వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పుష్ప గ్యాంగ్: సరికొత్తగా చందనం స్మగ్లింగ్... పగలంతా రెక్కీ, రాత్రిపూట పక్కాగా చోరీ

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

గుజరాత్‌లోని గ్రామాల్లో గుడారాలు వేసుకొని వనమూలికలు, దువ్వెనల విక్రయాల పేరుతో చందనపు చెట్లను దొంగిలించిన మధ్యప్రదేశ్‌కు చెందిన పుష్ప గ్యాంగ్‌ను పోలీసులు పట్టుకున్నారు.

ఈ ముఠాలో పిల్లలు, మహిళలు కూడా ఉన్నారు.

సౌరాష్ట్రతో పాటు గుజరాత్‌లోని పలు ప్రాంతాల్లో చందనపు చెట్లను పెంచడం ప్రారంభించారు.

pushpa

ఇటీవల పదవీ విరమణ పొందిన చీఫ్ ఫారెస్ట్ ఆఫీసర్ సంజీవ్ త్యాగి మాట్లాడుతూ, చందనం ధర ఎక్కువగా ఉండటంతో దాన్ని దొంగిలించడానికి ఇతర రాష్ట్రాలకు చెందిన దొంగల ముఠాలు, గుజరాత్‌కు వచ్చేవని చెప్పారు.

''ఈ దొంగల ముఠాలు చెట్లను నరికి వాటిని ఇతర రాష్ట్రాలకు తరలించేవి. ఈ దొంగతనాలను నివారించడానికి సౌరాష్ట్ర, రాజ్‌పిప్లా అడవుల్లో ఇనుప ఊచలను పెట్టడం ప్రారంభించాం'' అని ఆయన తెలిపారు.

చందనం మొక్కల పెంపకంతో రైతులకు ప్రయోజనం కలిగించాలనే ఉద్దేశంతో అడవుల్లోనే కాకుండా ప్రైవేట్ స్థలాల్లో కూడా ఈ చెట్ల పెంపకానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

తొలుత ఈ చెట్లను సౌరాష్ట్ర, సెంట్రల్ గుజరాత్, దక్షిణ గుజరాత్‌లో పెంచడం ప్రారంభించారు. ఇప్పుడు వీటిని ఉత్తర గుజరాత్‌లో కూడా పెంచుతున్నారు.

దీని గురించి సంజీవ్ త్యాగి మాట్లాడుతూ, ''ప్రభుత్వం అనుమతించిన తర్వాత ఉత్తర గుజరాత్‌లో కూడా చందనం మొక్కలను నాటారు. సెంట్రల్ గుజరాత్, సౌరాష్ట్రలలో చందనం దొంగతనాన్ని అడ్డుకునేందుకు కఠిన చర్యలు తీసుకున్నారు. దీంతో దొంగలు ఇప్పుడు ఉత్తర గుజరాత్ వైపు వెళ్తున్నారు'' అని అన్నారు.

'పుష్ప' సినిమా చొక్కాలు, ఎర్రటి కండువా

ఉత్తర గుజరాత్‌లోని సబర్‌కాంత జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ విశాల్ వాఘేలా మాట్లాడుతూ, ''గత రెండున్నర నెలల కాలంలో సబర్‌కాంత, ఆరావళి ప్రాంతాల్లో చందనం దొంగతనాలపై ఏడు ఫిర్యాదులు వచ్చాయి. మేం గతంలో జరిగిన దొంగతనాల చరిత్ర, నిందితుల వివరాలు, దొంగతనాలు జరిగే పద్ధతులను తెలుసుకున్నాం. దొంగతనం కోసం ఉపయోగించిన రహదారిపై రెక్కీ నిర్వహించాం. అనుమానితులపై నిఘా పెట్టాం'' అని చెప్పారు.

అటవీ శాఖ, స్థానిక క్రైం బ్రాంచ్ సహకారంతో పోలీసులు రోడ్లపై ముమ్మర తనిఖీలు చేపట్టామన్నారు.

''ఇటీవల అడవిలోని రోడ్డుపై బైక్‌ మీద ముగ్గురు వ్యక్తులు వెళ్తూ కనిపించారు. వారు వేసుకున్న దుస్తులు విచిత్రంగా ఉన్నాయి. వారి షర్టులపై 'పుష్ప' సినిమా హీరో ఫొటోలు ముద్రించి ఉన్నాయి. నడుముకు ఎర్రని కండువా చుట్టుకున్నారు.

బండికి గుజరాత్ నంబర్ ప్లేట్ ఉండటంతో మొదట అనుమానం రాలేదు. కానీ, నడుముకు ఉన్నఎర్రని వస్త్రాన్ని చూసి అనుమానపడ్డాం. వారిని ప్రశ్నించినప్పుడు హిందీలో మాట్లాడం మొదలుపెట్టారు. దీంతో మా అనుమానం బలపడింది.

నడుముకు కట్టుకున్న ఎర్రని వస్త్రాన్ని విప్పుతుండగా అందులో నుంచి చెట్ల నరికివేతకు ఉపయోగించే పనిముట్లు కింద పడిపోయాయి. వాటిని తీసి ఎర్రటి వస్త్రంలో దాచిపెట్టారు. తర్వాతి విచారణలో అడవి, ప్రైవేట్ స్థలాల్లోని చందనం చెట్లను నరికి ముక్కలుగా చేసి ఉత్తరప్రదేశ్‌లోని విక్రయిస్తున్నట్లు వారు ఒప్పుకున్నారు'' అని విశాల్ వివరించారు.


పుష్ప గ్యాంగ్ దొంగతనం చేసే పద్ధతి క్లుప్తంగా


  • ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు గ్రామాల్లోని ఆలయాల వద్ద టెంట్లు వేసుకుంటారు.
  • పగటి సమయాల్లో ముఠాలోని మహిళలు, పిల్లలు గ్రామంలో ఉన్న చందనపు చెట్లను రెక్కీ చేస్తారు.
  • రాత్రి పూట చందనం చెట్లను నరకడానికి వెళ్లేముందు గుడారం దగ్గర గుంత తీస్తారు.
  • చెట్లను చిన్న ముక్కలుగా నరికి వాటిని గుంతలో వేసి పూడుస్తారు.
  • మరుసటి రోజు గంధం చెక్కలతో ఊరు నుంచి వెళ్లిపోతారు.
  • ఈ కలపను ఉత్తరప్రదేశ్‌లో మహిళలు, పిల్లలు అమ్ముతారు.

చందనం స్మగ్లింగ్‌లో మహిళలు, చిన్నారులు

ఈ నిందితులు దొంగతనం చేసే తీరు గురించి విశాల్ వాఘేలా వివరించారు. ''పోలీసులు, సాధారణ పౌరుల నుంచి తప్పించుకోవడానికి వీరు కొత్త పద్ధతులను ఉపయోగిస్తున్నారు.

ఈ ముఠాకు చెందిన మహిళలు, పిల్లలు చుట్టుపక్కల గ్రామాలకు కత్తిపీటలు, ఇతర వస్తువులు అమ్మడానికి వెళ్లి చందనపు చెట్లపై రెక్కీ నిర్వహిస్తారు. రాత్రి కాగానే పురుషులు చెట్ల దొంగతనానికి వెళ్తారు. పిల్లలతో కలిసి మహిళలు తమ గుడారం దగ్గర గుంతలు తవ్వుతారు.

చెట్లను దొంగిలించిన తర్వాత వాటిని చిన్న ముక్కలుగా నరికి గుంతల్లో పూడ్చి పెడతారు. తర్వాతి రోజు ఊరు నుంచి వెళ్లిపోతారు'' అని ఆయన చెప్పారు.

చందనాన్ని దొంగిలించిన తర్వాత ఏం చేస్తారు? అనే ప్రశ్నకు బదులిస్తూ.. ''చందనాన్ని రాత్రి పూటే చిన్న ముక్కలుగా చేస్తారు. వాటిని పిల్లలు, మహిళలకు ఇచ్చి ఉత్తరప్రదేశ్‌కు పంపిస్తారు.

