APSRTC ఛార్జీల పెంపు తప్పదా ? చమురు సంక్షోభం వేళ..!
ఏపీలో ప్రజా రవాణా సంస్ధ (APSRTC) టికెట్ రేట్లు పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో భారీగా పెరుగుతున్న డీజిల్ ధరలు సంస్ధ లాభాల్ని ఆవిరి చేస్తున్న వేళ.. టికెట్ రేట్ల పెంపుకు ఆర్టీసీ మొగ్గు చూపవచ్చని సమాచారం. ఈ మేరకు అధికారులు అప్పుడే లెక్కల్ని సిద్దం చేస్తున్నారు. ఇప్పటికే పెరిగిన డీజిల్ రేట్లతో నష్టాలు చవిచూస్తున్న ఆర్టీసీ.. మరోసారి రేట్లు పెరిగితే ఛార్జీల్ని పెంచేందుకు వీలుగా ఏర్పాట్లు చేసుకుంటోంది.
రాష్ట్రంలో ప్రతీ రోజూ దాదాపు 38 లక్షల కిలోమీటర్ల మేర ఆర్టీసీ బస్సులు ప్రయాణిస్తున్నాయి. ఇందులో ప్రతీ ఐదు కిలోమీటర్ల దూరానికీ లీటరు డీజిల్ ఖర్చవుతోంది. ఆ లెక్కన చూస్తే ఆర్టీసీకి ప్రతి రోజూ 7.60 లక్షల లీటర్ల డీజిల్ ఖర్చవుతోంది. వారం క్రితం వరకూ ఆర్టీసీకి లభించే సబ్సిడీ డీజిల్ లీటరు ధర రూ.87.72గా ఉండేంది. ధరల పెరుగుదల కారణంగా మే 25 నాటికి ఇది ఏకంగా రూ.95.61కు ఎగబాకింది. దీంతో ఆర్టీసీపై ప్రతి లీటరుకు రూ.7.89 అదనపు భారం పడుతోంది. ఈ లెక్కన ప్రతి రోజూ 7.60 లీటర్ల వినియోగానికి రూ.60 లక్షలు అదనంగా ఖర్చవుతోంది.

అసలే వేసవి సెలవులు కావడంతో జనం ప్రయాణాలతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటికే పెరిగిన ధరలతో ఆర్టీసీపై నెలకు రూ.18 కోట్ల అదనపు భారం పడింది. పెరిగిన డీజిల్ భారం కారణంగా అద్దె బస్సులు సైతం తమకు అద్దె పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇదే పరిస్దితి కొనసాగితే ఆర్టీసీ భారీ నష్టాల్లో కూరుకుపోవడం ఖాయం. ఈ పరిస్దితిని నివారించేందుకు టికెట్ రేట్లు పెంచక తప్పని పరిస్దితి ఉందని ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. అయితే ఎంత పెంచాలి, ఎప్పుడు పెంచాలన్న దానిపై ఆర్టీసీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు.














Click it and Unblock the Notifications