weather: మధ్య భారతంలో 3-4 రోజులపాటు భారీ వర్షాలు: ఐఎండీ
న్యూఢిల్లీ: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మధ్య భారతదేశంలో రానున్న మూడు నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. దక్షిణ మయన్మార్, పరిసర ప్రాంతాలపై తుఫాను ప్రభావంతో, తూర్పు మధ్య బంగాళాఖాతం, బంగ్లాదేశ్-మయన్మార్ తీరాల ఈశాన్య, పరిసర ప్రాంతాలలో గురువారం అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది.
మరో 24 గంటల్లో అల్పపీడనం బలపడే అవకాశం ఉందని పేర్కొంది. మధ్య భారతదేశం నుంచి ఉత్తర భారతదేశంవైపు అల్పపీడనం ప్రభావం ఉండనుంది. పశ్చిమ, దక్షిణ భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణ వర్షాలు కొనసాగనున్నాయని పేర్కొంది. కాగా, దక్షిణ గుజరాత్, మహారాష్ట్ర తీరం వెంబడి ఆఫ్-షోర్ ద్రోణి సగటు సముద్ర మట్టం వద్ద కొనసాగుతోంది.

తూర్పు రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని చాలా ప్రాంతాల్లో ఆగస్టు 21-22 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆగస్టు 20,22,22 తేదీల్లో సౌరాష్ట్ర, కచ్, కొంకణ్, గోవా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
పశ్చిమబెంగాల్ గంగా పరివాహక ప్రాంతం, ఒడిశా, జార్ఖండ్, విదర్భ, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఆగస్టు 18-22 వరకు విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.
తూర్పు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, విదర్బ, ఒడిశా ప్రాంతాల్లో 19-21 వరకు భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. హిమాచల్‌ప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో ఆగస్టు 18-20 వరకు ఉరుములుమెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.


Click it and Unblock the Notifications