కార్యకర్తల ఆత్మహత్యాయత్నం: మీ కోరిక నెరవేరుస్తానని జయలలిత
చెన్నై: పార్టీ కార్యకర్తల మనోభీష్టాన్ని త్వరలోనే నెరవేరుస్తానని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత అన్నారు. ఆమె ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించడంలో జరుగుతున్న జాప్యాన్ని భరించలేక పలువురు కార్యకర్తలు ఆత్మహత్యలకు యత్నిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. కార్యకర్తల మనోభీష్టం త్వరలోనే నెరవేరుతుందని, భవిష్యత్తులో మనం తీసుకునే నిర్ణయాలను బట్టే రాష్ట్ర ప్రగతి ఆధారపడి ఉందని, ఎవరూ ఆగ్రహావేశాలకు, భావోద్రేకాలకు లోను కావొద్దని ఆమె కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు.

కాగా, జయలలిత ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా కనిపిస్తున్నారు. అధికార అన్నాడీఎంకే పార్టీకి చెందిన శాసన సభ్యుడు పీ వెట్రివేల్ ఆదివారం నాడు తన పదవికి రాజీనామా చేశాడు. సభాపతి పీ ధనపాల్ వెంనటే ఈ రాజీనామాను ఆమోదించారు.
కోర్టు నిర్దోషిగా తేల్చిన జయలలితను ఈ నెల 22వ తేదీన శాసన సభా పక్ష నేతగా ఎన్నుకునేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోపక్క చెన్నైలోని రాధాకృష్ణ నగర్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న వెట్రివేల్ రాజీనామా చేయడం గమనార్హం. జయ సీఎంగా బాధ్యతలు చేపడితే ఆరు నెలల్లోగా ఉప ఎన్నికల ద్వారా ఎమ్మెల్యేగా గెలవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే వెట్రివేల్ రాజీనామా చేసి ఉంటారని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications