ఆందోళనకరంగా కరోనా విస్తరణ: మరిన్ని లాక్‌డౌన్లు: సూపర్ స్ప్రెడర్లు ఎవరో కాదు: ఐఎంఎస్‌సీ
చెన్నై: ప్రాణాంతక కరోనా వైరస్ బారి నుంచి దేశం ఇప్పుడిప్పుడే కుదురుకుంటోంది. రోజువారీ పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. కరోనా మరణాలూ ఇదివరకట్లా భయాందోళనకు గురి చేయట్లేదు. సోమవారం నాటి బులెటిన్ ప్రకారం.. దేశంలో 37,154 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 724 మంది మరణించారు. కరోనా వైరస్ అదుపులోనే ఉందనే సంకేతాలను పంపిస్తోన్నాయి ఈ అంకెలు. ఫలితంగా- అన్ని రాష్ట్రాలు కరోనా వైరస్ ఆంక్షలను సడలించాయి. దేవస్థానాలు, పర్యాటక కేంద్రాలకు ద్వారాలు తెరిచాయి.

సానుకూల పరిస్థితులు ఎన్నిరోజులు..
రాష్ట్రాల మధ్య యథేచ్ఛగా రాకపోకలు సాగించే వాతావరణం ఉంది. ఇది ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు. దేశం మరోసారి లాక్‌డౌన్ తరహా పరిస్థితుల్లోకి జారిపోవడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చు. కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మళ్లీ మునుపట్లా లక్షల సంఖ్యలో నమోదయ్యే అవకాశాలు లేకపోలేదు. దీనికి కారణం- దేశంలో క్రమంగా కరోనా వైరస్ ఆర్-వేల్యూ పెరుగుతోండటమే. జూన్ మొదటి వారంతో పోల్చుకుంటే.. రెండోవారంలో ఆర్-వేల్యూ ఆందోళనకరంగా పెరిగిందని నిపుణులు హెచ్చరిస్తోన్నారు. కరోనా వైరస్ రీప్రొడక్టివిటీని నిపుణులు ఆర్ వేల్యూగా భావిస్తారు.

సూపర్ స్ప్రెడర్లుగా..
ముందు జాగ్రత్త చర్యలను తీసుకునే విషయంలో నెలకొన్న అశ్రద్ధ దీనికి కారణమౌతోందని చెబుతోన్నారు. మనకు మనమే సూపర్ స్ప్రెడర్లుగా మారుతోన్నామని స్పష్టం చేస్తోన్నారు. కరోనా వైరస్ ఆర్-వేల్యూ పెరుగుదలపై చెన్నైలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేథమేటికల్ సైన్సెస్ (ఐఎంఎస్‌సీ) సైంటిస్టులు చేసిన పరిశోధనల ఫలితాలు థర్డ్‌వేవ్ ముప్పును సూచిస్తోన్నాయి. ఐఎంఎస్‌సీ కంప్యుటేషనల్ బయాలజీ డీన్, ఫిజిక్స్ ప్రొఫెసర్ సితభ్ర సిన్హ నేతృత్వంలోని సైంటిస్టుల టీమ్ కరోనా ఆర్-వేల్యూపై అధ్యయనం చేసింది.

ఆర్ వేల్యూలో పెరుగుదల
ఈ ఏడాది ఫిబ్రవరి నాటి పరిస్థితులు అంటే.. సెకెండ్ వేవ్ ప్రారంభానికి ముందు కరోనా వైరస్ రీప్రొడక్టివిటీ వేల్యూలో ఏ స్థాయిలో పెరుగుదల కనిపించిందో.. అలాంటి తీవ్రతే ఇప్పుడూ ఉందని హెచ్చరించారు. ఫిబ్రవరిలో 0.93గా ఉన్న ఆర్ వేల్యూ క్రమంగా 1.02కు పెరిగడం సెకెండ్ వేవ్‌కు దారి తీసింది. ఏప్రిల్‌లో గరిష్ఠంగా 1.31కు చేరింది. ఇప్పుడు కూడా కరోనా ఆర్ వేల్యూ పెరుగుతోందని, కిందటి నెల 30వ తేదీ నాటికి 0.78గా ఉన్న ఈ సంఖ్య ప్రస్తుతం 0.88కు చేరిందని సితభ్ర సిన్హ తెలిపారు.
Recommended Video

ఈ సారి ఆ రాష్ట్రాలపై
అతి కొద్దిరోజుల్లో ఈ సంఖ్యలో భారీ పెరుగుదల కనిపించడం ఆందోళన కలిగిస్తోందని, థర్డ్‌వేవ్ ముప్పును సూచిస్తోందని చెప్పారు. అన్‌లాక్ ప్రక్రియలో భాగంగా తీసుకున్న కొన్ని నిర్ణయాలు అవాంఛనీయమైనవిగా కనిపిస్తోన్నాయని ఈ టీమ్ అభిప్రాయపడింది. సూపర్ స్ప్రెడర్లుగా మారుతున్నాయని పేర్కొంది. ప్రత్యేకించి- ఈశాన్య రాష్ట్రాలు మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, త్రిపురల్లో పరిస్థితులు చేయి దాటిపోయే ప్రమాదం ఉందని, అక్కడి నుంచి వైరస్ విస్తరించడానికి అనుకూల పరిస్థితులు ఉంటాయని అంచనా వేస్తోన్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications