కెనడా వీసాలను పునరుద్ధరించిన భారత్: ఈ 4 కేటగిరీలు మాత్రమే
న్యూఢిల్లీ: ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత కెనడా-భారత్ మధ్య దౌత్య పరమైన ఉద్రిక్తలు ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వీసాలను నిలిపేస్తూ భారత్ నిర్ణయం తీసుకుంది. అయితే, తాజాగా, కెనడా పౌరుల కోసం వీసా సేవల్ని పునరుద్ధరించింది. ఈ మేరకు ఒట్టావాలోని భారత రాయబార కార్యాలయం బుధవారం ప్రకటన విడుదల చేసింది. అయితే, ఇది కొన్ని రకాల వీసాలకే పరిమితమైంది.
ఎంట్రీ వీసా, బిజినెస్ వీసా, మెడికల్ వీసా, కాన్ఫరెన్స్ వీసాలను మాత్రమే జారీ చేస్తున్నట్లు ప్రకటించింది. అక్టోబర్ 26 నుంచి తాత్కాలికంగా ఈ వీసా సేవల్ని అందించనున్నట్లు ఆ ప్రకటనలో భారత హైకమిషన్ స్పష్టం చేసింది. భద్రతా కారణాల దృష్ట్యా ఇంతకాలం వీటిని నిలిపివేయాల్సి వచ్చిందని, సమీక్షించిన అనంతరం తిరిగి ఈ సేవలను ప్రారంభిస్తున్నట్లు భారత హైకమిషన్ స్పష్టం చేసింది.

ఇక పరిస్థితులను బట్టి తదుపరి నిర్ణయాలు ఉంటాయని భారత హైకమిషన్ పేర్కొంది. కాగా, ఈ ఏడాది జూన్ నెలలో కెనడాలోని సర్రే ప్రాంతంలో గురుద్వారా వెలుపల ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు అతడ్ని హత్య చేశారు. అయితే, ఈ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించడం ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలకు దారితీసింది.
ఇక కెనడాలోని సీనియర్ భారత్ దౌత్యవేత్తను బహిష్కరించారు. దీంతో భారత్ కూడా కెనడాకు కౌంటర్ ఇచ్చింది. కెనడియన్ దౌత్యవేత్తను బహిష్కరించింది భారత్. కెనడా చేస్తున్న ఆరోపణలను అసంబద్ధ, రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలంటూ కొట్టిపారేసింది. కెనడా ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిందని భారత విదేశాంగ శాఖ ఘాటుగా స్పందించింది.
ఈ పరిణామాల నేపథ్యంలో ఇరుదేశాల మధ్య వీసా సేవలు నిలిపివేయబడ్డాయి. కెనడాలోని భారత దౌత్యవేత్తల భద్రతలో పురోగతి ఉంటే కెనడాకు వీసా సేవల్ని పునరుద్ధరిస్తామని భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే వీసా సేవలు ప్రారంభం కావడం గమనార్హం.












Click it and Unblock the Notifications