ఇండియా 80: కేంద్రానికి వ్యతిరేకంగా మరో భారీ ఉద్యమం: ఆ కేంద్రమంత్రి..
మొన్నటి దాకా కాక్రోచ్ జనత పార్టీ ఆందోళనలతో అట్టుడికిపోయింది.. యావత్ దేశం. ఈ ఉద్యమాల ధాటికి కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా సైతం చేయాల్సి వచ్చింది. ఇది ఇక్కడితో ఆగట్లేదు. మరో నూతన సామాజిక ఉద్యమం పురుడుపోసుకుంది. ఏకంగా ఏడాదిపాటు కొనసాగబోతోంది. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 80వ సంవత్సరంలో అడుగు పెట్టినందున దీనికి ఇండియా @ 80 అని పేరు పెట్టారు.
మాన్యువల్ స్కావెంజింగ్ వ్యవస్థకు వ్యతిరేకంగా పుట్టుకొచ్చిన ఉద్యమం ఇది. దేశ రాజధానిలో సఫాయి కర్మాచారి ఆందోళన్ ఆధ్వర్యంలో ఏర్పాటైన సభలో ఈ మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. మనుషుల మలాన్ని చేతులతో ఎత్తే ఈ అనాచారం పూర్తిగా అంతరించిపోయిందంటూ పార్లమెంట్ వేదికగా కేంద్ర ప్రభుత్వం చేస్తోన్న ప్రకటనలపై క్షేత్రస్థాయి నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయనడానికి ఇది.. తాజా నిదర్శనం.

ఈ సభలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బిహార్, జమ్మూ కాశ్మీర్ కు చెందిన మహిళా స్కావెంజర్లు హాజరయ్యారు. తమ నిత్య జీవితంలో నేటికీ ఎదుర్కొంటున్న చేదు వాస్తవాలను వెల్లడించారు. ఎన్నో చట్టాలు ఉన్నప్పటికీ ఈ బానిసత్వం నుండి తమకు ఎప్పుడు విముక్తి లభిస్తుందని వారు నిలదీశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఎనిమిది దశాబ్దాలు పూర్తి కాబోతున్న తరుణంలో కూడా ఈ సామాజిక వివక్ష నుంచి క్షేత్రస్థాయిలో ఉన్న పేద ప్రజలకు విముక్తి లభించకపోవడంపై సామాజిక విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేశారు.
దేశంలో మాన్యువల్ స్కావెంజింగ్ వ్యవస్థ పూర్తిగా తొలగిపోయిందంటూ కేంద్రమంత్రి రామ్ దాస్ అథవాలే చేసిన ప్రకటనలను సఫాయి కర్మచారి ఆందోళన్ ఖండించింది. పార్లమెంట్ సాక్షిగా ఆయన అబద్ధాలు చెప్పారంటూ మండిపడింది. ఈ నేపథ్యంలో మాన్యువల్ స్కావెంజర్ వ్యవస్థ నుంచి దేశానికి శాశ్వతంగా విముక్తి చేయడమే ప్రధాన లక్ష్యంగా సఫాయి కర్మాచారి ఆందోళన్ సంఘ్.. ఈ ఉద్యమానికి రూపకల్పన చేసింది. ఇండియా @ 80 పేరిట ఓ సంవత్సరం పాటు సాగే సుదీర్ఘ నిరసన ఉద్యమాన్ని ప్రారంభించింది.
ఈ సభలో పలువురు మహిళా స్కావెంజర్లు మాట్లాడారు. తమ అనుభవాలను కన్నీటితో పంచుకున్నారు. తమ జీవితకాలమంతా ఇతరుల మలమూత్రాలను శుభ్రం చేయడానికే వెచ్చించాల్సి వచ్చిందని, కనీసం చనిపోయే లోపలైనా ఈ దురాచారానికి ముగింపు చూడాలనేదే తమ ఆశ అని ఆవేదన వ్యక్తం చేశారు. జమ్మూ కాశ్మీర్‌లో చేతులతో మరుగుదొడ్లను శుభ్రం చేసే పద్ధతి ఇంకా గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతోందని, భయం వల్ల ఎవరూ దీని గురించి బహిరంగంగా మాట్లాడటం లేదని కాశ్మీర్ ప్రతినిధి ముజఫర్ అహ్మద్ షేక్ చెప్పారు.
15 వయసు నుంచే తాము ఈ అనాగరిక పనులకు బలి అయ్యామని మధ్యప్రదేశ్, బిహార్ నుంచి వచ్చిన మహిళలు చెప్పారు. రాబోయే తరాలైనా ఈ సామాజిక దోపిడీ నుంచి విముక్తి పొందాలని కోరకుంటోన్నామని అన్నారు. సఫాయి కర్మాచారి ఆందోళన్ బోర్డు ప్రతినిధి నారాయణమ్మ మాట్లాడుతూ.. ఈ వివక్షాపూరక దురాచార నిర్మూలన కోసం తన శేషజీవితాన్ని పూర్తిగా అంకితం చేస్తోన్నట్లు పునరుద్ఘాటించారు.
మాజీ న్యాయమూర్తులు జస్టిస్ మదన్ లోకూర్, జస్టిస్ సుధాంశు ధులియా, పాట్నా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అంజనా ప్రకాష్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ పోరాటానికి తమ మద్దతు తెలిపారు. దేశంలో ఇప్పటికీ దాదాపు 40కి పైగా జిల్లాల్లో డ్రై లెట్రిన్ మాన్యువల్ క్లీనింగ్ జోరుగా సాగుతుండటం అత్యంత విచారకరమని ఆందోళన వ్యక్తం చేశారు. మనుషులు మలం మోసే ఈ దురాచారాన్ని దేశం నుంచి పూర్తిగా బహిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం తక్షణ ప్రాధాన్యత కావాలని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత బెజవాడ విల్సన్ మాట్లాడారు. ప్రభుత్వాల అలసత్వ వైఖరిపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. గత నాలుగు దశాబ్దాలుగా తాము చేస్తున్న సుదీర్ఘ పోరాటంలో ఎన్నో సామాజిక మార్పులు సంభవించినప్పటికీ.. మాన్యువల్ స్కావెంజర్ వ్యవస్థ దేశవ్యాప్తంగా ఇంకా సాగుతోండటం శోచనీయమని అన్నారు. కోర్టులకు ఎన్నో సాక్ష్యాలు సమర్పించినా స్పందన లోపించిందని, ఈ ఏడాది కాలంలో ఈ అనాగరిక పద్ధతిని దేశం నుంచి పూర్తిగా రూపుమాపాల్సి ఉంటుందని టూ కేంద్రానికి అల్టిమేటం ఇచ్చారు.
సామాజిక హక్కుల కార్యకర్త దీప్తి సుకుమార్, జయతీ ఘోష్, అతుల్ సూద్, బృందా గ్రోవర్, అంజలి భరద్వాజ్, ప్రబీర్ పురకాయస్థ, గీతా హరిహరన్, సునీత ధర్, నందిని సుందర్, లోకేష్ జైన్ సహా పలువురు ఈ ఉద్యమానికి తమ సంఘీభావం తెలియజేశారు. సఫాయి కార్మికుల హక్కులు, ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు అండగా నిలుస్తామని ప్రతిజ్ఞ చేశారు.












Click it and Unblock the Notifications