వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'జై భీమ్': ఈ నినాదం ఎలా పుట్టింది, మొట్టమొదట వాడింది ఎవరు

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

తమిళ హీరో సూర్య నటించిన బహుభాషా చిత్రం 'జై భీమ్' దేశవ్యాప్తంగా చర్చనీయమైంది. ఒక దళిత మహిళ న్యాయం కోసం చేసే పోరాటాన్ని, అందుకు ఓ లాయర్ సహకరించిన కథను ఈ సినిమాలో చూపిస్తారు.

మహారాష్ట్రలోని లక్షలమంది అంబేద్కర్ ఉద్యమ కార్యకర్తలు, అంబేడ్కర్‌తో భావోద్వేగ బంధం ఉన్నవారు పరస్పరం అభివాదం చేసుకుంటూ 'జై భీమ్' అని చెప్పుకుంటున్నారు.

మహారాష్ట్ర నలుమూలలా 'జై భీమ్' అనే పదంతో వేలు కాదు లక్షలాది పాటలు ఉంటాయి. తమిళనాడులో ప్రస్తుతం ఈ ఒక్క పదం అంబేడ్కర్‌ అభిమానుల నిత్య పారాయణంగా మారింది.

డా. బాబాసాహెబ్ అంబేడ్కర్‌ అసలు పేరు భీమ్‌రావ్ రామ్‌జీ అంబేడ్కర్‌. అంబేడ్కర్‌ ఉద్యమం పట్ల నిబద్ధత ఉన్నవారు ఆయనను గౌరవంగా 'జై భీమ్' అని పిలుస్తారు.

'జై భీమ్' అనేది కేవలం పలకరింపు పదం కాదు. అది అంబేడ్కర్‌ ఉద్యమ నినాదంగా మారింది. అంబేడ్కరైట్ ఉద్యమంలో కార్యకర్తలు ఈ పదాన్ని ఉద్యమానికి జీవనాడిగా భావిస్తారు.

అభివాదానికి ఉపయోగించే ఈ పదం విప్లవానికి ప్రతీకగా మారిన తీరు కూడా ఆసక్తికరంగా ఉంటుంది. 'జై భీమ్' అనే పదం ఎప్పుడు వాడుకలోకి వచ్చింది, మహారాష్ట్రలో ఆ పదం ఎలా పుట్టి భారతదేశమంతటికీ వ్యాపించిందో తెలుసుకోవడానికి ఈ కథనం ప్రయత్నిస్తుంది.

అంబేద్కర్ , బాబూ హర్దాస్

'జై భీమ్' నినాదం ఎలా పుట్టింది?

అంబేడ్కర్‌ ఉద్యమకారుడు బాబు హర్దాస్ లక్ష్మణ్ నగరాలే 1935లో 'జై భీమ్' అని నినదించారు. బాబూ హర్దాస్ కౌన్సిల్ ఆఫ్ సెంట్రల్ ప్రావిన్సెస్-బేరార్ ఎమ్మెల్యే. అంతేకాక బాబాసాహెబ్ అంబేడ్కర్‌ ఆలోచనలను అనుసరించే కార్యకర్త.

నాసిక్‌లోని కాలారామ్ ఆలయంలో జరిగిన పోరాటం, చావ్దార్ సరస్సు సత్యాగ్రహంతో డా.బాబాసాహెబ్ అంబేడ్కర్‌ పేరు ఇంటింటికీ చేరింది. ఆ తర్వాత మహారాష్ట్ర నుంచి అంబేడ్కర్‌ అనుచరులైన దళిత నాయకులలో బాబు హర్దాస్ ఒకరు.

బాబు హర్దాస్ స్వయంగా 'జై భీమ్‌' నినాదాన్ని ఇచ్చినట్లు రామచంద్ర క్షీరసాగర్‌ తన పుస్తకం ''దళిత్‌ మూమెంట్‌ ఇన్‌ ఇండియా అండ్‌ ఇట్స్‌ లీడర్స్‌''లో రాశారు.

ప్రతి గ్రామంలో సమానత్వం గురించిన ఆలోచనలు వ్యాప్తి చెందాలనే ఆలోచనతో డా.అంబేడ్కర్‌ సమతా సైనిక్ దళ్‌ను స్థాపించారు. సమతా సైనిక్ దళ్‌కు హర్దాస్ కార్యదర్శిగా ఉండేవారు.

''కామ్‌ఠీ, నాగపూర్ ప్రాంతానికి చెందిన కార్యకర్తలతో హర్దాస్ ఒక దళాన్ని ఏర్పాటు చేశారు. ఆ దళంలోని వలంటీర్లు నమస్కార్, రామ్ రామ్ లేదా జోహార్ మాయాబాప్ అనే పలకరింపులకు బదులు 'జై భీమ్' అనాల్సిందిగా హర్దాస్ సూచించారు'' అని దళిత్ పాంథర్స్ సహ వ్యవస్థాపకడు జేవీఎస్ పవార్ అన్నారు.

ముస్లింలు 'సలాం వాలేకుం' అని విష్ చేసినప్పుడు, 'వాలేకుం సలాం' అన్నట్లుగానే 'జై భీమ్' అని చెప్పగానే సమాధానంగా 'బల్ భీమ్' అనాలని ఆయన సూచించినట్లు పవార్ వెల్లడించారు.

అంబేడ్కర్‌ జీవించి ఉన్న కాలంలోనే 'జై భీమ్' నినాదం మొదలైందని, కొందరు కార్యకర్తలు అంబేడ్కర్‌ను 'జై భీమ్' అని సంబోధించే వారని మహారాష్ట్రకు చెందిన మాజీ న్యాయమూర్తి సురేశ్ ఘోర్పడే వెల్లడించారు.

సురేశ్ ఘోర్పడే సెషన్స్ కోర్టులో రిటైర్డ్ జడ్జి. విదర్భకు చెందిన దళిత ఉద్యమకారుడు. ఆయన బాబు హర్దాస్‌‌పై వ్యాసాలు రాశారు, ఉపన్యాసాలు ఇచ్చారు.

బాబా సాహెబ్ అంబేడ్కర్ చిత్రపటాలు

బాబు హర్దాస్ ఉద్యమ నేపథ్యం

"బాబూ హర్దాస్‌కు యుక్త వయస్సు నుంచి సామాజిక సేవపై ఆసక్తి ఉండేది. 1904 లో పుట్టిన ఆయన 1920 లో సామాజిక ఉద్యమాలలో పని చేయడం ప్రారంభించారు. నాగ్‌పూర్‌లోని పట్వర్ధన్ హైస్కూల్‌లో మెట్రిక్యులేషన్ వరకు చదివాడు. ఆయన్ను 'జై భీమ్ ప్రవర్తక్' అని పిలుస్తారు" అని జస్టిస్ సురేశ్ ఘోర్పడే వెల్లడించారు.

అంబేద్కర్ స్ఫూర్తితో 1924లో కా‌మ్‌ఠీలో సంత్ చోఖమేలా హాస్టల్‌ను స్థాపించారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు వసతి కల్పించారు. కూలిపని చేసుకునే విద్యార్థుల కోసం రాత్రి పాఠశాలలను కూడా ప్రారంభించారు" అని జస్టిస్ ఘోర్పడే చెప్పారు.

''హర్దాస్ 1925లో బీడీ వర్కర్స్ యూనియన్ స్థాపించారు. బీడీ తయారీదారులు, కాంట్రాక్టర్లు కార్మికులను దోపిడీ చేసేవారు. వీటికి వ్యతిరేకంగా పోరాడిన హర్దాస్, కూలీల శ్రమకు తగిన వేతనం వచ్చేలా పోరాడారు'' అని జస్టిస్ ఘోర్పడే చెప్పారు.

కామ్‌ఠీలో 1932లో జరిగిన అణగారిన వర్గాల సమావేశానికి హర్దాస్ రిసెప్షన్ కమిటీ అధ్యక్షుడిగా వ్యవహరించారని, ఈ సమావేశానికి వచ్చిన అంబేడ్కర్‌కు హర్దాస్ స్వయంగా స్వాగతం పలికారని ఘోర్పడే వెల్లడించారు.

సమతా సైనిక్ దళ్ కార్యకర్తలకు బాబు హర్దాస్ రాసిన లేఖ కాపీ-జేవీఎస్ పవార్ సేకరణ.

'నేను అంబేడ్కర్ పార్టీ'

1937 అసెంబ్లీ ఎలక్షన్ సందర్భంగా హర్దాస్ అభ్యర్ధిగా నిలబడ్డారు. డాక్టర్ అంబేడ్కర్‌ తన ఇండిపెండెంట్ లేబర్ పార్టీ తరఫున అభ్యర్ధిగా ఆయన్ను స్వయంగా ఎంపిక చేశారు. అయితే అవతల ఆయనకు పోటీగా ఒక ధనికుడైన వ్యక్తి రంగంలో ఉన్నారు.

ఆ వ్యక్తి తరఫున వచ్చిన మధ్యవర్తి ఒకరు హర్దాస్‌ను పోటీ నుంచి విరమించుకోవాలని, ఇందుకు అవసరమైన డబ్బు ఇస్తామని సూచించారు. కానీ, హర్దాస్ అందుకు ఒప్పుకోలేదు.

''నేను అంబేడ్కర్‌ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాను. అమ్ముడు పోయేది లేదు, పోటీ నుంచి తప్పుకునేది లేదు'' అని స్పష్టంగా చెప్పారని వసంత మూన్ అనే రచయిత తన పుస్తకం 'వస్తి'లో పేర్కొన్నారు.

ఆ తర్వాత, ఆ ధనికుడైన అభ్యర్ధి ఒక వస్తాదును హర్దాస్ వద్దకు పంపారని, రూ.10 వేలు ఇస్తాం పోటీ నుంచి తప్పుకోవాల్సిందిగా సూచించారని, లేదంటే చంపేస్తామని చెప్పారని వసంత మూన్ రాశారు.

కానీ, హర్దాస్ భయపడ లేదు. నాకేదైనా జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు కూడా. పోటీ నుంచి తప్పుకొనేది లేదని తేల్చి చెప్పడంతో ఆ వస్తాదు వెళ్లిపోయినట్లు వసంత మూన్ తన పుస్తకంలో పేర్కొన్నారు.

ప్రతిపక్షం దగ్గర డబ్బు, అధికారం ఉన్నప్పటికీ బాబు హర్దాస్ ఎన్నికలలో గెలిచి కౌన్సిల్ ఆఫ్ సెంట్రల్ ప్రావిన్సెస్-బేరార్‌కు ఎమ్మెల్యే అయ్యారు. తర్వాత 1939లో ఆయన క్షయవ్యాధితో మరణించాడు.

హర్దాస్ అంత్యక్రియలకు దళితులు, కూలీలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ''హర్దాస్ మరణతో తన కుడి చేయి పోయినట్లుగా ఉందని డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్‌ అన్నారు" అని జస్టిస్ ఘోర్పడే చెప్పారు.

'బోలే ఇండియా జై భీమ్' అనే మరాఠీ చిత్రాన్ని బాబు హర్దాస్ జీవితం ఆధారంగా నిర్మించారు.

జై భీమ్ నినాదాలతో ఉన్న కీ చైన్లు

'జై భీమ్' అని ఎందుకు అంటారు?

''బాబాసాహెబ్ అంబేడ్కర్‌ పేరు భీమ్‌రావ్ రామ్‌జీ అంబేద్కర్. ఆయన పేరును సంక్షిప్త రూపంలో పిలుచుకునే విధానం మొదట్లో మహారాష్ట్రలో ఉండేది. క్రమంగా భారతదేశమంతటా పాకింది'' అని రచయిత నరేంద్ర జాదవ్ అన్నారు.

డా. జాదవ్ ''అంబేద్కర్- అవేకెనింగ్ ఇండియాస్ సోషల్ కాన్షస్‌నెస్'' అనే పుస్తకాన్ని రాశారు. "జై భీమ్ నినాదాన్ని బాబు హర్దాస్ ప్రారంభించారు. ఇది దళితులందరి విజయం'' అని డా. జాదవ్ అన్నారు.

'జై భీమ్' నినాదం ఒక గుర్తింపుగా మారిందని సీనియర్ పాత్రికేయుడు, రచయిత ఉత్తమ్ కాంబ్లే అన్నారు.

'' అది సాంస్కృతిక గుర్తింపుతో పాటు రాజకీయ గుర్తింపుగా కూడా మారింది. అంబేద్కర్ ఉద్యమంతో ఉన్న సంబంధాన్ని ఇది చూపుతుంది. ఇది మొత్తం విప్లవానికే గుర్తింపుగా మారిందని నేను భావిస్తున్నాను" అని కాంబ్లే చెప్పారు.

''సూర్య సినిమా చూస్తే అందులో 'జై భీమ్' అనే పదాన్ని డైరెక్ట్‌గా ఉపయోగించకపోవడం గమనించవచ్చు. అది విప్లవానికి చిహ్నం'' అన్నారు ఉత్తమ్ కాంబ్లే.

'జై భీమ్' అనడం కేవలం నమస్కారం, నమస్తే అన్నంత తేలిక కాదని, అంబేద్కరిస్టు భావజాలానికి , ఉద్యమానికి దగ్గరగా ఉన్నామని చెప్పడంగా అర్ధం చేసుకోవాలని సీనియర్ జర్నలిస్టు మధు కాంబ్లే అభిప్రాయపడ్డారు.

మహారాష్ట్ర వెలుపల 'జై భీమ్'

ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో 'జై భీమ్' నినాదం ఎక్కువగా వినబడుతుంది. అంబేడ్కర్‌ ఆలోచనలు పంజాబ్‌లో కూడా విస్తరించాయి. 'జై భీమ్-జై భీమ్, బోలో జై భీమ్' అంటూ పాటలు కూడా వినిపిస్తాయి.

ఉత్తర్‌ప్రదేశ్‌లో చంద్రశేఖర్ ఆజాద్ తన 'రావణ్' సంస్థకు 'భీమ్ ఆర్మీ' అని పేరు పెట్టారు. దిల్లీలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన జరిగినప్పుడు, ముస్లిం వర్గానికి చెందిన నిరసనకారులు కూడా డా.అంబేడ్కర్‌ ఫొటోలను ప్రదర్శించారు.

'జై భీమ్' నినాదం ఒక వర్గానికి, భౌగోళిక సరిహద్దులకే పరిమితం కాదనడానికి ఇది నిదర్శనం.

ఈ మార్పు ఎలా జరిగింది అని అడిగినప్పుడు, "బాబాసాహెబ్ ప్రాముఖ్యం, ఆలోచనల వ్యాప్తి పెరిగే కొద్దీ, ఈ నినాదం సర్వవ్యాప్తి చెందింది'' అని డా. నరేంద్ర జాదవ్ అన్నారు.

మండల్ కమిషన్ తర్వాత దేశంలో సైద్ధాంతిక కల్లోలం ఏర్పడి..దళితుల్లోనే కాకుండా ఇతర అట్టడుగు వర్గాల్లోనూ చైతన్యం వచ్చిందని జాదవ్ అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
'Jai Bhim': How this slogan was born and who first used it
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X