ఎన్‌కౌంటర్: నలుగురు ఉగ్రవాదులు హతం, జవాను, పౌరుడు మృతి, రంగంలోకి ఎన్ఎస్‌జీ
శ్రీనగర్: గవర్నర్ పాలనలో జమ్మూకాశ్మీర్‌లో సైన్యం ఉగ్రవాదుల కోసం ముమ్మర వేట కొనసాగిస్తోంది. రాష్ట్రంలోని అనంతనాగ్ జిల్లాలో శుక్రవారం నలుగురు ముష్కరులను సైన్యం మట్టుబెట్టింది. ఎన్‌కౌంటర్‌లో ఓ పోలీసు, ఓ పౌరుడు కూడా ప్రాణాలు కోల్పోయారు.
ఉగ్రవాదులు ఇస్లామిక్ స్టేట్ జమ్మూకాశ్మీర్(ఐఎస్‌జేకే) సంస్థకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. మృతుల్లో ఐఎస్‌జేకే చీఫ్ దావూద్ కూడా ఉన్నట్లు డీజీపీ ఎస్ పీ వైద్ వెల్లడించారు.

అనంతనాగ్‌లోని శ్రీగుఫ్‌వరా ప్రాంతంలో ఉగ్రవాదులున్నారని సమాచారం అందుకున్న పోలీసులు శుక్రవారం ఉదయం నుంచి గాలింపు చర్యలు చేపట్టారు. ఓ ఇంట్లో దాక్కున్న ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో పోలీసులు తిప్పికొట్టేందుకు ఎదురుకాల్పులు జరిపినట్లు అధికారులు వెల్లడించారు.
భద్రతా సిబ్బందిపైకి స్థానిక యువకులు రాళ్లు రువ్వడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారినట్లు తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో శ్రీనగర్, అనంతనాగ్‌లలో ఇంటర్నెట్ సేవలు నిలిపేశారు. అల్లర్లు వ్యాపించకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.
రంగంలోకి బ్యాక్ క్యాట్స్(ఎన్ఎస్‌జీ)
జమ్మూకాశ్మీర్‌లో పీడీపీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వానికి తెరపడటంతో గవర్నర్ పాలన అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉగ్రవాదుల ఏరివేతను మరింత ముమ్మరం చేయనున్నట్లు భద్రతాబలగాలు ప్రకటించాయి. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా చేపట్టే ఆపరేషన్‌లో నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్‌గా పిలిచే సుశిక్షతులైన 'బ్లాక్ క్యాట్స్'ను త్వరలో రంగంలోకి దించాలని భావిస్తున్నారు.
ఎన్‌ఎస్‌జీ బృందం ఇప్పటికే కాశ్మీర్‌లో ఉందని.. వారికి నగర శివార్లలో కఠిన శిక్షణను ఇస్తున్నట్లు సమాచారం. ఉగ్రవాదులను ఏరివేసే ఆపరేషన్‌లో బ్లాక్ క్యాట్స్ సేవలను వినియోగించుకోవాలన్న నిర్ణయాన్ని ఇటీవల కేంద్ర హోంశాఖ తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications