ప్రియుడికి బాలీవుడ్ బ్యూటీ వెన్నుపోటు, అప్రూవర్‌గా జాక్వెలిన్!
మనీలాండరింగ్ కేసులో చిక్కుకుని కెరీర్‌ను రిస్క్‌లో పడేసుకున్న జాక్వెలిన్ ఫెర్నాండెజ్, ఇప్పుడు దర్యాప్తు సంస్థలకు సహకరించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సుఖేష్ చంద్రశేఖర్ చేసిన రూ. 215 కోట్ల దోపిడీ కేసులో తాను సాక్షిగా (అప్రూవర్) మారుతానని ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టును ఆమె అభ్యర్థించారు. అయితే, దీనిపై స్పందించిన న్యాయస్థానం.. ముందుగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని సంప్రదించాలని, నిబంధనల ప్రకారం దర్యాప్తు సంస్థకే దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
గతంలో తనపై ఉన్న కేసును కొట్టేయాలని జాక్వెలిన్ ఢిల్లీ హైకోర్టును, ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కానీ, అత్యున్నత న్యాయస్థానం కూడా ఆమె విన్నపాన్ని తోసిపుచ్చింది. సుఖేష్ నేర చరిత్ర తెలిసి కూడా ఆమె కోట్లాది రూపాయల బహుమతులు అందుకున్నారని, ఆధారాలను ధ్వంసం చేసేందుకు ఫోన్ డేటాను కూడా డిలీట్ చేశారని ఈడీ బలంగా వాదిస్తోంది. ఈ పరిస్థితుల్లో శిక్ష నుంచి తప్పించుకోవడానికి 'అప్రూవర్'గా మారి, అసలు నిజాలను బయటపెట్టడమే ఏకైక మార్గమని ఆమె భావిస్తున్నట్లు తెలుస్తోంది.

రూ. 10 కోట్ల గిఫ్టులు.. ఖరీదైన ప్రేమాయణం!
సుఖేష్ చంద్రశేఖర్ జైలులో ఉండి కూడా హై-ప్రొఫైల్ వ్యక్తులను మోసం చేసి వందల కోట్లు వసూలు చేశాడు. ఆ సొమ్ముతో జాక్వెలిన్‌కు వజ్రాల చెవిపోగులు, బ్రాస్‌లెట్లు, ఖరీదైన డిజైనర్ బ్యాగులు, చివరికి మినీ కూపర్ కారును కూడా కానుకగా ఇచ్చాడు. ఆమె కుటుంబ సభ్యులకు సైతం విదేశాల్లో భారీగా ఆర్థిక సహాయం చేసినట్లు ఈడీ ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. మొదట్లో వీరిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫోటోలు వైరల్ అవ్వగా, సుఖేష్ ఆమెను తన 'ప్రేయసి'గా అభివర్ణించేవాడు.
"నన్ను తప్పుదోవ పట్టించాడు" - జాక్వెలిన్ ఆవేదన
కోర్టులో జాక్వెలిన్ వాదన మరోలా ఉంది. సుఖేష్ తనను ఒక పెద్ద వ్యాపారవేత్తగా నమ్మించి మోసం చేశాడని, తన భావోద్వేగాలతో ఆడుకున్నాడని ఆమె వాపోతున్నారు. "అతను నా జీవితాన్ని నరకం చేశాడు.. నా కెరీర్‌ను నాశనం చేశాడు" అంటూ గతంలోనే ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు అప్రూవర్‌గా మారితే, సుఖేష్ సాగించిన చీకటి వ్యాపారాలు, ఎవరెవరికి వాటాలు అందాయి అనే విషయాలపై జాక్వెలిన్ ఇచ్చే వాంగ్మూలం ఈ కేసులో అత్యంత కీలకం కానుంది.
ఏప్రిల్ 20న కీలక విచారణ
జాక్వెలిన్ విన్నపంపై కోర్టు శుక్రవారం ఈడీకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 20కి వాయిదా వేసింది. ఒకవేళ ఈడీ ఆమెను అప్రూవర్‌గా అంగీకరిస్తే, ఆమె నిందితురాలి హోదా నుంచి సాక్షిగా మారుతుంది. తద్వారా ఆమెకు శిక్ష నుంచి కొంత ఉపశమనం లభించే అవకాశం ఉంది. మరి 'కింగ్ పిన్' సుఖేష్ చంద్రశేఖర్ గుట్టును జాక్వెలిన్ ఎలా రట్టు చేయబోతుందోనన్నది ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్.














Click it and Unblock the Notifications