• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

లక్షదీవులు: స్వర్గధామం లాంటి ఈ దీవుల్లో ప్రజలు ఎందుకు ఆగ్రహంతో ఉన్నారు?

By BBC News తెలుగు
|

లక్షద్వీప్‌లో నిరసన చేస్తున్న మహిళ

లక్షద్వీప్‌లో ఉద్రిక్తతలు ముదురుతున్నాయి.

అరేబియా సముద్రంలో కేరళ తీరం నుంచి సుమారు 200 మైళ్ళ దూరంలో ఉన్న లక్షద్వీప్‌లోని 36 దీవుల్లో పదింటిలో మాత్రమే జనావాసాలున్నాయి. ఈ దీవుల్లోని ప్రజలు నిత్యావసరాల సరఫరా పూర్తిగా కేరళ మీదే ఆధారపడతారు.

అందమైన ఇసుక తిన్నెలతో మెరిసే సముద్ర తీరం, స్వచ్ఛమైన నీలి రంగు జలాలు, పగడపు దీవులకు ప్రసిద్ధి అయిన లక్షదీవులను పర్యటక ప్రకటనల్లో స్వర్గధామం లాంటి దీవి అని, పచ్చల దీవి అని కూడా అభివర్ణిస్తారు. అయితే, ఈ దీవుల గురించిన విశేషాలు వార్తల్లో కనిపించడం చాలా అరుదు.

ఇటీవల చోటు చేసుకున్న నిరసనల వల్ల ఈ ప్రాంతం ఇప్పుడు వార్తలకెక్కింది. లక్షద్వీవుల ఉనికి, సంస్కృతి, మతం, భూభాగం పై దాడి జరిగిందని ఇక్కడి ప్రజలు అంటున్నారు.

అయితే, ఈ నిరసనలకు లక్షదీవులకు కొత్తగా నియమితులైన ప్రభుత్వ కార్యనిర్వాహక అధికారి ప్రఫుల్ ఖూడా పటేల్ ఇక్కడ అమలు చేయాలని చూస్తున్న ప్రతిపాదనలే కారణం. కోవిడ్ కేసుల పెరుగుదల, ప్రముఖ మోడల్, దర్శకురాలు, నటికి వ్యతిరేకంగా నమోదు చేసిన దేశ ద్రోహ కేసు వంటి పరిణామాలు ఇక్కడ ఉద్రిక్తతలను పెంచాయి.

ఊహించని నిరసనలు

గత సోమవారం లక్షద్వీప్‌లో స్థానికులు బ్లాక్ డే నిర్వహించారు. నల్ల దుస్తులు, మాస్కులు ధరించి భవనాల పై నుంచి, స్తంభాల పై నుంచి నల్ల జెండాలు ఎగరేశారు. గత వారంలో ఒక రోజంతా జరిగిన నిరాహారదీక్షలో కూడా ప్రజలంతా పాల్గొన్నారని కథనాలు వెలువడ్డాయి.

నిరసనకారులు ఇళ్ల లోపలి నుంచి, ఇంటి పై కప్పు ఎక్కి, జలగర్భాల్లో, కూడా ప్లకార్డులు పట్టుకుని న్యాయం కోరుతూ చేసిన నిరసనలు చేస్తున్న ఫోటోలు కనిపించాయి.

"ఇవి లక్షదీవుల చరిత్రలోనే ఎన్నడూ ఊహించనవి" అని సేవ్ లక్షద్వీప్ ఫోరమ్ కోఆర్డినేటర్ డాక్టర్ మొహమ్మద్ సాదిఖ్ అన్నారు.

ఈ నిరసనలను ముందుండి నడిపిస్తున్న ఆరు రాజకీయ పార్టీల కూటమే సేవ్ లక్షద్వీప్ ఫోరమ్.

ఈ నిరసనకారులు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మద్దతును కూడా సంపాదించారు. "అధికారంలో మూఢవిశ్వాసాలతో ఉన్న వ్యక్తులు సముద్రంలో ఉన్న భారతీయ ఆభరణాన్ని నాశనం చేస్తున్నారు" అని ఆయన ఆరోపించారు.

లక్షద్వీప్‌లో జారీ చేసిన ఆదేశాలు ఆ ప్రాంత సంస్కృతి, మత విశ్వాసాల పై ఉద్దేశ్యపూర్వకంగా చేస్తున్న దాడిలా ఉన్నాయని అభివర్ణించారు. ఆ ఆదేశాలను ఉపసంహరించుకోవాలని కోరుతూ ఆయన ప్రధాని మోదీకి లేఖ కూడా రాశారు.

నటి ఆయేషా సుల్తానా

ఈ వివాదాస్పద ప్రతిపాదనలేంటి?

కొత్తగా జారీ చేసిన నిబంధనల్లో అన్నిటి కంటే ముఖ్యంగా భూసేకరణకు సంబంధించిన నిబంధనలు ప్రజలను ఎక్కువగా కలవరపెడుతున్నాయి. ఈ కొత్త నిబంధనల ప్రకారం ప్రభుత్వం అక్కడ నిర్మించాలనుకునే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఏ భూమినైనా స్వాధీనం చేసుకోవచ్చు.

ఈ దీవులను మాల్ దీవుల తరహాలో పర్యటక స్వర్గంగా చేయాలని భారీ ప్రణాళికలున్నాయని పటేల్ అంటున్నారు.

ఈ మార్పులతో స్థానికుల భద్రత, సంక్షేమం మెరుగవుతాయని చెబుతున్నారు. కానీ , ఇదంతా ఇక్కడ భూమిని దోచుకోవడానికే చేస్తున్నారని డాక్టర్ సాదిఖ్ ఆరోపిస్తున్నారు.

ఈ విధానం వల్ల స్థానికులు నిరాశ్రయులవుతారని, పటేల్‌ను పదవి నుంచి తొలగించడమే కాకుండా, డ్రాఫ్ట్ నిబంధనలను ఉపసంహరించుకోవాలని ఫోరమ్ డిమాండు చేస్తోంది.

"మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు. కానీ, ఆ అభివృద్ధి ఇక్కడ ప్రజలను, వారి సంస్కృతిని, భూభాగాన్ని పరిరక్షించగలగాలి" అని సాదిఖ్ అన్నారు. మేము జాతి వ్యతిరేకులం కాదు. మేము భారతీయ పౌరులం. మేము కేవలం మా భూభాగం, హక్కుల కోసం పోరాడుతున్నాం" అని అన్నారు.

గొడ్డు మాంసం, మద్యం నిషేధం

ప్రఫుల్ పటేల్ డిసెంబరులో పదవిని చేపట్టిన తర్వాత ఈ ప్రాంతంలో గోవు, ఎద్దు, గేదెలను చంపడం, వాటి మాంసాన్ని తినడంపై నిషేధాన్ని విధించారు. 1979 నుంచి అమలులో ఉన్న మద్య నిషేధాన్ని తొలగించారు.

ఈ చర్యల ద్వారా కేంద్రప్రభుత్వంలో అధికారంలో ఉన్న పార్టీ సిద్ధాంతాలను ఈ ద్వీపంలో ఉన్న 70 వేల జనాభా పై రుద్దాలని చూస్తున్నారని విమర్శకులు అంటున్నారు. ఇక్కడ జనాభాలో 96 శాతం మంది ముస్లింలే ఉన్నారు.

"ముస్లింలు అత్యధికంగా ఉన్న ప్రాంతంలో గొడ్డు మాంసాన్ని నిషేధించాల్సిన అవసరమేముంది? మేము తినే ఆహారంలో పటేల్ ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు?" అని కాంగ్రెస్ నాయకుడు, లక్షద్వీప్ మాజీ పంచాయతీ అధ్యక్షుడు అల్తాఫ్ హుస్సేన్ ప్రశ్నించారు.

ఇస్లాం మద్యం సేవించడాన్ని అనుమతించనందున ఇక్కడి ప్రజలు మద్యపాన నిషేధాన్ని సమర్ధిస్తారని స్వతంత్ర సమాచార వెబ్ సైటు ద్వీప డైరీ.కామ్ ఎడిటర్ ముహమ్మద్ నౌషాద్ చెప్పారు.

లక్షద్వీప్‌లో నిరసనలు

"ఈ దీవులు ,మహిళలు, పిల్లలకు ఎప్పుడూ సురక్షితంగానే ఉన్నాయి. మద్యం సులభంగా దొరకడం వల్ల మద్యపానానికి బానిసలై సాంఘిక వాతావరణంపై ప్రభావం చూపిస్తాయి" అని అన్నారు.

లక్షద్వీప్ చరిత్ర, సంస్కృతి గురించి పటేల్‌కు అవగాహన లేదని ఆయన అంటున్నారు.

"ఇక్కడ నిబంధనలను, అప్రజాస్వామికంగా, నిరంకుశంగా ఎప్పుడూ విధించలేదు. ఇక్కడ చేస్తున్న మార్పుల గురించి ప్రజలతో సంప్రదించలేదు. వాళ్ళు పౌరులు, బానిసలు కాదు. నాగరిక సమాజంలో ఇలాంటివి ఆమోదయోగ్యం కాదు" అని అన్నారు.

దీవుల్లో నివసించే ప్రజల శాంతికి భంగం కలిగించే బదులు జనావాసాలు లేని దీవులను పర్యటక ప్రాంతాలుగా అభివృద్ధి చేసుకోవచ్చని సూచించారు.

నిరసనల అణచివేత

ఇక్కడ అమలు చేసిన యాంటీ సోషల్ యాక్టివిటీ రెగ్యులేషన్ డ్రాఫ్ట్ కూడా వివాదాస్పద అంశంగా మారింది. దీనిని అనుసరించి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఏ వ్యక్తినైనా పోలీసులు ఏడాది వరకూ అదుపులో ఉంచవచ్చు.

గత 45 సంవత్సరాల్లో ఒక్క నేరం కూడా నమోదు కాని ప్రాంతంలో ఇలాంటి నిబంధనలను ప్రవేశపెట్టడం ఎంతవరకు సమంజసమని హుస్సేన్ ప్రశ్నించారు.

విమర్శకుల నోరు మూయించేందుకు ప్రభుత్వం ఈ చట్టాన్ని వాడుతుందని డాక్టర్ సాదిఖ్ అన్నారు.

ప్రఫుల్ ఖూడా పటేల్

"ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలకు వ్యతిరేకంగా నిరసనలు ఎదురవుతాయని వారికి తెలుసు. అందుకే నిరసనకారులను అరెస్టు చేసి జైలులో పెట్టేందుకే వీటిని అమలు చేశారు" అని అన్నారు.

ఈ డ్రాఫ్ట్ నిబంధనలను ఇంకా చట్టబద్దత పొందలేదు. కానీ, ప్రభుత్వ వ్యతిరేకులను అణగదొక్కే పని మాత్రం మొదలయింది.

దేశద్రోహం కేసు

లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ ఖూడా పటేల్‌పై ఓ మలయాళీ టీవీ ఛానెల్‌లో చేసిన వ్యాఖ్యలకుగాను గత వారం ఐపీసీ సెక్షన్ 124బీ కింద నటి ఆయేషా సుల్తానాపై దేశ ద్రోహం కేసు నమోదు చేశారు.

టీవీలో చర్చ సమయంలో, ''కరోనా మహమ్మారిని చైనా వ్యాపింపజేసినట్లే.. లక్షద్వీప్ ప్రజలపై భారత్ ప్రభుత్వం ఈ బయోలాజికల్ వెపన్‌ను రుద్దుతోంది" అని ఆమె వ్యాఖ్యానించారు.

లక్షద్వీప్‌లో క్వారంటైన్ నిబంధనలను పటేల్ సడలించారని ఆయేషా అన్నారు. పటేల్ నిర్ణయంతోనే ఇక్కడ కరోనా కేసులు పెరుగుతున్నాయని ఆరోపించారు.

జనవరి మధ్య వరకూ ఒక్క కేసు కూడా నమోదు కాని లక్షద్వీప్ లో 9,297 ఇన్ఫెక్షన్లు నమోదు కాగా, 45 మరణాలు చోటు చేసుకున్నాయి.

అయితే, ఈ ఆరోపణలను పటేల్ ఖండించారు.

వైరస్ కొత్త స్ట్రెయిన్ తో పాటు, ఆర్ధిక ప్రయోజనాల కోసం ప్రజల కదలికలు మొదలు కావడం వల్లే కేసులు పెరిగాయని పటేల్ అన్నారు.

పటేల్ చర్యలను సుల్తానా మాత్రమే కాదు, ఇతర స్థానిక పార్లమెంటు సభ్యులు మొహమ్మద్ ఫైజల్ కూడా విమర్శించారు.

కానీ, ఆమె చేసిన పదప్రయోగానికి వ్యతిరేకంగా స్థానిక బీజేపీ నాయకుడు ఫిర్యాదు నమోదు చేశారు.

పోలీసులు విచారణ మొదలుపెట్టి, ఆమెను ప్రశ్నించేందుకు పిలిపించారు.

ఆమె అరెస్ట్ అవుతారనే భయంతో కేరళ హైకోర్టులో బెయిల్‌ కోసం దరఖాస్తు చేశారు. ఆమె వారం రోజుల వరకు అరెస్ట్ కాకుండా ఉండేందుకు కోర్టు బెయిల్ జారీ చేసింది.

ఈ కేసు ప్రస్తుతం కోర్టులో ఉన్నందున దీని గురించి మాట్లాడడానికి ఆమె ఇష్టపడలేదు. "నా జన్మభూమి కోసమే నా పోరాటం" అని ఆమె అన్నారు.

ఆమెను భయపెట్టడానికే ఈ కేసును నమోదు చేశారని ఆమె న్యాయవాది ఫసీలా ఇబ్రహీం చెప్పారు.

"ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందనే సందేశాన్ని ఇవ్వాలని వారు చూస్తున్నారు" అని ఆమె అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Lakshadweep: Why are people angry at these islands like paradise
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X