CJI: కొత్త సీజేఐ ఆయనే..! నవంబర్ 24న ప్రమాణం..!
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ పదవీకాలం పూర్తి కానుండటంతో ఆయన స్ధానంలో కొత్త ప్రధాన న్యాయమూర్తి రాబోతున్నారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉన్న సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ను ఈ అత్యున్నత పదవికి ఎంపిక చేశారు. సూర్యకాంత్ పేరును ప్రస్తుత సీజేఐ బీఆర్ గవాయ్ తన వారసుడిగా సిఫార్సు చేశారు. దీనికి కేంద్రం ఆమోదముద్ర వేసింది. ఈ నేపథ్యంలో జస్టిస్ సూర్యకాంత్ వచ్చే నెల 24న కొత్త సీజేఐగా ప్రమాణస్వీకారం చేస్తారు.
తన వారసుడిగా జస్టిస్ సూర్యకాంత్ పేరును సిఫార్సు చేస్తూ ప్రస్తుత సీజేఐ బీఆర్ గవాయ్ పంపిన ప్రతిపాదనకు కేంద్ర న్యాయశాఖ ఆమోదముద్ర వేసింది. దీంతో సూర్యకాంత్ 53వ భారత ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం చేసేందుకు లైన్ క్లియర్ అయింది. హర్యానాలో 1962లో జన్మించిన సూర్యకాంత్ పేదరికంలో పెరిగారు. ఏమాత్రం సదుపాయాలు లేని స్కూళ్లలో చదువుకున్నారు. 1981లో హిసార్ లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో డిగ్రీ చదివారు. 1984లో రోహ్ టక్ లోని మహర్షి దయానంద్ వర్శిటీ నుంచి లా పట్టా తీసుకున్నారు.

అదే ఏడాది హిసార్ జిల్లా కోర్టులో సూర్యకాంత్ లాయర్ గా ప్రాక్టీస్ ప్రారంభించారు. 1985లో పంజాబ్-హర్యానా హైకోర్టులో ప్రాక్టీస్ కోసం చంఢీఘర్ కు మారారు. 2000 సంవత్సరంలో 38 ఏళ్ల వయసులో హర్యానా రాష్ట్రానికి అతి పిన్నవయస్కుడైన అడ్వకేట్ జనరల్ గా ఆయన్ను నియమించారు. 2001లో సీనియర్ అడ్వకేట్ అయ్యారు. 2004లో పంజాబ్, హర్యానా హైకోర్టు జడ్జి అయ్యారు. సూర్యకాంత్ జడ్డిగా పనిచేస్తూనే 2011లో కురుక్షేత్ర వర్శిటీ నుంచి న్యాయశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు.

2018లో హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు జడ్డిగా సూర్యకాంత్ నియమితులయ్యారు. 2019లో సుప్రీంకోర్టు జడ్జిగా ఆయన్ను నియమించారు. 2007, 20111లో రెండుసార్లు జాతీయ లీగల్ సర్వీస్ అథారిటీని ఆయన నడిపించారు. ఇప్పుడు ఆయన సీనియార్టీ ప్రకారం సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ గా నియమితులు కాబోతున్నారు.












Click it and Unblock the Notifications