పగులుతున్న కరోనా పుట్ట: దేశంలో 2.60 లక్షలకు పైగా: టాప్-5 రాష్ట్రాలివే..
న్యూఢిల్లీ: దేశంలో ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి మరోసారి తీవ్ర రూపాన్ని దాల్చింది. శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇదివరకటి కంటే వేగంగా విస్తరిస్తోంది కోవిడ్ మహమ్మారి. కొత్త కేసులు రోజురోజుకూ బిత్తర పోయేలా పెరుగుతున్నాయి. ఏపీ, తెలంగాణ సహా అన్ని రాష్ట్రాల్లోనూ వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. అత్యధికంగా మహారాష్ట్రలో ఒక్కరోజే 46 వేలకు పైగా కొత్త కేసులు రికార్డయ్యాయి. తమిళనాడు, కేరళల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఒమిక్రాన్ వేరియంట్ దీనికి తోడైంది. ఈ కేసులు అయిదువేలను దాటాయి.
దేశంలో పలు నగరాల్లో థర్డ్‌వేవ్ మొదలైంది. తాజాగా బులెటిన్ ప్రకారం..ఒక్కరోజులోనే 2,64,202 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 315 మంది మరణించారు. 1,09,345 మంది డిశ్చార్జ్ అయ్యారు. కోవిడ్ నుంచి సంపూర్ణంగా కోలుకున్నారు. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 31,98,89,263కు చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా భారీగా పెరిగింది. 13 లక్షలకు చేరువ అయ్యాయి.
యాక్టివ్ కేసులు 12,72,073 గా రికార్డయ్యాయి. 4,85,350 మంది ఇప్పటిదాకా మహమ్మారి బారిన పడి ప్రాణాలొదిలారు. పాజిటివిటీ రేటు 14.78 శాతంగా నమోదైంది. అదే సమయంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగుతోంది. ఇప్పటిదాకా మొత్తంగా 155,39,81,819 డోసుల వ్యాక్సిన్‌ను ఇచ్చారు. గురువారం ఒక్కరోజే 73,08,669 మేర డోసుల టీకాలు వినియోగమైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తన తాజా బులెటిన్‌లో వెల్లడించింది.

ఒమిక్రాన్ కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. రోజువారీ పాజిటివ్ కేసులు నాలుగు వేలను దాటాయి. ఇప్పటిదాకా 5,753 కేసులు రికార్డయ్యాయి. కరోనా వైరస్ అత్యధిక సంఖ్యలో నమోదైన రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక, కేరళ, తమిళనాడు తొలి అయిదు స్థానాల్లో కొనసాగుతున్నాయి. మహారాష్ట్రలో 46,406 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ-28,867, కర్ణాటక-25,005, తమిళనాడు-20,911, కేరళ-13 వేలకుపైగా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి.
కరోనా వైరస్ పాజిటివ్ కేసులకు తగ్గట్టుగా కరోనా మరణాలు క్రమంగా పెరుగుదల బాట పట్టాయి. కొత్తగా 315 మంది మరణించారు. ఇదివరకటితో పోల్చుకుంటే మరణాల సంఖ్య తక్కువేనని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు చెబుతున్నారు. వ్యాక్సిన్ వేసుకున్నందు వల్ల చాలామంది పేషెంట్లు.. కోవిడ్ బారిన పడినప్పటికీ.. త్వరితగతిన కోలుకుంటున్నారని స్పష్టం చేస్తోన్నారు. అందుకే- ప్రతి ఒక్కరూ కోవిడ్ డోసులను తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తోన్నారు.












Click it and Unblock the Notifications