
INDvsPAK: పాకిస్తాన్‌లో జయ్ షాపై ఆగ్రహం, సౌరవ్ గంగూలీపై ప్రశంసలు ఎందుకు?

- ఆసియా కప్-2023ను పాకిస్తాన్‌కు బదులుగా తటస్థంగా ఉండే వేరొక దేశంలో నిర్వహించాలని జయ్ షా సూచించారు
- ఐసీసీ వరల్డ్ కప్-2023ను కూడా భారత్‌కు బదులుగా వేరే దేశంలో నిర్వహించాలని పాకిస్తాన్ డిమాండ్ చేస్తోంది
- 2018లో ఆసియా కప్ భారత్‌లో నిర్వహించాల్సి ఉంది. కానీ, కొన్ని కారణాల వల్ల దీన్ని యూఏఈకి మార్చారు
- ప్రస్తుతం జయ్ షా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని పాకిస్తాన్ ఆరోపిస్తోంది
- ఐసీసీ వరల్డ్ కప్-2023కు భారత్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది
భారత హోం మంత్రి అమిత్ షా కుమారుడు జయ్ షా తాజా మరో వివాదానికి తెరతీశారు.
బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) సెక్రటరీగా జయ్ షా కొనసాగుతున్నారు. మరోవైపు ఆసియా క్రికెట్ కౌన్సిల్‌కు కూడా ఆయన అధ్యక్షుడు.
అయితే, ఆసియా కప్ మ్యాచ్‌లు ఆడేందుకు పాకిస్తాన్‌కు భారత్ వెళ్లబోదని మంగళవారం జయ్ షా చెప్పారు. ఆ టోర్నమెంటు వేదికను మార్చాలని, తటస్థంగా ఉండే మూడో దేశంలో నిర్వహించాలి ఆయన పిలుపునిచ్చారు.
అయితే, జయ్ షా వ్యాఖ్యలపై పాకిస్తాన్ నుంచి నిరసన వ్యక్తమైంది.
కేవలం భారత్ రావడానికి సిద్ధంగాలేదని ఆసియా కప్‌ను వేరే దేశానికి మార్చితే, పాకిస్తాన్ ధీటైన సమాధానం ఇస్తుందని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) వ్యాఖ్యానించింది.
https://twitter.com/TheRealPCB/status/1582656626854547456
జయ్ షా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని, దీని పరిణామాలు ఎలా ఉంటాయని అసలు ఆయన ఆలోచించడంలేదని పీసీబీ వ్యాఖ్యానించింది.
''అలాంటి వ్యాఖ్యల వల్ల ఆసియా, అంతర్జాతీయ క్రికెట్ కమ్యూనిటీలో విభేదాలు మరింత పెరుగుతాయి. 2023లో భారత్‌లో జరగబోయే ఐసీసీ వరల్డ్ కప్‌కు పాకిస్తాన్ క్రీడాకారులు వెళ్లే అంశాన్ని ఇవి ప్రభావితం చేయొచ్చు. అంతేకాదు 2024, 2031లలో భారత్‌లో చాలా ఐసీసీ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇప్పుడు భారత్ చేస్తున్నట్లే పాకిస్తాన్ కూడా చేయొచ్చు’’అని పీసీబీ ఒక ప్రకటన విడుదలచేసింది.
ఆసియా కప్‌ను ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) నిర్వహిస్తుంది. 2023లో ఈ కప్‌కు పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. అయితే, టోర్నమెంటు వేదికను మార్చే అంశంపై తమకు ఏమీతెలియదని ఏసీసీ చెబుతోంది.
- టీ20, వన్డే, టెస్టు ఫార్మాట్లలో టీమిండియా కెప్టెన్లలో ఎవరు బెస్ట్?
- వరల్డ్ కప్ క్రికెట్ 2019: ఎంఎస్కే ప్రసాద్ అండ్ కంపెనీ ఆడిన క్రికెట్ ఎంత...

పీసీబీ ఆగ్రహం ఎందుకు?
''అసలు ఏసీసీ నుంచి మాకు ఎలాంటి అధికారిక సమాచారమూ రాలేదు. ఈ విషయంపై కౌన్సిల్ అత్యవసరంగా సమావేశం కావాలని పీసీబీ డిమాండ్ చేస్తోంది. ఇది చాలా సున్నితమైన అంశం’’అని పీసీబీ వ్యాఖ్యానించింది.
అయితే, ఆసియా కప్‌ను తటస్థంగా ఉండే మూడో దేశంలో నిర్వహించాలని కోరడం ఇదేమీ తొలిసారి కాదని పీటీఐ వార్తా సంస్థతో జయ్ షా చెప్పారు.
''పాకిస్తాన్‌లో ఆడకూడదని మేం నిర్ణయించాం. పాక్‌కు వెళ్లాలా వద్దా? అనే నిర్ణయం తీసుకోవాల్సింది ఇక్కడి ప్రభుత్వం. ఆసియా కప్-2023ను మాత్రం తటస్థంగా ఉండే దేశంలో నిర్వహించాలి’’అని జయ్ షా వివరించారు.
2018లో ఆసియా కప్‌ను భారత్‌లో నిర్వహించాల్సి ఉండేది. కానీ, అప్పట్లో భారత్-పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నడుమ దీన్ని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కి మార్చారు.
వచ్చే ఏడాది ఆసియా కప్‌కు పాకిస్తాన్, వరల్డ్ కప్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి. ఈ రెండు టోర్నమెంట్లూ 50-50 ఓవర్లవే.
అయితే, భద్రతా పరమైన ఆందోళనల నడుమ పాకిస్తాన్‌లో ఆడేందుకు కొన్ని అంతర్జాతీయ జట్లు ఇటీవల నిరాకరిస్తూ వచ్చాయి.
అయితే, ఈ ఏడాది ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు పాకిస్తాన్‌లో మ్యాచ్‌లకు వెళ్లాయి. ఈ మ్యాచ్‌లను పాకిస్తాన్ విజయవంతంగా నిర్వహించింది.
- విరాట్ కోహ్లీ: 'వన్డే కెప్టెన్సీ నుంచి తొలగిస్తున్నట్లు టెస్ట్ టీమ్ సెలక్షన్‌కు గంటన్నర ముందు చెప్పారు’
- టీమిండియా టీ20 పగ్గాలు రోహిత్ శర్మకే ఎందుకు అప్పగించారు?

ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేస్తుంది?
ఒకవేళ ఆసియా కప్‌ను పాకిస్తాన్‌కు వెలుపల నిర్వహిస్తే, వచ్చే ఏడాది భారత్‌లో జరగబోయే వరల్డ్ కప్‌కు తాము వెళ్లబోమని పీసీబీ చైర్మన్ రమీజ్ రజా చెప్పినట్లు పాకిస్తానీ ఆంగ్ల పత్రిక డాన్ ఒక కథనం ప్రచురించింది.
మరోవైపు ఏసీసీలో సభ్యత్వాన్ని వదిలిపెట్టేసే అవకాశాన్ని కూడా పాకిస్తాన్ పరిశీలిస్తోంది. తమ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వడంలేదని, అసలు ఆ సభ్యత్వం ఎందుకని రజా చెప్పినట్లు డాన్ వివరించింది.
https://twitter.com/adityaraj2kfrek/status/1582330207179919360
ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం కోసం బీసీసీఐ పగ్గాలను సౌరవ్ గంగూలీ నుంచి రోజర్ బిన్నీకి అప్పగించారని పాకిస్తాన్ క్రికెట్ బోర్డ మాజీ చైర్మన్ జాకా ఆష్రఫ్ అన్నారు.
''సౌరవ్ గంగూలీని తొలగించడం ద్వారా పాకిస్తాన్ వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటామని భారత్ ప్రభుత్వం సంకేతాలు ఇచ్చింది. భారత ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాల మద్దతును పీసీబీ కూడగట్టాలి’’అని ఆయన వ్యాఖ్యానించారు.
ఒకవేళ ఆసియా కప్‌ను పాకిస్తాన్‌లో నిర్వహించకపోతే, ఆ కప్‌కు పాకిస్తాన్ అసలు వెళ్లకూడదని పీసీబీ మాజీ చైర్మన్ ఖాలిద్ మహ్‌మూద్ వ్యాఖ్యానించారు.
బీసీసీఐ ఎందుకు దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటుందో రమీజ్ రజా చెబుతున్న ఒక పాత వీడియో కూడా మళ్లీ వైరల్ అవుతోంది.
'’50 శాతం వరకు ఐసీసీ నిధులే పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ఆధారం. టోర్నమెంటులను ఐసీసీ నిర్వహిస్తూ, డబ్బులను సభ్య దేశాలకు పంచుతుంది. అయితే, ఐసీసీకి 90 శాతం నిధులు భారత మార్కెట్ నుంచే వస్తాయి. అంటే పాకిస్తాన్‌లో క్రికెట్‌ను భారత్‌లోని బిజినెస్ హౌస్‌లు నడిపిస్తున్నాయని చెప్పుకోవాలి. అసలు పాకిస్తాన్‌కు నిధులు ఇవ్వబోమని రేపు భారత ప్రధాని చెప్పారు అనుకోండి.. అప్పుడు ఇక్కడి క్రికెట్ బోర్డు కూడా కుప్పకూలొచ్చేమో’’అని ఆయన ఆ వీడియోలో మాట్లాడుతూ కనిపిస్తున్నారు.
- టీ20 ప్రపంచకప్: భారత్ చేసిన 7 తప్పులు
- విరాట్ కోహ్లీ: 'అది మాత్రం ఎప్పటికీ మారదు.. అలా లేకపోతే నేను ఆడలేను’
పాకిస్తాన్ ప్లేయర్లు, సాధారణ ప్రజలు ఏం అంటున్నారు?
జయ్ షా తాజా వ్యాఖ్యలపై నరేంద్ర మోదీ ప్రభుత్వమే లక్ష్యంగా దిల్లీలోని పాకిస్తాన్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ విమర్శలు గుప్పించారు.
''భారత్, పాకిస్తాన్ మధ్య బంధాలు ఒక అడుగు ముందుకు, రెండు అడుగులు వెనక్కి అన్నట్లు కదులుతున్నాయి. ముఖ్యంగా భారత్‌లో ఎన్నికలు జరిగే ముందు, పాకిస్తాన్‌పై విద్వేషం ఎక్కువ అవుతుంది. భారత్ లేకుండా ఆసియా కప్ ఉంటుందని నేను అనుకోను. మా క్రికెట్ ఎదగకుండా చూసేందుకు భారత్ చాలా ప్రయత్నిస్తోంది. నేడు పాకిస్తాన్ కూడా తమ సత్తా చూపాల్సిన అవసరం ఉంది. పాక్ కూడా చాలా కఠినంగా ఉండాలి’’అని ఆయన తన బ్లాగులో రాసుకొచ్చారు.
మరోవైపు పాకిస్తాన్‌లో చాలా మంది పౌరులు జయ్ షా వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు. జియో న్యూస్ జర్నలిస్టు అర్ఫా ఫిరోజ్ జాక్ స్సందిస్తూ.. ''అక్టోబరు 23న మెల్‌బోర్న్‌లో భారత్‌తో జరిగే మ్యాచ్‌లో పాకిస్తానీ ప్లేయర్లు నల్ల బ్యాండ్ కట్టుకొని మ్యాచ్ ఆడాలి’’అని ఆయన వ్యాఖ్యానించారు.
https://twitter.com/ArfaSays_/status/1582805573808316417
పాకిస్తానీ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ స్పందిస్తూ. ''గత 12 నెలల్లో రెండు దేశాల క్రికెటర్ల మధ్య అవగాహన పెరిగింది. వారు సరదాగా మాట్లాడుతూ మీడియాకు కనిపించారు. కానీ, ఇప్పుడు బీసీసీఐ కార్యదర్శి ఇలాంటి ప్రకటన చేశారు. క్రికెట్ వ్యవహారాలను మెరుగ్గా నిర్వహించడంలో వారికి అనుభవంలేదని దీనిబట్టి తెలుస్తోంది. ఈ విషయంలో పీసీబీ చాలా పరిణితితో వ్యవహరించింది’’అని ఆయన అన్నారు.
https://twitter.com/SAfridiOfficial/status/1582381967852859392
మరోవైపు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రం కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు, పీసీబీ, ఏసీసీలతో భారత్ మాట్లాడి ఉండాల్సినందని అభిప్రాయపడ్డారని జర్నలిస్టు అర్ఫా అన్నారు. బీసీసీఐ నిర్ణయం చాలా నిర్హేతుకంగా ఉందని అక్రం అన్నారని వివరించారు.
https://twitter.com/ImSaeedAnwar/status/1582299620818161665
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సయీద్ అన్వర్ స్పందిస్తూ.. ''అంతర్జాతీయ క్రికెటర్లు పాకిస్తాన్‌కు వస్తున్నప్పుడు బీసీసీఐకి సమస్య ఏమిటి? ఒకవేళ మరీ అంత తటస్థం కావాలని భారత్ కోరుకుంటే.. పాకిస్తాన్ కూడా వచ్చే ఏడాది ప్రపంచ కప్‌లో అదే పట్టుబడుతుంది’’అని అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఎలక్ట్రిక్ కారు, స్కూటర్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ 5 విషయాలూ గుర్తుంచుకోండి..
- బిల్కిస్ బానో: మోదీ ప్రభుత్వ అనుమతితోనే ఆ సామూహిక అత్యాచార దోషులను విడుదల చేశారా?
- మల్లికార్జున ఖర్గే: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడు మోదీ-షాలను ఢీ కొట్టగలరా, ఉత్తర భారత ప్రజలను ఆకట్టుకోగలరా
- స్త్రీల వైద్యుడుగా పనిచేసే పురుషుడి జీవితం ఎలా ఉంటుంది?
- 5 గంటల కంటే తక్కువ నిద్రతో ఆరోగ్యం దెబ్బతింటుంది - తాజా అధ్యయనం.. మంచి నిద్రకు 6 మార్గాలు
- వరల్డ్ కప్ 1983: టీమ్ ఇండియా తొలి ప్రపంచ కప్ విజయం వెనుక కథ ఇదే..
- సరిగ్గా 36 ఏళ్ల క్రితం భారత్ ప్రపంచ కప్ గెలిచిన రోజున దిల్లీలో ఏం జరిగింది..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)