వారి సంచుల్లో వనమూలికలు, కత్తిపీటలు ఉంటాయి. దీంతో ఇంటరాగేషన్ కోసం ఆపినప్పుడు వారి వీటిని చూపించి బయటపడతారు'' అని తెలిపారు.

ఇప్పటివరకు ఈ ముఠా ఎంత చందనం దోచుకుంది?

''ఈ రెండున్నర నెలల్లో దొంగిలించిన చందనాన్ని ముక్కలుగా నరికి మహిళలు, పిల్లలతో ఉత్తరప్రదేశ్‌కు పంపించారు. మధ్యప్రదేశ్‌లో ఈ ముఠాను 'పుష్పా గ్యాంగ్' అని పిలుస్తారు. ఈ గంధపు చెక్కలను అమ్మి వారు లక్షల రూపాయలు సంపాదిస్తారు'' అని ఆయన చెప్పారు.

ఈ గ్యాంగ్ ప్రత్యేకత ఏంటంటే, వారు ఇటీవల వచ్చిన పుష్ప సినిమా హీరో ఫొటోలున్న చొక్కాలను ధరిస్తున్నారని విశాల్ తెలిపారు.

''చందనాన్ని అమ్మడం కోసం ఉత్తరప్రదేశ్‌కు వెళ్లిన మహిళలు, పిల్లలతో పాటు కలపను కొనుగోలు చేస్తోన్న సమీర్ అనే వ్యక్తిని పట్టుకోవడానికి మేం ఉత్తర ప్రదేశ్‌కు ఒక ప్రత్యేక బృందాన్ని పంపించాం'' అని ఆయన చెప్పారు.

'గుజరాత్‌లో 70 శాతం చందనం చెట్లు ప్రభుత్వానివే'

చందనం చెట్లు 'రిజర్వ్ ట్రీ' కేటగిరీలోకి వస్తాయి. కాబట్టి, ప్రైవేట్ స్థలాల్లోని చందనం చెట్లను నరికివేయడానికి కూడా ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. చెట్లను నరికివేయడానికి తుది గడువు జూన్ 16 వరకేనని సబర్‌కాంత ఫారెస్ట్ రేంజ్ అధికారి హర్ష్ ఠక్కర్ చెప్పారు.

''దొంగతనాల కేసులు పెరిగినందున ఈ ఏడాది చెట్లను నరికేందుకు ఎక్కువ అనుమతులు ఇచ్చాం. చోరీ కేసులు పెరుగుతున్నందున సెంట్రల్ గుజరాత్, సౌరాష్ట్ర వంటి ప్రాంతాల భద్రత విషయంలో మరింత శ్రద్ధ వహిస్తాం'' అని అన్నారు.

గుజరాత్‌లో గంధపు చెట్ల గురించి హర్ష్ ఠక్కర్ మాట్లాడుతూ, ''కరోనా కారణంగా రెండేళ్లుగా సర్వే చేపట్టలేదు. కానీ, తొందర్లోనే ఇది ప్రారంభమవుతుంది. గుజరాత్‌లోని 70 శాతం చందనం చెట్లు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయనేది మాత్రం స్పష్టం. మిగతా 30 శాతం ప్రైవేటు యాజమాన్యాల వద్ద ఉన్నాయి'' అని అన్నారు.

సంజీవ్ త్యాగి, రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్. ''గుజరాత్‌లో చందనం సాగు పెరిగింది. గతంలో చెట్లు తక్కువగా ఉండి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు ఉండటం వల్ల దొంగతనాలు తక్కువగా జరిగేవి. ఇప్పుడు సాగు పెరగడంతో పాటు రైతులు చెట్లను భద్రంగా చూసుకోకపోవడంతో దొంగతనాలు పెరిగాయని'' ఆయన అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Pushpa Gang: Latest Sandalwood Smuggling,Recie All Day, Stealing At Night
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X