తొలి ప్రైవేట్ రైలు తేజస్ దోపిడీ చూశారా ? వందేభారత్, శతాబ్ది, రాజధానిని మించి..!
2019లో భారతీయ రైల్వే సంస్కరణల్లో భాగంగా తొలి ప్రైవేటు రైలును అందుబాటులోకి తెచ్చింది. రైల్వే అనుబంధ విభాగం ఐఆర్సీటీసీ తేజస్ పేరుతో దీన్ని అందుబాటులోకి తెచ్చింది. ఐదేళ్లుగా ఈ రైలు ఢిల్లీ-లక్నో రూట్లో పరుగులు తీస్తోంది. అయితే ఇందులో ఛార్జీలు మాత్రం దేశంలోనే ప్రీమియర్ రైళ్లుగా పేరున్న వందే భారత్, శతాబ్ది, రాజధాని కంటే ఎక్కువగా ఉంటున్నాయి. దీంతో ఈ రైలు ఎక్కాలంటేనే జనం భయపడుతున్నారు.
దేశంలో మొట్టమొదటి ప్రైవేట్ రైలు తేజస్ ఎక్స్‌ప్రెస్ దేశంలో అత్యంత ఆదరణ కలిగిన రూట్లలో ఒకటైన న్యూఢిల్లీ-లక్నో మధ్య నడుపుతున్నారు. 2019 అక్టోబర్ 4న దీన్ని ప్రారంభించారు. కేవలం ఒక నెలలోనే ఈ తేజస్ ఎక్స్‌ప్రెస్ ఐఆర్సీటీసీకి దాదాపు రూ.7.73 లక్షల ఆదాయాన్ని ఇచ్చింది. ఇక అక్కడి నుంచి ఇది ఐఆర్సీటీసీకి కాసులు కురిపిస్తూనే ఉంది. అయితే ఐదేళ్లు పూర్తవుతున్నా ఈ రైలు ద్వారా కేవలం ఐఆర్సీటీసీ లాభపడుతుండగా.. ప్రయాణికులకు మాత్రం మోత మోగుతోంది.

తేజస్ ఎక్స్‌ప్రెస్‌లో న్యూఢిల్లీ-లక్నో మధ్య ప్రయాణించడానికి ఏసీ చైర్ కార్‌కు రూ.1,679 వసూలు చేస్తుండగా.. ఇదే రూట్ లో శతాబ్ది, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో మాత్రం ఏసీ చైర్ కార్‌కు రూ.1,255 మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు. అలాగే ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ఛార్జీలు తేజస్ లో రూ.2457 ఉండగా.. శతాబ్దిలో రూ.1,955, వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో రూ.2,415 ఉన్నాయి. అలాగే ఇదే రూట్ లో రాజధాని ఎక్స్ ప్రెస్ లో ఏసీ థర్డ్ టైర్ రూ.1,590, ఏసీ సెకండ్ టైర్ రూ.2,105, ఏసీ ఫస్ట్ క్లాస్ రూ.2,630 వసూలు చేస్తున్నారు.

తేజస్ ఎక్స్‌ప్రెస్ ఆధునిక ఆన్‌బోర్డ్ సౌకర్యాలు, మెరుగైన ప్రయాణీకుల సౌకర్యాన్ని కలిగి ఉన్న సెమీ హై స్పీడ్ రైలు. ఈ కోచ్‌లను కపుర్తలాలోని రైల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారు చేస్తారు. కొత్తగా రూపొందించిన కోచ్‌లు గంటకు 200 కి.మీ వేగంతో ప్రయాణించేందుకు వీలుగా తయారు చేసారు. కానీ రైలు పట్టాల పరిమితుల కారణంగా ఈ కోచ్‌లు గంటకు 160 కి.మీ వేగంతో నడుస్తాయి. స్టీల్ బ్రేక్ డిస్క్, సింటెర్డ్ ప్యాడ్‌లు, ఎలక్ట్రో-న్యూమాటిక్ అసిస్ట్ బ్రేక్ సిస్టమ్‌ను అందించడం ద్వారా 200 కి.మీ. వేగ సామర్థ్యాన్ని సాధించారని రైల్వే శాఖ 2017లో ప్రకటించింది.












Click it and Unblock the Notifications