వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పశ్చిమ బెంగాల్.. బీజేపీకి దొరికిన మరో అస్త్రం.. రాష్ట్రపతి పాలన సాధ్యమా?

|
Google Oneindia TeluguNews

కోల్ కత: పశ్చిమ బెంగాల్ లో తాజాగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను అవకాశంగా తీసుకుని అక్కడ రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉందా? పశ్చిమ బెంగాల్ అసెంబ్లీని రద్దు చేయడానికి కేంద్రంలో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం పావులు కదుపుతోందా? కొరకరాని కొయ్యగా మారిన మమతా బెనర్జీ దూకుడుకు ముకుతాడు వేయడానికి రంగం సిద్ధమౌతోందా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. అది కూడా బీజేపీ నేతల నుంచే. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీని ఉన్నపళంగా రద్దు చేసి, అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలంటూ జాతీయ స్థాయిలో బీజేపీ నాయకులు డిమాండ్ చేయడాన్ని బట్టి చూస్తే.. అన్నంత పనీ చేసేలా కనిపిస్తోంది కేంద్రం.

ప్రధానమంత్రి నరేంద్రమోడీని ఏ మాత్రం లెక్కచేయని నేతల జాబితాలో మమతా బెనర్జీ పేరు ఎప్పుడూ అగ్రస్థానంలో ఉంటుంది. నరేంద్రమోడీ-అమిత్ షా జోడీని ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోరు మమత. ఆ ద్వయం పేరు వింటే చాలు దీదీకి అరికాలి మంట నెత్తికెక్కుతుంది. వామపక్ష నేతలపైన అయినా వీలైతే కాసింత కనికరం చూపుతారేమో గానీ.. కమలనాథులంటే అస్సలు గిట్టదు. అందుకే- నరేంద్రమోడీ గానీ, బీజేపీ గానీ తన రాష్ట్ర ఛాయలకు కూడా రాకుండా చేయడంలో విజయం సాధించారు. దీనికి నిదర్శనం- 2014 నాటి లోక్ సభ ఎన్నికలు. మోడీ ప్రభంజనం వీచిన నాటి లోక్ సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ లో బీజేపీకి దక్కింది రెండంటే రెండు స్థానాలే.

కేంద్రంతో యుద్ధం..

కేంద్రంతో యుద్ధం..

దేశ రాజకీయాల్లో మమతకు ఉన్న ముద్దు పేరు ఫైర్ బ్రాండ్. కొమ్ములు తిరిగిన కమ్మూనిస్టు యోధులపైనే తిరుగులేని, అసాధారణ విజయం సాధించిన మహిళగా దేశ రాజకీయాల్లో గుర్తింపు ఉంది. దాన్ని మరోసారి సార్థకం చేసుకున్నారు. తన రాష్ట్రానికి చెందిన ఐపీఎస్ అధికారి, కోల్ కత పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ ను విచారించడానికి కేంద్రం నుంచి వచ్చిన సీబీఐ అధికారులను అడ్డుకున్నారు. కనీసం రాజీవ్ కుమార్ ఇంటి గుమ్మాన్ని కూడా తొక్కనివ్వలేదు. సీబీఐని పంపించిన ఎన్డీఏపై ఒంటికాలిపై లేచారు. ఒకరకంగా చెప్పాలంటే - మమతా కేంద్రంపై యుద్ధాన్నే ప్రకటించారు. సీబీఐ దర్యాప్తును నిరసిస్తూ ఓ ముఖ్యమంత్రి స్థాయి నేత ఎవరైనా ధర్నాకు కూర్చోవడం దేశ రాజకీయాల్లో అత్యంత అరుదుగా సంభవించే ఘటన. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ లో చోటు చేసుకున్నది అదే.

పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ వరుసగా రెండుసార్లు అధికారంలోకి రావడమే కాకుండా..లోక్ సభ ఎన్నికల్లో తన హవాను విజయవంతంగా అడ్డుకోవడం నరేంద్రమోడీ అహం దెబ్బతిన్నదనే అనుకోవచ్చు. అప్పటి నుంచీ ఆయన దీదీపై రాజకీయంగా ఆధిపత్యాన్ని చలాయించడానికి అవకాశాలను వెదుకుతూనే ఉన్నారు. మొన్నటికి మొన్న..పశ్చిమ బెంగాల్ లో ర్యాలీ నిర్వహించడానికి అమిత్ షా సిద్ధపడగా అందుకు మమతా బెనర్జీ ససేమిరా అన్నారు. ఆ తరువాత ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూ అదే రకమైన `స్వాగతం` లభించింది పశ్చిమ బెంగాల్ లో. ఆయన పర్యటనకు కూడా అనుమతి ఇవ్వలేదు దీదీ.

