87 ఏళ్ల రికార్డ్ వర్షం: కేరళ కోలుకోవడానికి దశాబ్ధం, ప్రభుత్వం ముందు అదే సవాల్
Recommended Video

తిరువనంతపురం: భారీ వరదల కారణంగా కేరళలో ఎంతోమంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. గత 87 ఏళ్లలో ఆగస్ట్ నెలలో కురిసిన వర్షాలలో ఇదే అత్యధికం. సాధారణ వర్షపాతం కంటే రెండున్నర రెట్లు ఎక్కువ వర్షం కురిసింది. రెండు రోజులుగా వర్షాలు కొంత తగ్గడంతో సహాయక చర్యలు వేగవంతమయ్యాయి.
ఈ ఆగస్ట్‌లోని ఇరవై రోజుల్లో కురిసిన వర్షపాతం గత ఎనభై ఏడేళ్లలోనే అత్యధికమని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆగస్ట్ 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 771 ఎంఎం వర్షం కురిసింది. 1931 నుంచి అదే అత్యధికం. ఇడుక్కి జిల్లాలో వర్షపాతం 111 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది.

కాగా, కేరళ రాష్ట్రం తిరిగి కోలుకోవడానికి కనీసం దశాబ్దం పడుతుందని అభిప్రాయపడుతున్నారు. వరదల ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రాంతాల పరిస్థితి చాలా దారుణంగా మారింది. భవనాలు, నిర్మాణాలన్నీ ధ్వంసమయ్యాయి. కాబట్టి ఈ ప్రాంతాల్లో భవనాలు, నిర్మాణాలను తిరిగి పునరుద్ధరించాలంటే కనీసం పదేళ్లు పడుతుందని చెబుతున్నారు.
గత వందేళ్లలో కాలంలో ఎన్నడూ లేనంతగా కేరళ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తాయి. దీంతో రాష్ట్రానికి దాదాపుగా రూ.20వేల కోట్ల నష్టం వాటిల్లింది. ఇడుక్కి, మలప్పురం, కొట్టాయం, ఎర్నాకులం జిల్లాల్లో వరదల ప్రభావం తీవ్రంగా పడింది.
రాష్ట్రంలో దాదాపు 10,000 కి.మీ. రహదారులు కొట్టుకుపోయాయి. వందల కొద్దీ వంతెనలు కొట్టుకుపోయాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో సుమారు లక్ష భవనాలు ధ్వంసమయ్యాయి. లక్షల టన్నుల పంట నాశనమైంది. లక్షల హెక్టార్లలో పంటలు నాశనమయ్యాయి.
విధ్వంసానికి గురైన కేరళను పునరద్ధరించడం ఇప్పుడు ప్రభుత్వం ముందున్న అత్యంత క్లిష్టమైన పని అని సీఎం పినరయి విజయన్ అన్నారు. గత రెండు రోజులుగా వరదలు కాస్త తగ్గుముఖం పట్టడంతో సహాయక సిబ్బంది సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఆహారం, నీరు లేక ఇళ్లలో చిక్కుకుపోయిన వారిని కాపాడి సహాయక సామాగ్రి అందిస్తున్నారు.
హెలికాప్టర్ల ద్వారా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేరవేస్తున్నారు. డ్రోన్ల ద్వారా నీటిలో చిక్కుకున్న వారిని గుర్తించి కాపాడుతున్నారు. వరదలు తగ్గినప్పటికీ ఇప్పుడు వ్యాధుల వ్యాప్తి ప్రభుత్వానికి సవాల్‌గా మారింది. అంటువ్యాధులు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది.












Click it and Unblock the Notifications