తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- సట్టా బజార్ ఫిక్స్
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గడువు సమీపిస్తోన్న కొద్దీ తమిళనాడులో ప్రచారం హోరెత్తుతోంది. డీఎంకే, అన్నా డీఎంకే, టీవీకే.. ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. గెలిచి తీరాలనే పట్టుదలతో ఉన్నాయి. దీనికి అనుగుణంగా వ్యూహ ప్రతివ్యూహాలను రూపొందించుకుంటోన్నాయి. టీవీకే పూర్తిస్థాయిలో ఎన్నికల బరిలో నిల్చోవడం వల్ల త్రిముఖ పోరు ఏర్పడింది. దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ హోరాహోరి పోరు తప్పకపోవచ్చు.
ఈ పరిణామాల మధ్య అసెంబ్లీ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై ఫాలోది సట్టా బజార్ తాజాగా తన అంచనాలను వెల్లడించింది. దీంతో పాటు అస్సాం, కేరళ, పశ్చిమ బెంగాల్, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే విషయంపై అంకెలు, సీట్ల మెజారిటీతో సహా తన ప్రిడిక్షన్ల గురించి వివరించింది.

ఫాలోది సట్టా బజార్ అంచనాల ప్రకారం చూస్తే మొత్తం 234 మంది సభ్యులు ఉన్న తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో డీఎంకే ప్రభంజన కనిపిస్తుంది. ముఖ్యమంత్రి స్టాలిన్ సారథ్యంలోని డీఎంకే వరుసగా రెండోసారి అధికారంలోకి రావడం ఖాయమైంది. తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంటుంది. 2021లో జరిగిన ఎన్నికల మాదిరిగానే పట్టును నిలుపుకొంటుంది. నాటి ఎన్నికల్లో డీఎంకే- కాంగ్రెస్ కూటమి స్వీపింగ్ విక్టరీ సాధించిన విషయం తెలిసిందే. డీఎంకే సొంతంగా 133 సీట్లు సాధించింది.
మొత్తంగా కూటమి 159 సీట్లు గెలుచుకుని స్టాలిన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు అప్పట్లో. ఇప్పుడు కూడా అదే స్థాయిలో సీట్లను డీఎంకే కూటమి దక్కించుకుంటుందని సట్టా బజార్ అంచనావేసింది. డీఎంకే కూటమికి మొత్తంగా 141 నుంచి 144 సీట్లు లభిస్తాయని పేర్కొంది. మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి నాయకత్వంలో ఏఐఏడీఎంకే ఈ ఎన్నికలతో ఉనికిని కోల్పోయే అవకాశాలు లేకపోలేదు. ఏఐఏడీఎంకే- బీజేపీ కూటమి ఇప్పుడు కూడా ప్రతిపక్ష పాత్రకే పరిమితం కావడం ఖాయంగా కనిపిస్తోంది సట్టా బజార్ అంచనాలను బట్టి చూస్తోంటే.
అన్నా డీఎంకే, ఇతర పార్టీల నుండి తీవ్ర పోటీ ఉన్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల ప్రకారం డీఎంకే ముందంజలో ఉందని ఈ సట్టా బజార్ తేల్చి చెప్పింది. ఏఐఏడీఎంకేకు 45-55 సీట్లు మాత్రమే గెలిచే అవకాశం ఉందని అంచనా వేసింది. విజయ్ సారథ్యంలోని టీవీకే ఎన్ని స్థానాల్లో గెలుస్తుందనే వివరాలు ఇందులో వెల్లడి కాలేదు.
ఎంతో ఉత్కంఠ రేపుతున్న పశ్చిమ బెంగాల్‌లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (TMC), బీజేపీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి వస్తుందని సట్టా బజార్ తేల్చింది. టీఎంసీకి 158-161 సీట్లు, బీజేపీ 127-130కి స్థానాలు గెలుచుకోవచ్చని అంచనా. ఇక్కడ మమతా బెనర్జీ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, బీజేపీ తన సీట్లను సంఖ్యను పెంచుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.












Click it and Unblock the Notifications