సీబీఐతో ఇరుకున పెట్టే ప్రయత్నం..

సీబీఐతో ఇరుకున పెట్టే ప్రయత్నం..

అదే సమయంలో- సీబీఐ అధికారులు రంగంలోకి దిగడాన్ని మమతా బెనర్జీ సహించలేకపోయారు. సీబీఐ దర్యాప్తునకు, అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్ ల ర్యాలీలకు సంబంధం ఉండకపోవచ్చు. ఈ రెండూ కాకతాళీయంగానే చోటు చేసుకుని ఉండవచ్చు. అయినప్పటికీ- మమతా బెనర్జీ ఆగ్రహానికి కారణమైంది. అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్ ర్యాలీలకు అనుమతి ఇవ్వకపోవడం కూడా సీబీఐ అధికారుల హడావుడి దర్యాప్తునకు కారణమైందని స్వయంగా మమతా బెనర్జీనే చెప్పుకొచ్చారు. శారద, రోజ్ వ్యాలీ కుంభకోణాలపై సీబీఐ దర్యాప్తు జరిపించి.. స్వామి కార్యంతో పాటు స్వకార్యాన్నీ తీర్చేసుకున్నట్టు ఉంటుందని బీజేపీ కూడా అంచనా వేసి ఉండవచ్చు. ఈ రీతిలో మమతా బెనర్జీ తమపై కయ్యానికి కాలు దువ్వుతారని బీజేపీ నేతలు ఏ మాత్రం ఊహించి ఉండరు.

రాష్ట్రపతి పాలన డిమాండ్ ఎత్తుకున్న బీజేపీ..

రాష్ట్రపతి పాలన డిమాండ్ ఎత్తుకున్న బీజేపీ..

రాజకీయాల్లో ఎత్తులు, పైఎత్తులు అత్యంత సహజం. ప్రత్యర్థులపై పైచేయి సాధించడానికి అందుబాటులో ఉన్న ఏ ఒక్క అవకాశాన్నీ జారవిడుచుకోరు. అటు మమతా బెనర్జీ గానీ, ఇటు కమలనాథులు గానీ సీబీఐ దర్యాప్తును రాజకీయ కోణంలోనే చూస్తున్నారు. ఒకరిపై ఒకరు ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి ఈ ఘటనను వేదికగా చేసుకున్నారు. సీబీఐని మమత సమర్థవంతంగా అడ్డుకుంటే.. ఆమెను ఇరుకున పెట్టడానికి రాష్ట్రపతి పాలన అనే డిమాండ్ ను లేవనెత్తింది బీజేపీ. పశ్చిమ బెంగాల్ లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, సీబీఐ అధికారులను నిర్బంధం.. తదనంతర పరిణామాలను బూచిగా చూపించి, రాష్ట్రపతి పాలను విధించాలని నినదిస్తోంది బీజేపీ. నిజానికి- కమల నాథులు కోరుకుంటున్నట్లు పశ్చిమ బెంగాల్ లో రాష్ట్రపతి పాలన విధించడానికి ఈ రెండు అంశాలూ ఏ మాత్రం సరితూగవు. ఆ విషయం బీజేపీ నేతలకూ తెలుసు. అయినప్పటికీ- మమతను ఇబ్బందుల్లోకి నెట్టడానికి ఇంతకంటే మంచి అవకాశం దొరకదని వారు భావిస్తున్నారు. రాష్ట్రపతి పాలన విధించడం అంటూ జరిగితే- మమత ఊరుకోరు. వ్యతిరేక శక్తులన్నింటినీ కూడగడతారు. అవసరం అనుకుంటే కమ్యూనిస్టులతోనూ చేతులు కలపడానికి వెనుకాడబోరు.

English summary
BJP led NDA government all set to cash from West Bengal issue. BJP wants to impose president rule in West Bengal. BJP leaders demand the same also. If, President rule will impose in West Bengal, What is the reaction of Fire brand Mamatha Benerjee?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X