తమిళనాట సంచలనం: 'జయ వీడియో తీసిందే శశికళ', ఈసీ ఆగ్రహం
చెన్నై: తమిళనాడులో ఆర్కే నగర్ ఉప ఎన్నిక మరోసారి చర్చనీయాంశంగా మారింది. దినకరన్ వర్గం ఎమ్మెల్యే వెట్రివేల్.. దివంగత జయలలిత ఆసుపత్రిలో ఉన్నప్పటి ఫోటోలు, వీడియోలు విడుదల చేశారు. ఇది తమిళ రాజకీయాల్లో సంచలనంగా మారింది.
Recommended Video

గురువారం ఆర్కే నగర్ ఉప ఎన్నికలు ఉన్నాయి. ఒక్క రోజు ముందు ఈ వీడియోలు విడుదల చేయడంతో పరిణామాలు వేడెక్కాయి. వీడియో విడుదలపై ఎన్నికల సంఘం, అన్నాడీఎంకే వర్గాలు వెంటనే స్పందించాయి.

అందుకే విడుదల చేశా
వీడియో విడుదల సందర్భంగా వెట్రివేల్ మాట్లాడారు. జయలలిత మృతి విషయంలో నిరాధార ఆరోపణలు చేస్తున్నందువల్లే విడుదల చేసినట్లు చెప్పారు. అమ్మను ఆసుపత్రికి తీసుకు వచ్చే సమయంలోనే మృతి చెందారని ఆరోపణలు చేస్తున్నారన్నారు. పన్నీరుసెల్వం సహా అందరూ ఆరోపణలు గుప్పిస్తున్నారని చెప్పారు.

ఆ వీడియో తీసింది శశికళనే
జయలలిత ఆసుపత్రిలో ఉన్నంత కాలం అదే విషయం చెబుతూ నిరాధార ఆరోపణలు చేశారని వెట్రివేల్ మండిపడ్డారు. జయ మరణం విషయంలో అందరూ నాటకాలు ఆడారని చెప్పారు. ఈ వీడియోను శశికళనే స్వయంగా తీశారని చెప్పారు. మరిన్ని ఆధారాలు ఉన్నాయని, ఫోటోలు, వీడియోలు అవసరమైతే బయటపెడతామని చెప్పారు. ఈ ఫోటోలు పన్నీరు, పళని స్వామిల వద్ద కూడా ఉన్నాయని చెప్పారు.

అపోలో వర్గాల స్పందన
అమ్మ ఆసుపత్రిలో ఉన్నప్పటి వీడియో అంటూ వచ్చిన విషయమై అపోలో వర్గాలు స్పందించాల్సి ఉంది. వీడియోను తాము పరిశీలిస్తున్నామని వారు చెప్పారు.

దినకరన్ వర్గంపై ఈసీ సీరియస్
జయలలిత ఆసుపత్రి వీడియోపై ఎన్నికల సంఘం సీరియస్ అయింది. వీడియో విడుదల ఎన్నికల నియమావళికి విరుద్ధమని ఎన్నికల అధికారులు తెలిపారు. రేపు ఎన్నికలు అనగా ఈ సమయంలో వీడియో ఎందుకు విడుదల చేశారో చెప్పాలని దినకరన్ వర్గాన్ని ప్రశ్నించింది. విడుదల చేసిన ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయమని ఈసీ ఆదేశించింది.












Click it and Unblock the Notifications