డీలిమిటేషన్ కాదు అసలు ప్లాన్ అదే? బీజేపీ పార్టీల చీలిక గుట్టు బయటపెట్టిన కాంగ్రెస్..!
గతంలో పార్లమెంట్ లో డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన)- మహిళా బిల్లుల్ని కలిపి ప్రవేశపెట్టి నెగ్గించుకోవాలని చూసిన కేంద్రానికి 2/3 వంతు మెజార్టీ లేకపోవడంతో షాక్ తప్పలేదు. అప్పటి నుంచీ ఈ బిల్లుల్ని ఎలాగైనా నెగ్గించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ.. పలు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల్ని అడ్డంగా చీల్చేస్తోంది. ఇదే క్రమంలో టీఎంసీ, శివసేన థాక్రే వర్గం, ఆప్.. ఇలా పలు పార్టీలు చీలిపోయాయి. ఇలా చీలిన ఎంపీల సాయంతో వర్షాకాల సమావేశాల్లో బిల్లులు నెగ్గించుకోవాలనేది బీజేపీ ప్లాన్. అయితే బీజేపీ దీనిని మించిన ప్లాన్ చేస్తోందని కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ (Jairam Ramesh) ఇవాళ వెల్లడించారు.
నియోజకవర్గాల పునర్విభజన బిల్లు (Delimitation Bill) విషయంలో ప్రధానమంత్రి తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, ఆ కోపం ఆయన ముఖంలో స్పష్టంగా కనిపించిందని జైరాం రమేశ్ తెలిపారు. అలాగే హోం మంత్రి అమిత్ షా కూడా ఆగ్రహంగానే ఉన్నారన్నారు. అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ వారికి మూడింట రెండు వంతుల మెజారిటీ రాలేదని, అందుకే ఇప్పుడు వారు ప్రతీకారం తీర్చుకుంటున్నారని జైరాం రమేశ్ వెల్లడించారు.

ఇవి ప్రతీకార రాజకీయాలు, వారు పార్టీలను చీలుస్తున్నారు, కానీ వారికి మూడింట రెండు వంతుల మెజారిటీ రాదని జైరాం రమేశ్ తేల్చిచెప్పేశారు. మానసికపరమైన ఎత్తుగడలు వేయడంలో వారు దిట్ట, భారత రాజ్యాంగాన్ని మార్చడమే వారి అసలు లక్ష్యం... 400 సీట్ల లక్ష్యాన్ని పెట్టుకోవడం వెనుక ఉన్న ఉద్దేశం రాజ్యాంగాన్ని మార్చగలిగే స్థితిని పొందడమే... అసలు విషయం సామాజిక న్యాయానికి సంబంధించిన రిజర్వేషన్ల (Reservations) గురించే. వారు దీని నుండి తప్పించుకోవాలని చూస్తున్నారన్నారు. వారు రిజర్వేషన్లను రద్దు చేయాలనుకుంటున్నారు, అందుకే మూడింట రెండు వంతుల మెజారిటీ కోసం ప్రయత్నిస్తున్నారని రమేశ్ ఆరోపించారు.












Click it and Unblock the Notifications