వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇజ్రాయెల్-వెస్ట్‌బ్యాంక్: ప్రేమిస్తే 30 రోజుల్లోగా ప్రభుత్వానికి చెప్పాలి, పెళ్లికి 6 నెలలు ఆగాలి.. పెళ్లయ్యాక 27 నెలలు అక్కడే గడపాలి..

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
విదేశీయులు పాలస్తీనియన్లతో ప్రేమలో పడితే ఆ విషయాన్ని ప్రభుత్వానికి చెప్పాలి

వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలో రెండు కొత్త నిబంధనలు వచ్చాయి. వీటి ప్రకారం ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌ను సందర్శించే విదేశీయలు అక్కడి పాలస్తీనియులతో ప్రేమలో పడితే, ఆ విషయాన్ని వారు ఇజ్రాయెల్ రక్షణ మంత్రిత్వ శాఖకు తెలియజేయాలి.

వారు అక్కడి పాలస్తీనియన్లను పెళ్లి చేసుకోవాలంటే కనీసం ఆర్నెల్ల పాటు కూలింగ్ -ఆఫ్ పీరియడ్ ( పెళ్లి, లేదా ఏదైనా ఒక ఒప్పందానికి వేచి చూడాల్సిన సమయాన్ని కూలింగ్ -ఆఫ్ పీరియడ్ అంటారు) ఇవ్వాల్సి ఉంటుంది. ఆపై 27 నెలలు అక్కడ గడిపిన తర్వాతనే దేశం వదిలి వెళ్లేందుకు అవకాశం ఉంటుంది.

ఇది వెస్ట్ బ్యాంక్‌లో నివసిస్తున్న లేదా సందర్శించాలనుకునే విదేశీయులపై ఆంక్షలను కఠినతరం చేయడంలో భాగంగా ఇజ్రాయెల్ తయారు చేసిన నిబంధనలు.

ఆంక్షలను ఇజ్రాయెల్ తారాస్థాయికి తీసుకెళుతోందని పాలస్తీనియన్లు, ఇజ్రాయెల్‌లో పని చేసే ఎన్జీవోలు ఆరోపించాయి. సెప్టెంబర్ 5 నుంచి ఈ నిబంధనలు అమలులోకి వస్తాయి.

పాలస్తీన పౌరుడు, లేదా పౌరురాలితో రిలేషన్ మొదలుపెట్టిన వ్యక్తి, ఆ విషయాన్ని 30 రోజులలోపు ఇజ్రాయెల్ అధికారులకు తెలియజేయాలన్నది విదేశీయుల కోసం తయారు చేసిన నిబంధనల్లో ఒకటి.

కొత్త ఆంక్షల ప్రకారం పాలస్తీనా విశ్వవిద్యాలయాలలో 150మంది విదేశీ విద్యార్ధులకు మాత్రమే అవకాశం కల్పిస్తారు. విదేశీ లెక్చరర్ల కోటా 100 మందికి పరిమితం. అయితే ఇజ్రాయెల్‌లో అలాంటి పరిమితులు లేవు.

ఈ నిబంధనల కారణంగా తాము కూడా తీవ్రంగా ప్రభావితమవుతున్నామని వ్యాపారవేత్తలు, సహాయ సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు. ఈ నియమాలు వీసాలు, వీసా పొడిగింపుల వ్యవధిపై కఠినమైన పరిమితులు విధిస్తున్నాయి.

అనేక సందర్భాల్లో ప్రజలు కొన్ని నెలల కంటే ఎక్కువ కాలం వెస్ట్ బ్యాంక్‌లో పని చేయకుండా ఈ నిబంధనలు అడ్డుకుంటాయి.

"ఇది పాలస్తీనా సమాజాన్ని మిగిలిన ప్రపంచం నుంచి వేరు చేయడం" అని ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్జీవో 'హా మోక్డ్' ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జెస్సికా మోంటెల్ అన్నారు. ఈ నిబంధనలకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ హైకోర్టులో ఈ సంస్థ పిటిషన్ వేసింది.

"పాలస్తీనా సంస్థలలో బయటి నుంచి ప్రజలు వచ్చి పనిచేయడం, పెట్టుబడి పెట్టడం, బోధించడం, చదవడంలాంటివన్నీ కష్టతరంగా మార్చారు'' అని మోంటెల్ ఆరోపించారు.

భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిబంధనలు తప్పదని ఇజ్రాయెల్ అంటోంది

ఒకే దేశం, రెండు వ్యవస్థలు

ఇజ్రాయెల్ 1967 మిడిల్ ఈస్ట్ యుద్ధంలో జోర్డాన్ నుండి వెస్ట్ బ్యాంక్‌ను స్వాధీనం చేసుకుంది. ఇజ్రాయెల్ రక్షణ మంత్రిత్వ శాఖ విభాగమైన కోగాట్ పాలస్తీనా భూభాగంలో ఈ ఆక్రమిత ప్రాంత పరిపాలనా బాధ్యతలు చూస్తోంది.

ఇటీవలే కోగాట్ 97 పేజీలతో జూడియా, సమారియా ప్రాంతంలో విదేశీయుల కోసం నిబంధనలను ప్రకటించింది.

"జుడియా, సమారియా ప్రాంతంలోకి ప్రవేశించాలనుకునే విదేశీయుల నుండి వచ్చిన దరఖాస్తుల ప్రాసెసింగ్ విధానాన్ని నిర్వచించడానికి, అధికార స్థాయిలను వివరించడానికి ఈ నిబంధనావళిని తయారు చేసినట్లు ఈ పత్రంలో పేర్కొన్నారు.

వెస్ట్ బ్యాంక్, గాజాలోని పాలస్తీనియన్ నివాసితుల జీవిత భాగస్వాములు, పిల్లలకు నివాసాలను మంజూరు చేయడానికి, సందర్శకులను అనుమతించడానికి వీలుగా 1990లలో కుదిరిన మధ్యంతర శాంతి ఒప్పందాలను ఈ పత్రంలో పేర్కొన్నారు.

ఇజ్రాయెల్‌తో పాటు వెస్ట్ బ్యాంక్‌లోని పాలస్తీనా నియంత్రణలో ఉన్న ప్రాంతాలు, యూదుల నివాసాలను సందర్శించే వారికి ఈ కొత్త నిబంధనలు వర్తించవు. అక్కడ ప్రవేశించే విషయంలో ఇజ్రాయెల్ ఇమ్మిగ్రేషన్ అధికారులే నిర్ణయాలు తీసుకుంటారు.

"ఒక దేశం, రెండు వేర్వేరు వ్యవస్థల వాస్తవికతను, అది విధించే జాతి వివక్ష నిబంధనలను ఇది నిదర్శనం" అని పాలస్తీనా ప్రజలకు ప్రాతినిధ్యం వహించే పీఎల్ఓ (పాలస్తీన్ లిబరేషన్ ఆర్గనైజేషన్) ఆరోపించింది.

ఈ వ్యవహారంపై కోగాట్ నుంచి వివరణ కోరేందుకు బీబీసీ ప్రయత్నించింది. అయితే, వారు అందుబాటులోకి రాలేదు. భద్రతా కారణాల దృష్ట్యా తమ భూభాగంలోకి వచ్చే వారిపై ఆంక్షలు అవసరమని ఇజ్రాయెల్ అధికారులు చెబుతున్నారు.

పాలస్తీనా పెళ్లి కూతురు (ఫైల్ ఫొటో)

చట్టపరమైన ఇబ్బందులు

వెస్ట్ బ్యాంక్‌లో నివసించే పాలస్తీనియన్ల విదేశీ జీవిత భాగస్వాములకు రెసిడెన్సీ హోదాను మంజూరు చేయడంపై సుదీర్ఘకాలంగా ఇజ్రాయెల్ నిషేధం విధించింది. దీనివల్ల వేలాది మంది ప్రజలు చట్టపరంగా అనిశ్చిత హోదాలో నివసిస్తున్నారు.

"ఇజ్రాయెల్ అధికారులు వివక్షాపూరిత, క్రూరమైన, ఏకపక్ష విధానాలను అవలంబిస్తోంది. విదేశీ జీవిత భాగస్వాములకు అమానవీయంగా ఇబ్బందులు పెడుతోంది. వెస్ట్ బ్యాంక్‌లోని తమ భాగస్వాముల నుంచి వారు బలవంతంగా విడిపోవాల్సి వస్తోంది'' అని రైట్ టు ఎంటర్ అనే క్యాంపెయిన్ గ్రూప్ ఆరోపించింది.

''ఈ కొత్త విధానాలు ఇప్పటికే ఉన్న అనేక పరిమితులను అధికారికంగా మారుస్తాయి, లేదా తీవ్రతరం చేస్తాయి. అనేక కుటుంబాలు తమ కుటుంబాన్ని కాపాడుకునేందుకు విదేశాలకు వెళ్లిపోవడమా, లేదంటే ఇక్కడే ఉండటమా అనే విషయంలో తీవ్రమైన ఒత్తిడికి గురవుతారు'' అని ఆ సంస్థ ఆరోపించింది.

తోబుట్టువులు, తాతలు, మనవరాళ్లు లాంటి కొన్ని బంధుత్వాల పేరుతో తమ కుటుంబీకులను కలుసుకునేందుకు ఈ కొత్త నిబంధనలు అనుమతించవు.

పాలస్తీన విశ్వవిద్యాలయాలలో ప్రవేశించే విదేశీ విద్యార్థులు, విద్యావేత్తలకు ఇజ్రాయెల్ అధికారులు నిబంధనలను కఠినతరం చేయడం పట్ల తమ ఆందోళనను తెలియజేసినట్లు యూరోపియన్ కమిషన్ తెలిపింది.

https://twitter.com/MartinKonecny/status/1564985519779549185

బిజినెస్ భయాలు

హైకోర్టులో హా మోక్డ్ వేసిన పిటిషన్ కు మద్ధతుగా 19మంది వ్యాపారవేత్తలు పిటిషన్లు వేశారు.

వీసా పరిమితులు, ప్రయాణ ఖర్చుల కారణంగా విదేశాల నుండి ఉద్యోగులు, పెట్టుబడిదారులు, సరఫరాదారులు, క్వాలిటీ కంట్రోల్ నిపుణులను ఇక్కడికి తీసుకురావడంతో తనకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని వెస్ట్ బ్యాంక్‌లోని పాలస్తీనా ఫార్మాస్యూటికల్ సంస్థ సీఈవో బాసిమ్ ఖౌరీ చెప్పారు.

కొత్త నియమాల ప్రకారం వెస్ట్ బ్యాంక్‌ను మాత్రమే సందర్శించడానికి వచ్చే విదేశీ సందర్శకులు జోర్డాన్‌తో ల్యాండ్ క్రాసింగ్‌ల ద్వారా మాత్రమే ప్రయాణించాలని, అసాధారణమైన సందర్భాలలో మాత్రమే ఇజ్రాయెల్‌లోని బెన్ గురియన్ విమానాశ్రయాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది.

"ఈ కొత్త నిబంధనలు ఆలస్యానికి కారణమవుతాయి. ఖర్చులను పెంచుతాయి'' అని ఒక పిటిషనర్ పేర్కొన్నారు.

అయితే, ఈ నిబంధనలపై వేసిన పిటిషన్లను జులైలో హైకోర్టు తిరస్కరించింది. కోగాట్ రూపొందించిన ఈ నిబంధనలపై విచారణ జరపడం తొందరపాటు అవుతుందని, వీటిపై కోగాట్ ఇంకా పూర్తిస్థాయిలో నిర్ణయం తీసుకోలేదని కోర్టు పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Israel-Westbank: If you love, you must tell the government within 30 days, wait 6 months for marriage.. After marriage, you must spend 27 months there..
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X