జార్ఖండ్ లో మహిళలకు బంపర్ ఆఫర్-బీజేపీ రూ.2100-జేఎంఎం రూ.2500..!
అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న జార్ఖండ్ లో బీజేపీ వర్సెస్ జేఎంఎం రాజకీయం జోరుగా సాగుతోంది. ఇప్పటికే జార్ఖండ్ లో ఎలాగైనా పాగా వేయాలని టార్గెట్ పెట్టుకున్న బీజేపీ... గనుల అక్రమ కేటాయింపు కేసులో ఈడీ సాయంతో సీఎం హేమంత్ సోరెన్ ను జైలుకు పంపిందని జేఎంఎం ఆరోపిస్తోంది. తాజాగా జైలు నుంచి తిరిగొచ్చిన హేమంత్ ను, ఆయన భార్య కల్పనను టార్గెట్ చేసేందుకు బీజేపీ మహిళా ఓట్ల కేంద్రంగా రూ.2100 ఇస్తామని ప్రకటించింది.
బలహీన, వెనుకబడిన వర్గాల మహిళలకు తాము అధికారంలోకి వస్తే నెలకు రూ.2100 చొప్పున ఇస్తామని బీజేపీ ఇప్పటికే ప్రకటించిన పంచ్ ప్రాణ్ హామీల్లో పేర్కొంది. దీనికి కౌంటర్ గా ఇప్పుడే తాము రూ.2500 ఇస్తామని జేఎంఎం సర్కార్ ప్రకటించింది. అంతే కాదు ఈ పథకం అమలుకు అవకాశం ఇవ్వాలని ఈసీని సైతం కోరింది. దీనిపై ఈసీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈసీ జేఎంఎంను అనుమతిస్తే బీజేపీ ఏం చేయబోతందన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.

జార్ఖండ్ లో 1.26 కోట్ల మంది మహిళలు ఉన్నారు. వీరిని ఆకట్టుకునేందుకు జేఎంఎం పలు పథకాలు అమలు చేస్తూనే ఉంది. అయినా వీటికి కౌంటర్ గా బీజేపీ నెలకు రూ.2100 ఇస్తామని ప్రకటించింది. దీంతో జేఎంఎం సర్కార్ కూడా రూ.2500 ఇవ్వడం ద్వారా దానికి కౌంటర్ ఇవ్వాలని భావిస్తోంది. అయితే జేఎంఎం పథకానికి అనుమతి ఇవ్వొద్దంటూ బీజేపీ నేతలు ఇప్పటికే ఈసీని ఆశ్రయించారు. ఇది ప్రజా ప్రాతినిధ్య చట్టానికి వ్యతిరేకమని వాదిస్తున్నారు. దీంతో ఎన్నికల సమయంలో పథకాల ప్రకటనపై ఈసీ ప్రతికూలంగా స్పందించే అవకాశాలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications