
Rishi Sunak : బ్రిటన్ ప్రధాని అవుతున్న అల్లుడు-మామ నారాయణమూర్తి రియాక్షన్ ఇదే..
బ్రిటన్ కొత్త ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషీ శౌనక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కన్జర్వేటివ్ పార్టీ తరఫున ప్రధాని అభ్యర్ధిగా పోటీలో నిలిచిన రిషీ శౌనక్ కు ప్రత్యర్ధిగా పెన్నీ మోర్డాంట్ పోటీపడలేక చేతులెత్తేశారు. దీంతో ఆయన రేపు బ్రిటన్ చరిత్రలో అతి పిన్నవయస్కుడైన ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈ అరుదైన క్షణాల్ని భారత్ లో ఆయన బంధువులు ఎంజాయ్ చేస్తున్నారు.
ముఖ్యంగా అల్లుడు రిషీ శౌనక్ బ్రిటన్ ప్రధానిగా ఎన్నికయ్యారని తెలియగానే ఆయన మామగారైన ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి సంతోషంగా స్పందించారు. రిషీని చూస్తుంటే గర్వంగా ఉందని నారాయణ మూర్తి తెలిపారు. ఆయన తన బాధ్యతల్లో విజయవంతం కావాలని ఆకాంక్షించారు. బ్రిటన్ ప్రజల ఆకాంక్షల మేరకు రిషీ శాయశక్తులా పనిచేస్తారని భావిస్తున్నట్లు నారాయణ మూర్తి వెల్లడించారు. బ్రిటన్ కొత్త ప్రధాని కాబోతున్న అల్లుడికి శుభాకాంక్షలు తెలిపారు.

భారత మూలాలున్న కుటుంబంలో జన్మించిన రిషీ సునాక్ బ్రిటన్ లోని టాప్ స్కూళ్లలో ఒకటైన వించెస్టర్ లో చదువుకున్నారు. ఆ తర్వాత ఆక్స్ ఫర్డ్ కు వెళ్లారు. మూడేళ్ల పాటు గోల్డ్ మాన్ సాచ్స్ గ్రూప్ తరఫున పనిచేశారు. ఆ తర్వాత కాలిఫోర్నియాలోని స్టాన్ ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ పట్టా అందుకున్నారు. అక్కడే ఆయనకు ఇన్ఫోసిస్ సహ వ్యవస్ధాపకుడైన నారాయణ మూర్తి కుమార్తె అక్షతా మూర్తి పరిచయమయ్యారు. అది కాస్తా పెళ్లిగా మారింది. దీంతో వీరిద్దరూ 2009లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు కృష్ణ, అనౌష్క ఉన్నారు.