మళ్ళీ ఆందోళనకరంగా కరోనా కేసుల పెరుగుదల..ఢిల్లీలోనూ కరోనా ఫియర్; తాజాగా ఎన్నంటే!!
భారతదేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఒక పక్కన కరోనా కేసులు పెరుగుతున్నాయని చెప్పినా ప్రజలలో మాత్రం కరోనా పట్ల జాగ్రత్తలు ఏ కోశానా కనిపించడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం పెరుగుతున్న కరోనా కేసులతో ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కేసులు పెరుగుదల ఇదే విధంగా కొనసాగుతూ పోతే మళ్లీ దారుణమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని భావిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్రం కరోనా కేసులు పెరుగుతున్న రాష్ట్రాలలో కరోనా కట్టడికి పలు మార్గదర్శకాలను జారీ చేసింది.
నిన్న 3000 మార్కు దాటి నమోదైన కరోనా కేసులు, నేడు కూడా 3000 మార్కును దాటి నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. గత కొన్ని రోజులకు ముందు వందల్లో నమోదైన కరోనా కేసులు ప్రస్తుతం వేలల్లో నమోదు కావడం, క్రమంగా కరోనా కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం భారతదేశంలో గత 24 గంటల్లో 3,095 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం దేశంలో క్రియాశీల కేసులు 15,208 కి పెరిగాయి.

గత 24 గంటల్లో కరోనా మహమ్మారి కారణంగా మరణించిన వారి సంఖ్య ఐదు గా నమోదయింది. కేరళలో ముగ్గురు కరోనా మహమ్మారి కారణంగా మృతిచెందగా, గోవా గుజరాత్లలో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉంటే కరోనా రోజువారి పాజిటివిటీ రేటు 2.61 శాతంగా నమోదు కాగా, కరోనా వారపు పాజిటివిటీ రేటు 1. 91 శాతంగా నమోదు అవుతుంది. కాగా ప్రస్తుతం ఉన్న యాక్టివ్ కేసులు ఇప్పటివరకు నమోదు అయిన మొత్తం ఇన్ఫెక్షన్లలో 0.03% గా ఉన్నాయి.
జాతీయ కరోనా రికవరీ రేటు 98.78 శాతంగా నమోదయింది. గత 24 గంటల్లో మొత్తం 1390 మంది కరోనా బారి నుండి కోలుకున్నారు. దీంతో కరోనా నుండి కోలుకున్న వారి సంఖ్య దేశవ్యాప్తంగా 4, 41,69,711 కు చేరుకుంది. ఇదిలా ఉంటే దేశ రాజధాని ఢిల్లీలోనూ కరోనా కేసులు బాగా పెరుగుతున్నాయి నిన్న ఢిల్లీలో 295 తాజా కరోనా కేసులు నమోదు కావడం తో పాజిటివిటీ రేటు 12.48 శాతానికి చేరుకుంది. ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేడు సమావేశాన్ని నిర్వహించి, కరోనా నియంత్రణ చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications