భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు నేడు బైపాస్ సర్జరీ చెయ్యనున్న ఎయిమ్స్ వైద్య బృందం
భారతదేశ రాష్ట్రపతి, దేశ ప్రథమ పౌరుడు అయిన రామ్ నాథ్ కోవింద్ కు నేడు ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) లో బైపాస్ సర్జరీ నిర్వహించనున్నారు. ఛాతీ అసౌకర్యం నేపథ్యంలో దేశ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌ను గత వారం ఎయిమ్స్‌కు తరలించారు.రాష్ట్రపతి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉంది . ఆయనను నిరంతరం వైద్య నిపుణులు పర్యవేక్షిస్తున్నారు అని రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనలో తెలిపింది.

ఢిల్లీ ఎయిమ్స్ లో చికిస పొందుతున్న రామ్ నాథ్ కోవింద్
75 ఏళ్ల కోవింద్ శుక్రవారం ఉదయం ఛాతి అసౌకర్యంతో ఆర్మీ (ఆర్‌అండ్‌ఆర్) ఆసుపత్రిలో ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. ఆ తర్వాత ఆయనను ఆర్మీ ఆస్పత్రిలో అబ్జర్వేషన్లో ఉంచారు. మరుసటి రోజు మెరుగైన వైద్యం కోసం భారత రాష్ట్రపతి, రామ్ నాథ్ కోవింద్ ను (మార్చి 27, 2021) మధ్యాహ్నం ఢిల్లీలోని ఎయిమ్స్ కు పంపారు. ఎయిమ్స్ లో పరీక్షలు నిర్వహించిన తర్వాత , మార్చి 30, మంగళవారం ఉదయం ఆయన బైపాస్ సర్జరీ చేయించుకోవాలని వైద్యులు ఆయనకు సూచించారు.

నేడు ఆయనకు బైపాస్ ప్రక్రియ .. ఆయన ఆరోగ్యంపై ప్రముఖుల ఆరా
దీంతో ఈ రోజు ఆయనకు బైపాస్ ప్రక్రియ నిర్వహించనున్నారు. ఇక ఆయన ఆరోగ్యంపై కేంద్రంలో అధికారంలో ఉన్న మంత్రులు , పార్టీ ప్రముఖులే కాకుండా , అందరూ ఆరా తీస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పటికప్పుడు రామ్ నాథ్ కోవింద్ ఆరోగ్య పరిస్థితిని ఆయన కుమారుడిని అఫిగి తెలుసుకుంటున్నారు. ఇక ఆస్పత్రి వైద్యులను సైతం అడిగి తెలుసుకుంటున్నారు. రామ్ నాథ్ కోవింద్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్య వర్గాలు చెప్తున్నాయి.

ఆస్పత్రిలో ఉండే ఢిల్లీ ఎల్జీకి అధికారాలిచ్చే బిల్లుకు ఆమోదం తెలిపిన కోవింద్
ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం పని చేస్తున్న క్రమంలో, కేజ్రీ ప్రభుత్వం కంటే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కు అధిక అధికారాలు కల్పిస్తూ , గవర్నర్ (ఎల్-జి) కు ప్రాముఖ్యతనిచ్చే బిల్లుకు భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆసుపత్రిలో చేరిన ఒక రోజు తర్వాత ఆదివారం రోజు ఆమోద ముద్ర వేశారు . ఆసుపత్రిలో ఉండే ఈ బిల్లును భారత రాష్ట్రపతి ఆమోదించారు. చట్టం ప్రకారం, ఢిల్లీలో "ప్రభుత్వం" అంటే "లెఫ్టినెంట్ గవర్నర్" అని మరియు నగర ప్రభుత్వం ఏదైనా కార్యనిర్వాహక చర్య తీసుకునే ముందు ఎల్-జి యొక్క అనుమతి పొందాల్సి ఉంటుంది. పార్లమెంటు గత వారం ఈ బిల్లును ఆమోదించింది. మార్చి 22 న లోక్సభ, మార్చి 24 న రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదం పొందింది.