జెఫ్ బెజోస్ కు భారీ ఎదురుదెబ్బ- భారీ పేలుడు
జెఫ్ బెజోస్ స్థాపించిన అంతరిక్ష సంస్థ బ్లూ ఆరిజిన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఈ సంస్థకు చెందిన న్యూ గ్లెన్ రాకెట్ ప్రయోగ సమయంలో పేలిపోయింది. అమెరికా కాలమానం ప్రకారం గురువారం రాత్రి 9 గంటల సమయంలో ఫ్లోరిడాలో ఈ ఘటన చోటు చేసుకుంది. కేప్ కెనవెరల్ లాంచ్ ప్యాడ్ వద్ద పరీక్షా సమయంలో ఈ రాకెట్ పేలిపోయింది. స్పేస్ లాంచ్ కాంప్లెక్స్ 36 వద్ద ఈ ప్రయోగం చేపట్టారు. రాకెట్ కు హాట్‌ఫైర్ టెస్ట్ నిర్వహిస్తోన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఓ అగ్నిగోళంలా మండిపోయింది. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని బ్లూ ఆరిజిన్ వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియోలు విడుదల అయ్యాయి. న్యూ గ్లెన్ రాకెట్ ప్రయోగం ప్రారంభమైన కొన్ని క్షణాలకే మంటల్లో చిక్కుకోవడం కనిపించింది. అమెజాన్ కు చెందిన లియో ఇంటర్నెట్ సర్వీసుల కోసం మొత్తం 48 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి మోసుకెళ్లాల్సి ఉన్న రాకెట్ ఇది. ఎలాన్ మస్క్ కు చెందిన స్టార్‌లింక్‌కు పోటీగా బ్లూ ఆరిజిన్ ఈ మిషన్ చేపట్టింది.

శాటిలైట్ల ద్వారా నేరుగా ఇంటర్నెట్ సర్వీసులను మొదలుపెట్టాలని ఈ ప్రయోగానికి తెర తీసింది. దీనికి ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఈ పేలుడు తీవ్రతకు సమీపంలోని ఇళ్లు కంపించాయి. ఆకాశం కొన్ని క్షణాల పాటు నారింజ రంగులోకి మారింది. జూన్ 4వ తేదీన జరగాల్సిన ఉపగ్రహ ప్రయోగానికి ముందు ఇంజిన్ ఫైరింగ్ టెస్ట్ నిర్వహిస్తుండగా ఈ పేలుడు సంభవించిందని బ్లూ ఆరిజిన్ ప్రకటించింది. న్యూ గ్లెన్ రాకెట్ కిందటి నెలలో విజయవంతంగా ప్రయోగించింది గానీ.. ఇంజిన్ వైఫల్యం కారణంగా ఒక ఉపగ్రహాన్ని తప్పుడు కక్ష్యలో వదిలివేసింది.
Sound synchronized from @NASASpaceflight footage pic.twitter.com/EWr9t8iegP
— Scott Manley (@DJSnM) May 29, 2026
దీంతో తాత్కాలికంగా దీన్ని నిలిపివేసింది బ్లూ ఆరిజిన్. అది పునరావృతం కాకుండా ఉండటానికి ముందుగానే ఇంజిన్ కు హాట్ టెస్ట్ ఫైర్ చేపట్టింది. దీనికి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. కాగా వ్యోమగాములను చంద్రుడిపైకి తీసుకెళ్లే ల్యాండర్‌లతో సహా నాసా కోసం పలు ల్యాండర్లను ప్రయోగించడానికి బ్లూ ఆరిజిన్ ఈ రాకెట్‌ను ఉపయోగించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఓ ప్రోటోటైప్ లూనార్ ల్యాండర్‌ను చంద్రుడికి పంపడానికి కంపెనీ సన్నాహాలు చేసింది కూడా.
321 అడుగుల ఎత్తు ఉన్న న్యూ గ్లెన్ రాకెట్ 2025లో మొదటిసారిగా ప్రయోగించింది బ్లూ ఆరిజిన్. భూ కక్ష్యలో చేరిన మొదటి అమెరికన్ అయిన జాన్ గ్లెన్ పేరు దీనికి పెట్టారు. టెక్సాస్ నుండి పర్యాటకులను అంతరిక్ష అంచుల వరకు తీసుకెళ్లిన న్యూ షెపర్డ్ రాకెట్ల కంటే పెద్దది, మరింత శక్తివంతమైనది కూడా.












Click it and Unblock the Notifications