శ్రీరామనవమి శోభాయాత్రల్లో ముస్లింలపై దాడులు-ఖండించిన ఇస్లామిక్ దేశాలు-తిప్పికొట్టిన భారత్
భారత్ లో శ్రీరామనవమి సందర్భంగా చేపట్టిన శోభాయాత్రల్లో పలు రాష్ట్రాల్లో ముస్లింలపై దాడులు జరుగుతున్నాయి. వీటిని నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నా ఇంకా పలుచోట్ల ఉద్రిక్తతలు సద్దుమణగడం లేదు. దీనిపై ముస్లిం దేశాల సమాఖ్య ఓఐసీ తీవ్రంగా స్పందించింది. ఇది ఇస్లామోఫోబియాకు నిదర్శమని తెలిపింది. ఈ వ్యాఖ్యలపై భారత్ మండిపడింది.
శ్రీరామనవమి సందర్భంగా చేపట్టిన శోభాయాత్రల్లో బీహార్, బెంగాల్, గుజరాత్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో మతపరమైన హింస చోటు చేసుకుంది. దీనిపై ఇప్పటికే ఆయా రాష్ట్రాలు స్పందించి అదుపు చేశాయి. అయితే ఈ ఘటనలపై ఇస్లామిక్ దేశాల సమాఖ్య ఓఐసీ(ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్) స్పందించింది. రామనవమి యాత్రల సందర్భంగా ముస్లింలను టార్గెట్ చేయడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దీన్ని భారత్ లో ఇస్లామోఫోబియాగా అభివర్ణించింది.

రామనవమి వేడుకల సందర్భంగా అనేక రాష్ట్రాల్లో ముస్లిం సమాజాన్ని లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపిస్తూ ఇస్లామిక్ దేశాల సమాఖ్య చేసిన ప్రకటనను విదేశాంగ మంత్రిత్వ శాఖ ఖండించింది. భారత వ్యతిరేక శక్తులకు ప్రభావితం కావడం ఓఐసీ ప్రతిష్టను దెబ్బతీస్తోందంటూ విదేశాంగ ప్రతినిధి అరిందమ్ బాగ్చి వ్యాఖ్యానించారు. ఇది వారి మతతత్వ మనస్తత్వం, భారత వ్యతిరేక ఎజెండాకు మరో ఉదాహరణ అని పేర్కొన్నారు.
ఇస్లామిక్ దేశాల సమాఖ్య తరచూ భారత్ ను ఉద్దేశించి చేస్తున్న ఇలాంటి ప్రకటనలపై ఇప్పటికే మార్చి 31న జెనీవాలో ఐరాస మానవహక్కుల కౌన్సిల్లో భారత శాశ్వత ప్రతినిధి సీమా పూజానీ కూడా తప్పుబట్టారు. భారత్ కు వ్యతిరేకంగా పాకిస్తాన్ చేస్తున్న దుష్ప్రచారాన్ని అడ్డుకోవడంలో విఫలమైన ఇస్లామిక్ దేశాల సమాఖ్య మన దేశాన్ని నిందించడం సరికాదని తెలిపారు. సమస్యల పట్ల కఠోరమైన మతతత్వ, పక్షపాత, తప్పుడు వైఖరిని అవలంబించడం ద్వారా ఓఐసీ తన విశ్వసనీయతను కోల్పోయిందని అన్నారు.












Click it and Unblock the Notifications