ఈడీ విచారణకు అనిల్ అంబాని- వెంటాడుతున్న ఆ కేసు
ముంబై: ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబాని.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణను ఎదుర్కొంటోన్నారు. ఇవ్వాళ ఆయన ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈ ఉదయం 10 గంటలకు ముంబైలోని కార్యాలయానికి చేరుకున్నారు. సాయంత్రం వరకూ విచారణ కొనసాగింది. ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (ఫెమా) కేసు ఆయనను వెంటాడుతోంది.
ఇదివరకు ఫెమా కిందే 2020లోనూ అనిల్ అంబాని ఈడీ విచారణను ఎదుర్కొన్నారు. ఇప్పుడు మళ్లీ ఈ కేసును ఈడీ అధికారులు తిరగదోడారు. ఎస్ బ్యాంక్ నుంచి తీసుకున్న రుణాల వ్యవహారం ఆయనను ఇబ్బందుల్లోకి నెట్టిందనే ప్రచారం జరుగుతోంది. ఈ కేసులో ఎస్ బ్యాంక్ సహ వ్యవస్థాపకుడు రాణా కపూర్ ఇదివరకే అరెస్ట్ అయ్యారు.

తాజాగా ఈ ఎస్ బ్యాంక్ లోన్ల వ్యవహారం ఆయన మెడకు చుట్టుకుంది. ఎస్ బ్యాంక్ నుంచి రుణాలను తీసుకున్న వ్యవహారంలో ఆయన ఫెమా, ఎక్స్ఛేంజ్ నిబంధనలను ఉల్లంఘించినట్లు చెబుతున్నారు. ఈ ఉదయం ముంబైలోని బల్లార్డ్ ఎస్టేట్ ప్రాంతంలో గల ఈడీ విచారణకు ఆయన హాజరయ్యారు. సాయంత్రం వరకూ ఆయనపై ప్రశ్నల వర్షాన్ని కురిపించారు అధికారులు. ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారు.
గతంలోనూ అనిల్ అంబానీ కొన్ని ఆర్థికపరమైన కేసులను ఎదుర్కొన్నారు. 420 కోట్ల రూపాయల పన్ను ఎగవేత కేసు ఆయనపై ఉంది. ఈ కేసులో అనిల్ అంబానిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ గత సంవత్సరం సెప్టెంబర్‌లో బోంబే హైకోర్టు ఆదాయపు పన్ను శాఖ అధికారులకు ఆదేశాలను జారీ చేసింది. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది.
అదే సమయంలో ఈడీ వ్యవహారం కూడా అనిల్ అంబానీ మీద పడటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎస్ బ్యాంక్ రుణాల వ్యవహారం తీవ్రమైనదిగా పరిగణిస్తోన్నారు. ఇప్పటికే బ్యాంక్ సహ వ్యవస్థాపకుడు రాణా కపూర్ అరెస్టయిన నేపథ్యంలో- అనిల్ అంబానీపై పునఃప్రారంభమైన ఈ విచారణ ఎక్కడికి దారి తీస్తుందనేది చర్చనీయాంశమైంది.












Click it and Unblock the Notifications