వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘‘ఇండియా 2022లో న్యాయం ఇలా ఉంటుంది’’ – చావ్లా రేప్ కేసులో మరణశిక్ష పడిన నిందితుల విడుదలపై దేశంలో దిగ్భ్రాంతి, ఆగ్రహం

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
అత్యాచారాల మీద మహిళల నిరసన

పదేళ్ల కిందట దిల్లీకి చెందిన ఒక 19 ఏళ్ల యువతిపై పొరుగు రాష్ట్రమైన హరియాణా పొలాల్లో సామూహిక అత్యాచారం చేసి, హత్య చేశారు. అది ''అరుదైన కేసుల్లోనే అరుదైన’’ కేసుగా అభివర్ణించారు.

కోర్టు పత్రాల్లో అనామిక అనే పేరుతో పేర్కన్న ఆ యువతిపై జరిగిన దారుణ హింస గురించి తెలిసి దేశ ప్రజలందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు.

ఆ నేరానికి సంబంధించి ముగ్గురు పురుషులను అరెస్ట్ చేశారు. విచారణ కోర్టు వారిని దోషులుగా గుర్తించి 2014లో వారికి మరణ శిక్షను ప్రకటించింది. ఆ తీర్పును కొన్ని నెలల తర్వాత దిల్లీ హైకోర్టు నిర్ధారించింది.

కానీ సోమవారం నాడు ఆ తీర్పును సుప్రీంకోర్టు దిగ్భ్రాంతికరంగా రద్దు చేస్తూ.. ఆ ముగ్గురు మగాళ్లనూ విడుదల చేసింది. వారు ఆ నేరానికి పాల్పడ్డారనేందుకు ''స్పష్టమైన, పటిష్టమైన ఆధారాలు’’ లేవని అందుకు కారణంగా చెప్పింది.

ఈ ఆదేశాలిచ్చిన త్రిసభ్య ధర్మాసనం కేసులో పోలీసుల దర్యాప్తు గురించి తీవ్ర ప్రశ్నలు లేవనెత్తింది. విచారణలో సెషన్స్ కోర్టు తీవ్ర లోపాలున్నాయని విమర్శించింది. కోర్టు జడ్జి ''నిర్లిప్త అంపైర్’’గా వ్యవహరించారని వ్యాఖ్యానించింది.

ఈ నిర్ణయంతో బాధితురాలి తల్లిదండ్రులు హతాశులయ్యారు. న్యాయవాదులు, ఉద్యమకారులు దిగ్భ్రాంతి చెందారు. ఏటా వేలాదిగా అత్యాచారాలు నమోదయ్యే దేశంలోని సోషల్ మీడియాలో ఆగ్రహం పెల్లుబికింది.

''ఇండియా 2022లో న్యాయం ఇలా ఉంటుంది’’ అని ఒక ట్విటర్ యూజర్.. ఆ యువతి తండ్రి హతాశుడై ఉన్న ఫొటోను ఛేర్ చేస్తూ రాశారు.

కొందరు యూజర్లు.. 2002 గుజరాత్ మత అల్లర్ల సమయంలో గర్భిణి అయిన బిల్కిస్ బానో అనే ముస్లిం మహిళపై అత్యాచారం చేసి, ఆమె బంధువులను హత్య చేసిన కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న దోషులను విడుదల చేస్తూ గుజరాత్ ప్రభుత్వం ఇటీవల ఇచ్చిన ఉత్తర్వులతో.. మరణశిక్ష ఎదుర్కొంటున్న అత్యాచారం నిందితులను విడుదల చేసిన సుప్రీంకోర్టు తాజా తీర్పును పోల్చారు.

''న్యాయం జరుగుతుందనే నా ఆశలు క్షణాల్లో ఆవిరయ్యాయి’’ అని అనామిక తండ్రి నాతో చెప్పారు.

''మేం న్యాయం కోసం 10 సంవత్సరాలు నిరీక్షించాం. న్యాయ వ్యవస్థను మేం విశ్వసించాం. మరణ శిక్షను సుప్రీంకోర్టు నిర్ధారిస్తుందని, నా కూతురు హంతకులను చివరికి ఉరి తీస్తారని మేం నమ్మాము’’ అని ఆయన పేర్కొన్నారు.

బాధితురాలైన 19 ఏళ్ల యువతి నైరుతి దిల్లీలోని దిగువ మధ్యతరగతి ప్రాంతమైన 'చావ్లా’లో నివసించేది. ఆమె 2012లో రాజధాని నగరం శివార్లలో గల గురుగావ్‌లోని ఒక కాల్ సెంటర్‌లో ఉద్యోగంలో చేరింది. తన కుటుంబాన్ని పోషించే ఏకైక జీవనాధారం ఆమె.

''అప్పుడే ఆమెకు మొట్టమొదటి జీతం అందుకుంది. చాలా సంతోషంగా ఉంది’’ అని అత్యాచారాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న యోగితా భయన చెప్పారు. అనామిక కుటుంబం న్యాయం కోసం గత ఎనిమిదేళ్లుగా చేస్తున్న పోరాటానికి యోగిత మద్దతు అందిస్తున్నారు.

గ్రాఫ్

2012 ఫిబ్రవరి 9వ తేదీన అనామిక తన ఆఫీసు నుంచి ముగ్గురు స్నేహితులతో కలిసి ఇంటికి తిరిగి వస్తుండగా.. ఒక ఎర్ర కారులో వచ్చిన మగాళ్లు ఆమెను అపహరించుకుపోయారు.

నాలుగు రోజుల తర్వాత ఆమె శరీరం సగం కాలిపోయి, భయంకరంగా అవయవాలు నరికివేసి, తీవ్రంగా హింసించిన గుర్తులతో దొరికింది. పతాక శీర్షికలకు ఎక్కిన ఆ వార్త ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది.

ఈ కేసు విచారణ సందర్భంగా.. నిందితులపై బలమైన ఆధారాలు ఉన్నాయని ప్రాసిక్యూషన్ వాదించింది. ఆ ముగ్గురు పురుషుల్లో ఒకరి పర్సు నేర స్థలంలో తమకు దొరికిందని, నిందితులు నేరానికి పాల్పడినట్లు అంగీకరించారని, మృతదేహం ఉన్న ప్రాంతానికి పోలీసులను తీసుకు వెళ్లారని, బాధితురాలి దుస్తులను వెలికితీయటానికి సహకరించారని కోర్టుకు నివేదించింది.

స్వాధీనం చేసుకున్న కారు నుంచి సేకరించిన రక్తపు మరకలు, వీర్యం, వెంట్రుకల డీఎన్ఏ నమూనాలు.. నిందితులు, బాధితురాలు ఆ కారులో ఉన్నారని నిరూపించాయని ప్రాసిక్యూషన్ చెప్పింది.

రెండేళ్ల తర్వాత ఆ ముగ్గురునీ దోషులుగా నిర్ధారించిన విచారణ కోర్టు వారికి మరణ శిక్ష విధించాలని తీర్పు చెప్పింది. ఈ మరణ శిక్షను హైకోర్టు ఖరారు చేస్తూ.. నిందితులను 'వేటాడే మృగాల’ని అభివర్ణించింది.

కానీ సోమవారం నాడు జస్టిస్ బేలా త్రివేది రాసిన సుప్రీంకోర్టు 40 పేజీల ఉత్తర్వు.. ప్రాసిక్యూషన్ సమర్పించిన సాక్ష్యాలను ప్రశ్నించింది. ఆ సాక్ష్యాలను వక్రీకరించటానికి అవకాశం ఉండిందని పేర్కొంది.

''పోలీసుల ఆధారాల్లో, సాక్షుల వాంగ్మూలాల్లో చాలా పొసగని అంశాలు, వైరుధ్యాలు ఉన్నాయ’’ని చెప్పింది.

  • ''బాధితురాలి స్నేహితులు లేదా, కిడ్నాపర్లతో పోరాడటానికి ప్రయత్నించిన పురుష సాక్షి కానీ నిందితులను కోర్టులో గుర్తించలేదు.
  • ''కారు బంపర్‌కు చెందిన ఒక ముక్కతో పాటు, నిందితుల్లో ఒకరికి సంబంధించిన పత్రాలు గల పర్సును కనుగొన్నామ’’ని దిల్లీ పోలీసులు చెప్తున్నారని, కానీ అవి నేర స్థలానికి సంబంధించిన తొలి ఫొటోల్లో కనిపించలేదని సుప్రీంకోర్టు పేర్కొంది.
  • నేర స్థలానికి ముందుగా చేరుకున్న హరియాణా పోలీసులు ఈ వస్తువుల గురించి తమ నివేదికలో ప్రస్తావించలేదు.
  • దర్యాప్తు అధికారి స్వాధీన నివేదికలో ఈ వస్తువులను ప్రస్తావించలేదు.
  • పోలీసులు రికవర్ చేసిన ఒక ఫోనును.. అది నిజంగా తన కూతురుదేనని నిర్ధారించటానికి ఆమె తండ్రికి అసలు చూపనే లేదు.
  • పోలీసులు స్వాధీనం చేసుకున్న ఎర్ర కారు.. నేరం జరిగిన కారు ఒకటే అని కచ్చితంగా నిర్ధారణ కాలేదు.
  • అరెస్టులు జరిగిన పరిస్థితులు ప్రశ్నార్థకంగా ఉన్నాయి.
  • నిందితుల్లో కొందరిని పరిశీలించకపోవటం సందేహాల మేఘాన్ని సృష్టించింది.

కారు నుంచి సేకరించిన ఆధారాలను.. కారును స్వాధీనం చేసుకున్న దాదాపు రెండు వారాల తర్వాత ఫబ్రవరి 27వ తేదీన ఫోరెన్సిక్ పరీక్షకు పంపించారని కూడా కోర్టు పేర్కొంది.

''ఈ పరిస్థితుల్లో ఆ నమూనాలను తారుమారు చేసే అవకాశాన్ని కొట్టివేయలేం’’ అని జస్టిస్ తన ఉత్తర్వుల్లో రాశారు.

''ఒక దారుణమైన నేరంలో నిందితులను శిక్షించకపోతే.. సమాజానికి, ముఖ్యంగా బాధితురాలి కుటుంబానికి ఒక విధమైన వేదన, నిస్పృహ కలుగుతుంది’’ అని అంగీకరిస్తూనే.. ''అభియోగాలను హేతుబద్ధమైన సందేహానికి తావు లేకుండా నిరూపించటంలో ప్రాసిక్యూషన్ విఫలమైంది, కాబట్టి నీచమైన నేరంలో పాలుపంచుకున్నప్పటికీ నిందితులను విడుదల చేయటం తప్ప ప్రత్యామ్నాయం లేదు’’ అని ఆ ఉత్తర్వు పేర్కొంది.

మహిళలపై నేరాలు మోదీ పాలనలో పెరిగాయా, తగ్గాయా? 5 చార్టుల్లో అసలు నిజాలు

'రెచ్చగొట్టే' దుస్తులు ధరించే మహిళలకు 'లైంగిక వేధింపుల' సెక్షన్ వర్తించదు: కేరళ కోర్టు

అత్యాచారలపై మహిళల నిరసన

ఈ తీర్పుపై స్పందన కోసం దిల్లీ పోలీసు ఉన్నతాధికారులకు బీబీసీ ఈమెయిల్ పంపింది. ఈ తీర్పును సుప్రీంకోర్టులో రివ్యూ పటిషన్ ద్వారా సవాల్ చేస్తామని అనామిక కుటుంబం తరఫు న్యాయవాది చారు వాలి ఖన్నా నాకు చెప్పారు.

''ఈ తీర్పు చాలా అస్పష్టంగా ఉంది. మూడు అతి-సాంకేతిక అంశాలను లేవనెత్తుతోంది. ఆధారాలను తారుమారు చేసి ఉండవచ్చునని చెప్తోంది. కానీ పోలీసులను దోషులుగా చెప్పలేదు’’ అన్నారామె.

''తిరుగులేని ఆధారాలు లేవని ఆ తీర్పు చెప్తోంది. కానీ నిందితులకు వ్యతిరేకంగా ఉన్న చాలా ఆధారాలను వారు పట్టించుకోలేదు’’ అని చారు వాలి ఖన్నా చెప్పారు.

అనామిక తండ్రి ఒక స్కూలులో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నారు. తన రాత్రి షిఫ్ట్ డ్యూటీ ముగిసిన తర్వాత సోమవారం ఉదయం నేరుగా కోర్టుకు వెళ్లానని ఆయన నాతో చెప్పారు.

సుప్రీంకోర్టులో తీర్పు చదువుతున్నపుడు బాధితురాలి తల్లిదండ్రులతో కలిసి కోర్టు వెలుపల నిరీక్షించిన భయన.. తమకు వచ్చిన కోపం, అసంతృప్తి గురించి మాట్లాడారు.

''నా గుండె పగిలిపోయింది. నాకు ఎలా అనిపిస్తోందో వివరించటానికి నా దగ్గర మాటలు లేవు. ఇక ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉండి ఉంటుందో ఊహించుకోండి’’ అని ఆమె నాతో పేర్కొన్నారు.

ఇలాంటిది జరగవచ్చునని తనకు ఒక్క శాతం కూడా సందేహం లేకుండిందని, న్యాయం కోసం పోరాటంలో ఇదే చివరి మజిలీ అని బాధితురాలి కుటుంబానికి భరోసా ఇస్తూ వచ్చానని ఆమె చెప్పారు.

''కానీ మా చుట్టూ అంతా కుప్పకూలింది. ఆ ఉత్తర్వు గురించి లాయర్ నాకు ఫోన్ చేసి చెప్పినపుడు నేను నమ్మలేకపోయాను. పొరపాటుగా విన్నానేమో అనిపించింది’’ అన్నారామె.

సుప్రీంకోర్టుకు దర్యాప్తు గురించి ఆందోళన ఉన్నట్లయితే, కేసును మళ్లీ తెరిచి, మరోసారి దర్యాప్తు చేయాలని ఆదేశించి ఉండవచ్చునని, లేదంటే సీబీఐకి కేసును అప్పగించి ఉండవచ్చునని భయన అంటున్నారు.

''నిజం ఏమిటంటే ఒక యువతి మీద సామూహిక అత్యాచారం చేసి, దారుణంగా హత్య చేశారు. ఆమె కుటుంబానికి కోర్టు ఏదో విధమైన ఉపశమనం అందించి తీరాలి’’ అని పేర్కొన్నారు.

మరోవైపు అనామిక తండ్రి హతాశుడై ఉన్నారు.

''నా మీద పిడుగు పడింది’’ అని ఆయన నాతో అన్నారు.

''సుప్రీంకోర్టు ఏం చేసింది? పదేళ్ల పాటు కోర్టులకు ఏ సందేహాలూ లేవు. మరి అకస్మాత్తుగా అన్నీ అబద్ధాలుగా ఎలా మారిపోయాయి?’’ అని ఆయన ప్రశ్నిస్తున్నారు.

''భారతదేశంలో ఆడపిల్లలకు భద్రత లేదని అందరూ అంటున్నారు. ఈ కోర్టు ఉత్తర్వు తర్వాత భారతదేశంలో ఏ ఒక్క బాలికకూ భద్రత ఉండదు. ఇది నేరస్తులకు మరింత ధైర్యం ఇస్తుంది’’ అన్నారాయన.

ఇవి కూడా చదవండి:

సంబంధిత కథనాలు:

English summary
"Justice will look like this in India 2022" - Shock and outrage in the country over the release of death row convicts in the Chawla rape case
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X