‘ఆధార్’ సమాచార రక్షణకూ ఒక చట్టం కావాలి!
భారతదేశంలోని పేదల అభ్యున్నతి కోసం అమలుచేస్తున్న సంక్షేమ పథకాల్లో లోపాలు, అవకతవకల నివారణకు అమలులోకి తీసుకొచ్చిన కార్యక్రమమే ‘ఆధార్’ ప్రాజెక్ట్. దీని అమలులో ప్రభుత్వ ఖజానాలో భారీగా పొదుపు చేయడానికి వీలు
న్యూఢిల్లీ: భారతదేశంలోని పేదల అభ్యున్నతి కోసం అమలుచేస్తున్న సంక్షేమ పథకాల్లో లోపాలు, అవకతవకల నివారణకు అమలులోకి తీసుకొచ్చిన కార్యక్రమమే 'ఆధార్' ప్రాజెక్ట్. దీని అమలులో ప్రభుత్వ ఖజానాలో భారీగా పొదుపు చేయడానికి వీలు కలిగింది.
దీనికితోడు ఆయా పథకాల అమలులో లోపాలను అధిగమించ గలిగింది. కానీ ఆధార్ ప్రోగ్రామింగ్‌లో పొరపాట్లు దాని అమలు డొల్లతనాన్ని బయటపెట్టాయి. జార్ఖండ్‌లో అమలు చేస్తున్న వ్రుద్ధుల పెన్షన్ పొందుతున్న లక్షల మంది బ్యాంకుల ఖాతాలతోపాటు పేరు, చిరునామాలు ప్రభుత్వ వెబ్‌సైట్ల నుంచి లీకయ్యాయి.

దీనికి తోడు ప్రభుత్వ పథకాలు, సర్వీసులను అమలు చేసేందు కోసం లబ్దిదారుల 'ఆధార్' నంబర్ తప్పనిసరి చేస్తూ నరేంద్రమోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుతోపాటు విపక్షాలు, సైబర్ భద్రతా నిపుణులు ప్రశ్నిస్తున్నారు. జార్ఖండ్‌లో ఆధార్ నంబర్లు సహా అన్ని వివరాలు లీకవ్వడంతో ఆ ప్రాజెక్టు అమలు పక్రియ నవ్వుల పాలైంది.
అవినీతి తగ్గించేందుకు 'ఆధార్' అమలు
ప్రభుత్వ విధానాల అమలులో పూర్తిస్థాయి పరివర్తన తేవడంతోపాటు దాని అమలుతో అవినీతిని తగ్గించొచ్చని ఆధార్ ప్రాజెక్టు అమలు చేశారు. కానీ ఆధార్ ప్రాజెక్టు కింద సమాచార భద్రత కల్పించడం ఎలాగన్న విషయం తమకు తెలియదని యూఐడీఏఐ సీఈవో ఏబీ పాండే పేర్కొన్నారు. ఇది ఆధార్ ప్రోగ్రామ్ అమలుకు సవాల్‌గా మారింది.
భద్రతకు చర్యలు తీసుకోకపోవడం వల్లే సమస్యలన్న యూఐడీఏఐ
'ఆధార్ అమలులో అంతర్గతంగా భద్రత ఉంది. ఇది సురక్షితమని నేను చెప్పగలను. కానీ 'ఆధార్' సమాచార భద్రతారూపం ఎప్పటికప్పుడు మారిపోతున్నది. మేం అనునిత్యం ప్రతి దశలోనూ ఆధార్ ప్రాజెక్టు అమలులో నిఘా కొనసాగించాల్సిన అవసరం ఉన్నది. తద్వారా ముప్పుగా పరిణమించిన అంశాలను ఎదుర్కోగలం. జార్ఖండ్ విషయంలోనూ, సమాచారం లీకైన ఇతర రాష్ట్రాల్లో ఆధార్ డేటా సమాచార భద్రతకు చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తింది' యూఐడీఏఐ పేర్కొంది. ఆధార్ వినియోగంలో భద్రతా సమస్యలు పెరుగుతున్నాయి. ప్రత్యేకించి టీం ఇండియా స్టార్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోనీ కుటుంబ వ్యక్తిగత విషయాలు బయటకు పొక్కడంతో.. ఆధార్ ప్రాజెక్టులో ఏం జరుగుతుందని ఆయన సతీమణి సాక్షి ధోనీ.. కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్‌ను ప్రశ్నించడం పరిస్థితి తీవ్రతకు అద్ధం పడుతోంది.
'ఆధార్' సమాచారానికి భద్రతా సమస్యలు
ఆధార్ సమాచార వినియోగం.. దానికి సంబంధించిన భద్రతా సమస్యలు క్రమంగా పెరుగుతున్నాయి. అత్యంత సున్నితమైన సమాచారాన్ని వివిధ ప్రభుత్వ శాఖలు అస్తవ్యవస్థమైన వ్యవస్థల మధ్య నిర్వహిస్తున్నాయి. యూఐడీఏఐ సర్వర్లపై అనునిత్యం సైబర్ దాడులు జరుగుతూనే ఉన్నాయి. బ్లాక్ స్థాయిలో పలు కంప్యూటర్లు అందునా 'ఆధార్' సమాచారం వినియోగిస్తున్న కంప్యూటర్లు పూర్తిగా అభద్రతా పరిస్థితుల్లో నిర్వహిస్తున్నారు. జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వెబ్ సైట్లకు రక్షణ కల్పించకపోతే సమస్యలు తలెత్తుతాయని సైబర్ భద్రతా నిపుణులు ముందే హెచ్చరించారు. బహుళ సాఫ్ట్ వేర్ సొల్యూషన్స్ వినియోగిస్తున్న వివిధ శాఖల కంప్యూటర్లు, వాటితో సేవలందిస్తున్న ప్రైవేట్ సర్వీస్ ప్రొవైడర్ల మధ్య వాటికి భద్రత కల్పించడం కష్ట సాధ్యంగా మారింది.
వ్యక్తిగత సమాచారానికి లభించని చట్టబద్ధత
ఆధార్ సమాచారంలో సంబంధిత పౌరుల వ్యక్తిగత సమాచారం ఉన్నా, దానికి చట్టబద్ధమైన భద్రత లేదు. థర్డ్ పార్టీ వినియోగదారులు 'ఆధార్' సమాచారం వినియోగంపై పరిమితులు లేవు. ఇటువంటి పరిస్థితుల్లో 'ఆధార్' పౌరుల సమాచారం పరిరక్షించడం కోసం పటిష్ఠమైన సమాచార పరిరక్షణ చట్టం అవసరం ఉందని చెప్తున్నారు. ఆధార్ అనుబంధ సేవలందిస్తామని ఎనిమిది అనధికారిక వెబ్‌సైట్లపై ఇటీవల యూఐడీఏఐ పోలీసులకు ఫిర్యాదులు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఎనిమిది వెబ్ సైట్లు అనధికారికంగా ఆధార్ నంబర్లు, పౌరుల నమోదు ప్రక్రియ నిర్వహిస్తుండటమే దీనికి కారణం.












Click it and Unblock the Notifications