‘మేం ఎక్కడైనా ఉంటాం’: హర్యానా ప్రభుత్వ వెబ్‌సైట్ హ్యాక్ చేసిన ఐఎస్ఐఎస్
ఛంఢీఘర్: ప్రపంచ దేశాలను భయాందోళనలకు గురిచేస్తున్న ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ హర్యానా ప్రభుత్వానికి చెందిన ఎస్‌సిఈఆర్‌టి(సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్) వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసింది. అంతేగాక, ‘మేం ప్రతిచోటా ఉంటాం' అంటూ ఆ వెబ్ సైట్ హోంపేజీలో ఓ సందేశాన్ని పోస్ట్ చేసింది.
సైట్ హోంపేజీలో ఐఎస్ఐఎస్ పతాకాన్ని గుర్తించిన ఓ టీచర్ ఈ విషయాన్ని అధికారులకు తెలియజేశారు. దీంతో ఆ సందేశాన్ని తొలగించి, సైట్ పునరుద్ధరణకు చర్యలు తీసుకున్నారు. దీనిపై అధికారులు, పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

కాగా, హోలీ వేడుకలు జరుగుతుండటంతో ఈ విషయాన్ని అధికారులు ఎవరూ గుర్తించలేకపోయారు. ఆ తర్వాత ఈ విషయం తమ వరకు రావడంతో అధికారులు సైట్ ఎలా హ్యాక్ అయింది, ఎవరు హ్యాక్ చేశారనేదానిపై విచారిస్తున్నారు.
కాగా, ప్రభుత్వ సైట్లోంచి అధికారిక సమాచారం ఏమైనా తస్కరణకు గురైందా? అన్న కోణంలో అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న రాష్ట్ర పోలీసులు, అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు.


Click it and Unblock the Notifications