99 దేశాల ప్రజలకు క్వారంటైన్ లేకుండా భారత్ లోకి ఎంట్రీ-ఆ ఒక్క షరతుతో కేంద్రం నిర్ణయం
గతేడాది మార్చిలో కోవిడ్ వ్యాప్తి ప్రారంభమైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం.. విదేశాల నుంచి ప్రయాణికుల రాకపై ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షల్ని మధ్యలో అక్కడక్కడా సడలించినా పూర్తిస్దాయిలో మాత్రం నిషేధం ఎత్తేయలేదు. వీటి ప్రకారం భారత్ కు రావాలనుకునే విదేశీ ప్రయాణికులు ఎవరైనా ఇక్కడ 14రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాల్సిందే. దీన్ని ఇన్నాళ్లూ కచ్చితంగా అమలు చేసిన కేంద్రం.. ఇఫ్పుడు 99 దేశాలకు మినహాయింపు ఇచ్చింది.
99 దేశాల నుంచి భారత్ లోకి వచ్చే ప్రయాణికులు వ్యాక్సిన్ రెండు డోసులు వేయించుకుంటే మాత్రం ఎలాంటి క్వారంటైన్ లేకుండా నేరుగా అనుమతించాలని కేంద్రం నిర్ణయించింది.ఇందులో అమెరికా, బ్రిటన్, ఖతార్, ఫ్రాన్స్, జర్మనీతో పాటు పలు దేశాలు ఉన్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కోవిడ్ ప్రభావం తగ్గడంతో అక్టోబర్ 15 నుంచి భారత్ లో పర్యాటక రంగానికి ఊతమిచ్చేందుకు కేంద్రం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. వీటి ప్రకారం.. విదేశీయుల్ని నాన్ ఛార్టర్డ్ విమానాల్లో అనుమతిస్తున్నారు. అయితే గతంలో విధించిన క్వారంటైన్ నిబంధనలు వీటికి అఢ్డంకిగా మారాయి. దీంతో భారత్ వీటిలో మినహాయింపు ఇస్తూ నిర్ణయం తీసుకుంది.

విదేశాల నుంచి భారత్ బయలుదేరే ప్రయాణికులు 72 గంటల ముందు కోవిడ్ నెగెటివ్ ధృవపత్రంతో పాటు రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్నట్లు సర్టిఫికెట్ ను కూడా అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. అలా చేసిన వారికి మాత్రమే ఎలాంటి క్వారంటైన్ లేకుండా భారత్ లోకి అనుమతించాలని భారత్ నిర్ణయించింది. భారత్ వచ్చే పర్యాటకులు ఎలాగో షెడ్యూల్ ప్రయాణాలే చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ నిబంధనల్ని తప్పనిసరిగా అమలు చేసేందుకు వీలుంటుందని కేంద్రం భావిస్తోంది.
క్వారంటైన్ లేకుండా పర్యాటకుల్ని భారత్ అనుమతించిన దేశాల జాబితాను విదేశాంగ శాఖ తమ వెబ్ సైట్లో అందుబాటులో ఉంచింది. ఈ దేశాలు మినహా మిగిలిన దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు మాత్రం క్వారంటైన్ నిబంధనలు యథావిధిగా అమలు చేస్తామని కేంద్రం చెబుతోంది. భారత్ లో ఇప్పటికే కోవిడ్ వ్యాప్తి తగ్గినా పరిస్ధితులు పూర్తిగా కొలిక్కి రాలేదు. దీంతో ఇలాంటి సమయంలో విదేశాల నుంచి వైరస్ లు వ్యాప్తి చెందితే తిరిగి పరిస్ధితులు చేయిదాటిపోతాయని భారత్ భయపడుతోంది. దీంతో మరికొంతకాలం ఆంక్షలు కొనసాగే అవకాశముంది.












Click it and Unblock the Notifications