటుందని రక్షణరంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. అదీగాక చైనాను ఆనుకుని ఉన్న ఈశాన్య ప్రాంతాల్లో కొన్నేళ్ల క్రితం ప్రారంభించిన రోడ్లు, వంతెనలు, ఇతర మౌలిక సదుపాయాల నిర్మాణాలు ఇంకా పూర్తికాకపోవడం కూడా ఇండియాకు యుద్ధకాలంలో ఇబ్బంది కలిగించే అంశమే.












Click it and Unblock the Notifications