పాకిస్థాన్ పై కనికరం అస్సలు వద్దు: జైశంకర్ సంచలనం
బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం దిల్లీలోని భారత్ మండపంలో జరుగుతోంది. ఈ సమావేశంలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ టెర్రరిజంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదంపై 'జీరో టాలరెన్స్' పాటించాలని ఆయన పిలుపునిచ్చారు. ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తక్షణ సంస్కరణలు అవసరం అని జై శంకర్ స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సమస్యలు, వివాదాలపై స్పందించారు. అంతర్జాతీయ శాంతి, సమగ్రతను టెర్రరిజంతో పెను ముప్పు పొంచి ఉందని పేర్కొన్నారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా వదిలే ప్రసక్తే లేదని జై శంకర్ తేల్చి చెప్పారు.
సరిహద్దుల్లో ఉగ్రవాద కార్యకలాపాల వల్ల దేశాల మధ్య సంబంధాలు మరింతగా క్షీణిస్తున్నాయని విదేశాంగమంత్రి జైశంకర్ స్పష్టం చేశారు. అంతర్జాతీయ సంబంధాలకు ఉగ్రవాదం పూర్తిగా అడ్డుపడుతోందని అన్నారు. ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా రాజీలేని నియమంగా ఉండాలని జై శంకర్ పేర్కొన్నారు.
"ప్రస్తుతం అంతర్జాతీయ సవాళ్లు పెరుగుతున్నాయి. వ్యవస్థలు బలహీన పడుతున్నాయి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత, తాత్కాలిక విభాగాల్లో సంస్కరణలు తక్షణమే చేపట్టాలి. ఉగ్రవాదంపై ఆలస్యం భారీ మూల్యానికి దారి తీస్తుంది" అని జై శంకర్ స్పష్టం చేశారు.
గతేడాది ఏప్రిల్ 22 న జమ్మూకాశ్మీర్ లోని పహల్గామ్ లో ఉగ్రదాడి జరిగి 22 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దానికి ప్రతీకారంగా పాకిస్థాన్ పై భారత్ మే 7 నుంచి 10 వరకు ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఈ ఆపరేషన్ లో భాగంగా పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక ఉగ్రవాద స్థావరాలను భారత్ సైన్యం ధ్వంసం చేసింది. అలాగే వందలాది మంది ఉగ్రమూకలను హతమార్చింది.

అయితే ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్థాన్ కు చైనా సాంకేతిక సాయం చేసినట్లు వచ్చిన నివేదికలపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. బాధ్యతాయుతమైన దేశాలు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే అది వారి అంతర్జాతీయ ప్రతిష్టపై ఎలాంటి ప్రభావం చూపుతుందో పునరాలోచించుకోవాలని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తాజాగా పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications