పాకిస్తాన్ కు కేంద్రం చెక్- సింధూ నదీ జలాల విషయంలో బిగ్ స్టెప్
సింధూ నదీ జలాల సమస్యపై బెదిరింపులకు పాల్పడుతోన్న పాకిస్తాన్ కు కేంద్ర ప్రభుత్వం బిగ్ చెక్ పెట్టింది. ఇండస్ వాటర్ ట్రీటీ ఒప్పందం అబెయన్స్ లో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ దిశగా అడుగులు వేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సింధూ నదిపై కేంద్ర పాలిత ప్రాంతం లడఖ్ లో ఓ భారీ రాక్ ఫిల్ డ్యామ్ ను నిర్మించింది కూడా. సరిహద్దు గ్రామాల్లో నీటి కొరత సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు పాకిస్తాన్ దూకుడుకూ మూకుతాడు వేసినట్టవుతుందని కేంద్రం భావిస్తోంది.
లేహ్‌లోని ఉప్షి వద్ద సింధు నదిపై దేశంలోనే మొట్టమొదటి రాతి ఫిల్ చెక్ డ్యామ్‌ను నిర్మించింది. ఈ ఆనకట్ట నిర్మాణం పూర్తిగా పర్యావరణ అనుకూల పద్ధతిలో సాగింది. సిమెంట్ రహిత కట్టడం ఇది. బౌల్డర్స్, మట్టితో నిర్మించిన రాక్ ఫిల్ డ్యామ్ ఇది. ఈ ప్రాజెక్ట్ అందుబాటులోకి రావడం వల్ల సింధు నది నీటి మట్టం ఒక్కసారిగా 10 అడుగుల మేర పెరిగింది.

సింధు నది లోయల గుండా ప్రవహిస్తోండటం వల్ల ఈ నీటిని వ్యవసాయ అవసరాల కోసం వినియోగించుకోవడానికి పంపింగ్ చేయాల్సి వచ్చేది. రైతులకు ఇది ఖర్చుతో కూడుకున్న పని. దీనివల్ల నీటి కొరత ఏర్పడి, పంటలు ఎండిపోయేవి. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ చెక్ డ్యామ్ ను నిర్మించింది కేంద్రం. దాదాపు 40 మిలియన్ లీటర్ల నీటిని నిల్వ చేయవచ్చిక్కడ. ఇగూ ఫే నీటి పారుదల కాలువ ద్వారా సాగు అవసరాలకు నీటిని తరలిస్తోంది.
ఇది ఇక్కడితో ఆగట్లేదు. 56 కోట్ల రూపాయల వ్యయంతో సింధు నదిపై మరో 36 కొత్త చెక్ డ్యామ్‌లను నిర్మించాలని కేంద్రం ప్రతిపాదించింది. లేహ్ పరిధిలో ఏడు, కార్గిల్ రీజియన్ లో 29 చెక్ డ్యామ్‌లు, చిన్న చిన్న ఆనకట్టలను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇప్పటికే పనులు కూడా ప్రారంభం అయ్యాయి. హిమాలయ పర్వత శ్రేణులలో పర్యావరణ సమతుల్యతను దెబ్బతీయకుండా, సహజ వనరులతో నిర్మిస్తున్న ఈ రాతి ఆనకట్టలు భవిష్యత్తు సాగునీటి అవసరాలకు మోడల్‌గా నిలవనున్నాయి.
సింధూ నదీ జలాల విషయంలో దూకుడుగా వ్యవహరిస్తోన్న పాకిస్తాన్ కు వీటి నిర్మాణంతో బిగ్ చెక్ పెట్టినట్టయింది. తమకు రావాల్సిన వాటా కోసం అంతర్జాతీయ వేదికలపై పోరాడతామంటూ ఇటీవలే ఎస్సీఓ సదస్సులో ప్రకటించారు పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్. సింధు, చీనాబ్ నదీ జలాలే తమకు జీవనాధారమని, వీటి విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అదే సమయంలో కేంద్రం రాక్ ఫిల్ డ్యామ్ ను పూర్తి చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఒప్పందంలో భాగంగా సాగు నీటి అవసరాల కోసం పాకిస్తాన్.. సింధు, చీనాబ్ ప్రవాహంపైనే ఎక్కువగా ఆధారపడుతుంటుంది. 1960లో కుదిరిన సింధు జలాల ఒప్పందం ప్రకారం జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్ నదుల నీటి వినియోగ హక్కులను భారత్, పాకిస్తాన్ మధ్య విభజించారు. సరిహద్దుల్లో ఉగ్రవాద చర్యలకు పాక్ స్వస్తి పలికే వరకు ఈ నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు భారత్ గత ఏడాది ప్రకటించిన విషయం తెలిసిందే.













Click it and Unblock the Notifications