ఓడిపోయిన మణిపూర్ ఉక్కు మహిళ, షర్మిలకు వచ్చింది 51 ఓట్లే!
మణిపూర్ ఉక్కు మహిళ ఇరోమ్ షర్మిల ఓడిపోయారు. తౌబాల్ నియోజకవర్గం నుంచి పోటీకి దిగిన ఆమెకు కేవలం 51 ఓట్లే పోలయినట్లు తెలుస్తోంది.
న్యూఢిల్లీ: మణిపూర్ ఉక్కు మహిళ ఇరోమ్ షర్మిల ఓడిపోయారు. మణిపూర్ లోని తౌబల్ నియోజకవర్గంలో ఆమె సీఎం ఒక్రమ్ ఇబోబీ సింగ్ పై పోటీకి దిగి ఓటమి పాలయ్యారు. మధ్యలో కాస్త ఆధిక్యంలోకి దూసుకెళ్లినా చివరికి షర్మిలకు ఓటమి తప్పలేదు.
ఈ ఎన్నికల్లో ఆమెకు కేవలం 51 ఓట్లే పోలయినట్లు తెలుస్తోంది. ఆమెకు అత్యంత స్వల్పంగా ఓట్లు పోలవడంపై పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఆమె మద్దతుదారులైనా అందరూ ఆమెకు ఓటు వేశారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
సామాజిక మార్పే లక్ష్యంగా ఎన్నికల బరిలోకి దిగిన షర్మిల మణిపూర్ ప్రజలను అంతగా ఆకట్టుకోలేకపోయారు. తన మద్దతుదారులతో కలిసి పీపుల్స్ రిసర్జన్స్ అండ్ జస్టిస్ అలయెన్స్ పార్టీని స్థాపించిన షర్మిల తౌబాల్ నియోజకవర్గంలో ఏకంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పైనే పోటీకి దిగారు.

మణిపూర్ లో సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టానికి వ్యతిరేకంగా 16 ఏళ్ల పాటు నిరాహార దీక్ష సాగించిన ఇరోమ్ షర్మిల ఉక్కు మహిళగా పేరుతెచ్చుకున్నారు. గత ఏడాది దీక్ష విరమించిన ఆమె క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించారు.
అయితే గత పదిహేనేళ్లుగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్న సీఎం ఇబోబి సింగ్ తన అధికారం నిలుపుకునేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తారని ఆమె ముందుగానే అన్నారు. చివరికి ఆమె అన్నట్లుగానే జరిగింది.
ఎన్నికల ఫలితాలు తనను నిరుత్సాహ పరచడం లేదని, ఈ ఎన్నికల్లో ఓటమి చవిచూసినా.. తమ పార్టీ 2019లో జరిగే సాధారణ ఎన్నికల్లో మళ్లీ బరిలోకి దిగుతుందని షర్మిల స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications