రాజధానిపై జైరాం, తల్లిని చంపి బిడ్డకు జీవం: టిపై మోడీ
న్యూఢిల్లీ: సీమాంధ్రలో రాజధాని ఎక్కడ పెట్టాలనే విషయమై చర్చలు జరుగుతున్నాయని కేంద్రమంత్రి, మంత్రుల బృందం సభ్యులు (జివోఎం) జైరామ్ రమేష్ శుక్రవారం న్యూఢిల్లీలో చెప్పారు. రాజధాని కోసం అనేక డిమాండ్లు వినిపిస్తున్నాయన్నారు. నిపుణుల కమిటీ రాజధాని విషయం తేల్చుతుందన్నారు. సీమాంధ్రలో మూడు, తెలంగాణలో ఏడు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
ప్రతి విశ్వవిద్యాలయానికి పదిహేను కోట్ల రూపాయలు ఇస్తామన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ సస్పెండెడ్ యానిమేషన్లో ఉందన్నారు. అది ఎన్ని రోజులు ఉంటుందో అప్పుడే చెప్పలేమని అభిప్రాయపడ్డారు. సీమాంధ్ర ప్రాంతానికి ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తున్నామని, పదేళ్ల పాటు పన్ను రాయితీ ఇస్తున్నామని చెప్పారు. కడప, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయనున్నారు.

విభజన తీరుపై మోడీ మండిపాటు
గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ ఎపి విభజన తీరు పైన నిప్పులు చెరిగారు. వందలాది మంది బలిదానాల తర్వాత తెలంగాణ ఏర్పాటయిందని, దీనిని అందరూ స్వాగతించాలని, తెలంగాణ ఏర్పాటుకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు అన్నారు. అయితే, విభజన విషయంలో కాంగ్రెసు పార్టీ తీరును మాత్రం ఆయన తూర్పారబట్టారు. సీమాంధ్ర కూడా కీలక ప్రాంతమన్నారు.
విభజన విషయంలో కాంగ్రెసు తీరు బిడ్డను బతికించి తల్లిని చంపినట్లుగా ఉందన్నారు. తెలుగు గౌరవాన్ని, తెలుగు జాతి ఉన్నతిని నాశనం చేసిందన్నారు. తెలంగాణ పునర్ నిర్మాణంతో పాటు సీమాంధ్ర మంచిని కూడా తమ పార్టీ కోరుకుంటుందని నరేంద్ర మోడీ చెప్పారు. ఎపిని అధ్వాన్నంగా తయారు చేశారన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే కాంగ్రెసు సీమాంధ్రను వదిలేసిందని మండిపడ్డారు.
త్వరలో సీమాంధ్రలో తాను పర్యటిస్తానని మోడీ చెప్పారు. సీమాంధ్ర కన్నీళ్లు తుడుస్తానని చెప్పారు. సీమాంధ్ర ప్రాంతాన్ని అనాధను చేసిందన్నారు. సీమాంధ్రలో ఒక్క ఓటు పడదని కాంగ్రెసు నాశనం చేసిందని, కాంగ్రెసు పాపాలు ఆ పార్టీని తుడిచి పెడతాయని, రెండు ప్రాంతాలకు తాము న్యాయం చేయాలనుకున్నామన్నారు. డెలివరీ చేయడం చేతకాగని కాంగ్రెసు తల్లీ, పిల్లను నాశనం చేసిందన్నారు.
సిఎస్ అధ్యక్షతన ఎపెక్స్ కమిటీ
రాష్ట్ర విభజన అంశంపై శాఖల మధ్య సమన్వయం కోసం ఎనిమిది మంది సభ్యులతో కూడిన ఎపెక్స్ కమిటీని ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఎపెక్స్ కమిటీ పని చేస్తుంది. పాలనాపరమైన విభజన కోసం ఏర్పాటు చేసిన 15 కమిటీల పైన జివో విడుదలయింది.












Click it and Unblock the Notifications