కలిసొచ్చిన హైదరాబాద్ రిసార్ట్ పాలిటిక్స్: బల పరీక్షలో నెగ్గిన అధికార పార్టీ
Champai Soren: కొద్ది రోజులుగా జార్ఖండ్‌లో కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితికి తెర పడింది. కొత్త ప్రభుత్వం తన బలాన్ని నిరూపించుకుంది. కొద్దిసేపటి కిందటే శాసనసభలో జరిగిన బల పరీక్షలో నెగ్గింది. ముఖ్యమంత్రి చంపై సోరెన్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి భారతీయ జనత పార్టీ చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు.
ఇటీవలే జార్ఖండ్ ముఖ్యమంత్రిగా చంపై సోరెన్ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు మిత్రపక్షం రాష్ట్రీయ జనతాదళ్‌కు చెందిన సత్యానంద్ భోక్తా, కాంగ్రెస్ సభ్యుడు ఆలంగిర్ ఆలం.. మరికొందరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ వారితో ప్రమాణ స్వీకారం చేయించారు.

81 అసెంబ్లీ స్థానాలు ఉన్న జార్ఖండ్ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 41 మంది సభ్యుల బలం అవసరమౌతుంది. జేఎంఎం-30, కాంగ్రెస్-16, రాష్ట్రీయ జనతాళ్‌కు చెందిన ఒక సభ్యుడు.. అధికార కూటమికి మద్దతు ఇస్తోన్నారు. 47 మంది సభ్యుల బలంతో చంపై సోరెన్.. ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. 25 సభ్యుల బలం ఉన్న భారతీయ జనతా పార్టీ.. ప్రతిపక్షంలో కొనసాగుతోంది.
ఈ 47 మంది శాసనసభ్యులను విజయవంతంగా కాపాడుకోగలిగింది అధికార కూటమి. దీనికోసం హైదరాబాద్ కేంద్రబిందువుగా రాసిరా్ట్ పాలిటిక్స్‌ను నడిపించింది. జేఎంఎం సంకీర్ణ కూటమి, కాంగ్రెస్‌కు చెందిన సుమారు 40 మందికి పైగా ఎమ్మెల్యేలు నాలుగైదు రోజులుగా హైదరాబాద్ శివార్లల్లోని రిసార్టుల్లో గడిపారు.
ఈ ఉదయం రాంచీకి తరలి వెళ్లారు. అసెంబ్లీలో బల నిరూపణలో పాల్గొన్నారు. ఈడీ కస్టడీలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సైతం అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. బల పరీక్ష సందర్భంగా ఓ సభ్యుడిగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రభుత్వానికి అనుకూలంగా నిలిచారు.
చంపై సోరెన్ ప్రభుత్వానికి మొత్తం 47 మంది సభ్యులు మద్దతు తెలిపారు. వారంతా అనుకూలంగా ఓటు వేశారు. 26 మంది ప్రతిపక్ష పార్టీల సభ్యులు వ్యతిరేకంగా నిలిచారు. ఇందులో 25 మంది బీజేపీ సభ్యులు కాగా.. ఒకరు- ఆ పార్టీ మిత్రపక్షం ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్‌కు చెందిన సభ్యుడు.












Click it and Unblock the Notifications