నోట్లరద్దు, జీఎస్టీతో కమలానికి కష్టాలే.. వీరభద్రుడిపై అవినీతి ఆరోపణలతో కాంగ్రెస్‌కూ ఇబ్బందే

Posted By: Swetha
Subscribe to Oneindia Telugu

సిమ్లా: నోట్ల రద్దు, వస్తు సేవల పన్ను తాము సాధించిన విజయాలని కేంద్రంలోని అధికార బీజేపీ ఘంటాపథంగా చెబుతోంది. ఆపిల్ పండ్ల తోటల పెంపకందారులు, వాటి వ్యాపారులు మాత్రం కేంద్ర ప్రభుత్వ వాదనతో విభేదిస్తున్నారు. నూతన పన్ను విధానంతో తమ నిర్వహణ వ్యయం పెరుగుతున్నదని, వ్యాపారాలు 40 శాతం దెబ్బ తిన్నాయని చెప్తున్నారు. యాపిల్ దిగుబడి మూడు కోట్ల కార్టన్ల నుంచి రెండు కార్టన్లకు పడిపోయిందని యాపిల్ గ్రోయర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రవీందర్ చౌహాన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాది క్రితం వరకు రూ.5000 కోట్ల టర్నోవర్ గల యాపిల్ బిజినెస్ ఈ ఏడాది రూ.3,500 కోట్లకు పడిపోయిందని చెప్పారు. దీనికి ప్రధాన కారణం నోట్ల రద్దు అని చెప్తున్నారు. తొలుత నోట్ల రద్దు, తర్వాత జీఎస్టీ అమలులోకి రావడంతో యాపిల్ గ్రోయర్లు సమస్యలు ఎదుర్కొంటున్నారు.

ప్రధాని మోదీ ప్రచారం ఇలా

ప్రధాని మోదీ ప్రచారం ఇలా

రాష్ట్రంలో యాపిల్ తోటలు గల ఏడు జిల్లాల్లో నోట్ల రద్దు, జీఎస్టీ ప్రభావం చూపుతుందని చెప్తున్నారు. రాష్ట్ర రాజధాని సిమ్లా, కుల్లు, కిన్నౌర్, మండి, చంబా, సర్మౌర్, లాహౌల్ -స్పిటి జిల్లాల పరిధిలో 33 అసెంబ్లీ స్థానాలు ఉండటం గమనార్హం. ‘హిమాచల్‌లో బీజేపీ గెలుస్తోంది. నేను ప్రచారం చేయాల్సిన అవసరమే లేదంటూనే గురువారం ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్రంలోని అతి పెద్ద జిల్లా కాంగ్డాలో కాషాయపక్ష ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు. మరో చోట రెండో బహిరంగసభలో పాల్గొనడమేగాక, శనివారం ఇదే జిల్లా రాయిట్‌ ర్యాలీలో కాంగ్రెస్‌పై తీవ్రస్వరంతో విరుచుకుపడ్డారు. ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లో పాలక పార్టీని ఓడించడం ఇక్కడి ప్రజలకు అలవాటుగా మారింది. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం నాలుగు సీట్లూ బీజేపీ కైవసం కావడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకునే మోదీ ధీమాగా ఉన్నారనిపిస్తోంది. కిందటి లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 68 అసెంబ్లీ సెగ్మెంట్లకు 59 చోట్ల బీజేపీకి మెజారిటీ లభించింది. సీఎం వీరభద్రసింగ్‌ నేతృత్వంలోని అధికార కాంగ్రెస్‌ పార్టీ కేవలం తొమ్మిది స్థానాల్లోనే ఆధిక్యం సంపాదించింది. ఇది మూడున్నరేళ్ల క్రితంనాటి పరిస్థితి. ఐదేళ్ల క్రితం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మెజారిటీకి అవసరమైన 36 సీట్లు రాగా, బీజేపీ 26 స్థానాల్లో విజయం సాధించింది.

బీజేపీ సీఎం అభ్యర్థిగా మాజీ సీఎం ధుమాల్

బీజేపీ సీఎం అభ్యర్థిగా మాజీ సీఎం ధుమాల్

అసమర్ధ, అస్తవ్యస్త పాలన వంటి విమర్శలతోపాటు సీఎం వీరభద్రసింగ్‌పై అవినీతి కేసుల నమోదు కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో అననుకూల వాతావరణానికి చిహ్నాలు. సీఎంగా 20 ఏళ్ల అనుభవం ఉన్న 83 ఏళ్ల వీరభద్ర సింగ్ తొలుత కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. వెంటనే బీజేపీకి ఇలాంటి నేత ఎవరని పాలకపక్షం ఎద్దేవా చేయడంతో గత మంగళవారం రెండుసార్లు సీఎంగా పనిచేసిన 73 ఏళ్ల ప్రేంకుమార్‌ ధూమల్‌ను బీజేపీ తమ అభ్యర్థిగా ప్రకటించింది. మోదీ జనాకర్షణ శక్తిపై నమ్మకం లేకే ధూమల్‌ పేరు చెప్పారని కాంగ్రెస్‌ ఎగతాళి చేసినా రాష్ట్ర ప్రజల్లో, బీజేపీ శ్రేణుల్లో గందరగోళానికి తెరపడింది. దీంతో దాదాపు 22 శాతం జనాభా ఉన్న రాజపుత్రవర్గానికి చెందిన నేతలే రెండు ప్రధానపక్షాల సీఎం అభ్యర్థులుగా తేలారు.

జీఎస్టీ, నోట్లరద్దుతో కమలనాథులకు కష్ట కాలం

జీఎస్టీ, నోట్లరద్దుతో కమలనాథులకు కష్ట కాలం

గత లోక్‌సభ ఎన్నికలనాటి మోదీ మేజిక్‌ ఇప్పుడు అదే స్థాయిలో పని చేస్తుందా? అంటే అనుమానమే. అదీగాక సరిగ్గా ఏడాది క్రితం అమల్లోకి తెచ్చిన పెద్దనోట్ల రద్దు, కిందటి జులై ఒకటి నుంచి ప్రవేశపెట్టిన జీఎస్టీ పన్ను విధానంతో హిమాచల్‌లోని యాపిల్‌ రైతులు, ఇతర వ్యాపారులు బాగా నష్టపోయారు. ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయి. బీజేపీపై జనంలో మోజు గతంలో మాదిరిగా లేదు. రాష్ట్ర జనాభాలో రెండో అతిపెద్ద సామజికవర్గమైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన కేంద్రమంత్రి జగత్‌ ప్రకాశ్‌ నడ్డా చివరికి సీఎం అవుతారనే ప్రచారం బాగా జరిగాక రాజపుత్రుల ఆగ్రహం తప్పదనే భయంతో ఆలస్యంగా ‘భవిష్యత్‌' సీఎం ధూమల్‌ అని బీజేపీ ప్రకటించింది. యాపిల్‌ రైతులకు ప్రయోజనం కలిగేలా అనేక చర్యలు తీసుకుంటామని బీజేపీ హామీలు గుప్పిస్తోంది.

ఉత్తరాఖండ్‌లో మాదిరిగానే హిమాచల్‌లో బీసీల జనాభా

ఉత్తరాఖండ్‌లో మాదిరిగానే హిమాచల్‌లో బీసీల జనాభా

ఇతర హిందీ రాష్ట్రాలతో పోల్చితే బీసీల జనాభా పొరుగున ఉన్న ఉత్తరాఖండ్‌లో మాదిరిగా హిమాచల్‌ప్రదేశ్‌లో కూడా బాగా తక్కువ. అగ్రకులాల సంఖ్యాబలం ఉన్న హిమాచల్‌లో బీసీల జనాభా కేవలం 18 శాతం మాత్రమే. అయితే, పంజాబ్‌ నుంచి కలిపిన కాంగ్డా వంటి ప్రాంతాల్లో బీసీలెక్కువ. 16 అసెంబ్లీ సీట్లు ఉన్న కాంగ్డాలో సగానికి పైగా జనాభా ఓబీసీలే. గుజరాత్‌లో మాదిరిగా ఉద్యోగాల్లో 27 శాతం కోటా కావాలని బాహాటంగా అడగకపోయినా, ఈ వర్గంలో ఆ మేరకు చర్చ జరుగుతోంది. చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్న బీసీలు రెండు ప్రధానపక్షాల్లో ఎటు మొగ్గితే ఆ పార్టీదే గెలుపు. మొదట 1993లో సీఎం అయిన వీరభద్ర తొలిసారి బీసీలకు పది శాతం రిజర్వేషన్లు కల్పించి చివరికి కోటాను 18 శాతానికి పెంచారు. బీసీలు తొలుత కాంగ్రెస్‌ పార్టీకే అనుకూలంగా ఓటేసేవారు. చాలా మంది తర్వాత నెమ్మదిగా కాషాయపక్షం వైపు వారు వెళ్లిపోయారు. ముస్లింలు కేవలం రెండు శాతమే కావడంతో హిమాచల్‌లో మత ప్రాతిపదికన ఎన్నికల్లో జనసమీకరణ జరగలేదు. ఈ ప్రత్యేక పరిస్థితుల్లో కాంగ్రెస్‌ 2012లో మాదిరిగా మరోసారి మెజారిటీ సీట్లు సాధించాలనే లక్ష్యంతో సర్వశక్తులూ ఒడ్డుతోంది. బీజేపీ ఈసారి 50కి పైగా అసెంబ్లీ సీట్లు కైవసం చేసుకుని గద్దెనెక్కాలని ఎన్నికల సమరంలో పోరాడుతోంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Bharatiya Janata Party has described demonetisation and the Goods and Services Tax as the biggest achievements of its central government. But apple growers and traders in poll-bound Himachal Pradesh aren’t clapping. While the growers in the hill state, which goes to polls on November 9, claim that they are hurting from higher input costs as a result of the GST, the traders complain the cumbersome system for filing returns under the new tax regime has hiked their operational costs at a time when trade volume is already down by around 40%.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి