రెండో విడత నోటిఫికేషన్ జారీ
Jammu Kashmir Assembly election 2024: ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోంది జమ్మూ కాశ్మీర్. దశాబ్ద కాలం తరువాత ఆ కేంద్ర పాలిత ప్రాంతానికి ఎన్నికలు జరుగనున్నాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను సైతం కేంద్ర ఎన్నికల కమిషన్ ఇటీవలే విడుదల చేసింది. మొత్తం మూడు దశల్లో ఎన్నికలను నిర్వహించనున్నట్లు తెలిపింది.
జమ్మూ కాశ్మీర్‌లో ఉన్న మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాలు.. 90. తొలి దశలో పుల్వామా, అనంత్‌నాగ్, షోపియాన్, కుల్గాం, రాంబన్, కిష్తవార్, దోడా జిల్లాల్లో 24 స్థానాలకు సెప్టెంబర్ 18వ తేదీన ఓటింగ్ జరుగనుంది. గందర్‌బాల్, శ్రీనగర్, బుద్గాం, పూంఛ్, రియాసి, రాజౌరి జిల్లాల్లో గల 26 స్థానాలకు సెప్టెంబర్ 25న రెండో దశలో పోలింగ్ ఉంటుంది.

అక్టోబరు 1వ తేదీన చివరి దశలో బండీపొర, కుప్వారా, బారాముల్లా, ఉధంపూర్, జమ్ముూ, సాంబా, కథువా జిల్లాల్లో 40 సీట్లల్లో పోలింగ్ షెడ్యూల్ అయింది. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, అప్నీ పార్టీ, డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ, సీపీఎం ఈ ఎన్నికల బరిలో నిల్చోనున్నాయి.
మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 74 జనరల్, ఏడు ఎస్సీ, తొమ్మిది ఎస్టీ అభ్యర్థులకు రిజర్వ్‌డ్ స్థానాలు. మొత్తం 87,09,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 44,46,000 వేల మంది పురుషులు, 42, 62,000 మంది మహిళలు ఉన్నారు. 3.71 లక్షల మంది మొదటి సారిగా ఓటు వేయనున్నారు.
ఈ ఎన్నికల రెండో విడత నోటిఫికేషన్‌ను కేంద్ర ఎన్నికల కమిషన్ జారీ చేసింది. సెప్టెంబర్ 25వ తేదీన 26 స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేయడానికి చివరి గడువు .. 5వ తేదీ. 6వ తేదీన స్క్రూటినీ ఉంటుంది. దాఖలు చేసిన నామినేషన్ పత్రాలను ఉపసంహరించుకోవడానికి 9వ తేదీ వరకు గడువు ఉంటుంది.
రెండో విడతలో కంగన్ (ఎస్టీ), గందర్‌బాల్, హజ్రత్‌బాల్, ఖన్యార్, హబ్బకదల్, లాల్ చౌక్, ఛానాపొరా, జడీబల్, ఈద్గా, సెంట్రల్ షల్టెంగ్, బుద్గాం, బీరా, ఖాన్ సాహిబ, ఛాహర్-ఇ-షరీఫ్, చదూర, గులాబ్ గఢ్ (ఎస్టీ), రియాసీ, శ్రీమాతా వైష్ణో దేవి, కాలాకోటె-సుందర్బనీ, నౌషేరా, రాజౌరీ (ఎస్టీ), బుధాల్ (ఎస్టీ), థన్నా మండీ (ఎస్టీ), సురాన్‌కోట్ (ఎస్టీ), పూంఛ్ హవేలీ మెంధార్ స్థానాల్లో పోలింగ్ ఉంటుంది.












Click it and Unblock the Notifications