IPL 2023 : ఒక్క ఛాన్స్- కేఎల్ రాహుల్ ప్లేస్ లో వచ్చిన కరుణ్ నాయర్ పాత ట్వీట్ వైరల్..
ఐపీఎల్ 2023 హోరాహోరీగా సాగుతోంది. మ్యాచ్ మ్యాచ్ కూ టోర్నీపై అభిమానుల్లో ఆసక్తి అంతకంతకూ పెరుగుతోంది. స్టేడియాల్లో నానాటికీ పెరుగుతున్న ప్రేక్షకుల సంఖ్యతో పాటు టీవీలు, జియో సినిమా యాప్ లో మ్యాచ్ లు వీక్షించే వారి సంఖ్య కూడా ఎక్కువవుతోంది. మ్యాచ్ లతో పాటు ఆటగాళ్ల గురించి వస్తున్న తాజా అప్ డేట్స్ ప్రేక్షకుల్ని కట్టిపారేస్తున్నాయి. ఇదే క్రమంలో తాజాగా లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ గాయం కారణంగా తప్పుకోవడంతో అతని స్ధానంలో వచ్చిన కరుణ్ నాయర్ కు సంబంధించిన ఓ వార్త కూడా వైరల్ అవుతోంది.
కేఎల్ రాహుల్ స్ధానంలో లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో స్ధానం సంపాదించిన అతని కర్నాటక సహచరుడు కరుణ్ నాయర్ గురించి ఇప్పుడు చర్చ జరుగుతోంది. కరుణ్ నాయర్ ను ఐపీఎల్ జట్లలోకి తీసుకునేందుకు గతంలో ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు. కనీసం బేస్ ప్రైస్ రూ.50 లక్షలకు కూడా తీసుకోలేదు. ఇప్పుడు అదే రూ.50 లక్షలకు కరుణ్ ను లక్నో జట్టులోకి తీసుకుంది. దీంతో కరుణ్ నాయర్ ను తీసుకున్న ధర కూడా చర్చనీయాంశమవుతోంది.

వాస్తవానికి కేఎల్ రాహుల్ గాయం కరుణ్ నాయర్‌కు లక్నో జట్టులోకి తలుపులు తెరిచింది. కర్ణాటక రాష్ట్ర జట్టుకు చెందిన రాహుల్ సహచరుడు అయిన నాయర్.. ఎల్‌ఎస్‌జీలో రాహుల్ స్థానంలో అనుకోని అవకాశం అందుకున్నాడు. దీంతో కరుణ్ నాయర్ IPL 2023లో మిగిలిన మ్యాచ్ ల కోసం లక్నో సూపర్ జెయింట్స్‌లో చేరనున్నాడు. నాయర్ 2022లో ఫైనల్‌కు చేరుకున్న రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఉన్నాడు. అయితే కేవలం 3 గేమ్‌లు మాత్రమే ఆడాడు. అందులోనూ కేవలం 16 పరుగులు చేశాడు. కరుణ్ నాయర్ 2021 సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో ఉన్నా ఒక్క గేమ్ కూడా ఆడలేకపోయాడు. గతంలో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుల్లోనూ ఉన్నాడు.
దీంతో కరుణ్ నాయర్ గతంలో చేసిన ఓ పాత ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ట్వీట్‌లో 'ప్రియమైన క్రికెట్, నాకు మరో అవకాశం ఇవ్వు" అంటూ కరుణ్ కోరాడు. అప్పట్లో దీని గురించి ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఈసారి ఐపీఎల్ సీజన్ లో ఆడే అవకాశం రాని కరుణ్ కు రాహుల్ గాయం రూపంలో ఆ ఒక్క ఛాన్స్ దక్కింది. దీంతో కరుణ్ కూడా ఇప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications