సుప్రీంతో పోరు వేళ కేంద్రం కీలక నిర్ణయం- ఆ 44 పేర్లకు 3 రోజుల్లో గ్రీన్ సిగ్నల్..
హైకోర్టు జడ్డీల నియామకాల వ్యవహారంలో కేంద్రానికి, సుప్రీంకోర్టుకూ మధ్య సాగుతున్న పోరు ఇవాళ మరో మలుపు తిరిగింది. ఇప్పటివరకూ కొలీజియం పంపిన జడ్డీల పేర్లను ఆమోదించడం లేదని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కేంద్రం ఇవాళ కీలక నిర్ణయం ప్రకటించింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు సమాచారం ఇచ్చింది.
జడ్డీల నియామకాల విషయంలో కొలీజియం చేసే సిఫార్సుల్ని పాటించాలంటూ గతంలో కేంద్రాన్ని సుప్రీంకోర్టు కోరిన నేపథ్యంలో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. మూడు రోజుల్లో 44 మంది న్యాయమార్తుల పేర్లను క్లియర్ చేస్తామని సుప్రీంకోర్టుకు కేంద్రం హామీ ఇచ్చింది. న్యాయమూర్తుల నియామకంలో జాప్యంపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు, పెండింగ్‌లో ఉన్న పేర్లను వీలైనంత త్వరగా క్లియర్ చేయాలని ప్రభుత్వాన్ని కోరిన నేపథ్యంలో కేంద్రం స్పందన ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇప్పటివరకూ కేంద్రం వద్ద కొలీజియం పంపిన 104 మంది న్యాయమూర్తుల పేర్లు పెండింగ్ లో ఉన్నాయి. వాటిలో 44 పేర్లను మూడు రోజుల్లో క్లియర్ చేస్తామని కేంద్రం తరఫున అటార్నీ జనరల్ వెంకటరమణి ఇవాళ సుప్రీంకోర్టుకు తెలిపారు. అయితే సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కోసం కొలీజియం సిఫార్సు చేసిన ఐదు పేర్ల గురించి జస్టిస్‌లు ఎస్‌కె కౌల్, జస్టిస్ ఎఎస్ ఓకా అడిగిన ప్రశ్నకు అటార్నీ జనరల్ వెంకటరమణి.. దీనిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయన్నారు. దీనిపై త్వరలో క్లారిటీ వస్తుందన్నారు. దీంతో సుప్రీంకోర్టు విచారణను ఫిబ్రవరి 3కు వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications