జేఈఈ మెయిన్స్ 2021: 4వ విడత పరీక్ష తేదీల్లో మార్పులు, ఆగస్టు 26 నుంచి సెప్టెంబర్ 2 వరకు
న్యూఢిల్లీ: జేఈఈ(మెయిన్) నాలుగో విడత పరీక్షల తేదీల్లో పలు మార్పులు జరిగాయి. ఈ పరీక్షలను ఆగస్టు 26, 27, 31, సెప్టెంబర్ 1, 2 తేదీల్లో నిర్వహిస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గురువారం వెల్లడించారు. ఇందుకు అనుగుణంగా జేఈఈ మెయిన్ నాలుగో విడత దరఖాస్తుల గడువును కూడా జులై 20 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపారు.
ఈ పరీక్షకు ఇప్పటికే దేశ వ్యాప్తంగా 7.32 లక్షల మంది తమ పేర్నలు నమోదు చేసుకున్నారని, విద్యార్థుల నుంచి వచ్చిన డిమాండ్లను దృష్టిలో ఉంచుకుని ఈ మార్పులు చేసినట్లు కేంద్రమంత్రి చెప్పారు. మూడు, నాలుగు విడతల జేఈఈ మెయిన్ పరీక్షల మధ్య నాలుగు వారాల వ్యవధి ఇవ్వాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) డీజీసీకి సూచించినట్లు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు.

కాగా, గత ఏప్రిల్ నెలలో జరగాల్సిన జేఈఈ మెయిన్ మూడో విడత పరీక్షల్లో ఎన్డీఏ స్వల్ప మార్పులు చేసినట్లు బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే. జులై 27 నుంచి ఆగస్టు 2 వరకు మూడో విడత పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. అయితే, మే నెలలో జరగాల్సిన నాలుగో దశ పరీక్షలను ఆగస్టు నెలాఖరు నుంచి సెప్టెంబర్ మొదటి వారంలోపు నిర్వహించాలని తాజాగా, నిర్ణయించింది.
కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో విద్యార్థుల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పరీక్షలు నిర్వహించే నగరాల సంఖ్యను 232 నుండి 334 కు పెంచారు. ప్రతి షిఫ్టులో పరీక్షా కేంద్రాల సంఖ్యను కూడా 660 నుంచి 828కు పెంచినట్లు ఎన్టీఏ సీనియర్ డైరెక్టర్ సాధన పరాశర్ ఇంతకుముందు వెల్లడించిన విషయం తెలిసందే.












Click it and Unblock the Notifications