నేపాల్ ప్రధానిగా కేపీ శర్మ ఓలి ప్రమాణ స్వీకారం -విపక్షాలు విఫలం కావడంతో మళ్లీ ఆయన చేతికే పగ్గాలు
హిమాలయ దేశం నేపాల్ ను తీవ్రంగా హీటెక్కిస్తూ నెలలపాటు కొనసాగిన రాజకీయ హైడ్రామాకు ముగింపు కార్డు పడింది. నేపాల్ ప్రధానమంత్రిగా ఖడ్గ ప్రసాద్ (కేపీ) శర్మ ఓలీ(69) శుక్రవారం మరోసారి ప్రమాణ స్వీకారం చేశారు. గత సోమవారం పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయినా కేపీ శర్మకే రాష్ట్రపతి మరోసారి అవకాశం ఇవ్వడం గమనార్హం.
మొత్తం 275 మంది సభ్యులున్న నేపాల్ జాతీయ సభలో 4 సభ్యులు సస్పెన్షన్‌లో ఉన్నారు. ప్రస్తుతం 271 స్థానాలు ఉన్న పార్లమెంట్‌లో ఓలీ సారథ్యంలోని నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీకి 121 మంది సభ్యుల బలం ఉంది. విశ్వాస పరీక్షలో ఓలీ ఓడిపోయిన తర్వాత సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో విపక్షాలు విఫలమయ్యాయి.

దీంతో దేశాధ్యక్షురాలు విద్యాదేవి భండారీ అతిపెద్ద పార్టీ అధినేతగా ఉన్న ఓలీకి మళ్లీ సర్కార్ ఏర్పాటు చేసే అవకాశం ఇస్తున్నట్లు ప్రకటించింది. అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయిన ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలీ శుక్రవారం మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఓలీ 30 రోజుల్లో ప్రతినిధుల సభలో బల పరీక్షను ఎదుర్కోవాల్సి ఉంది.
నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షఉడు షేర్ బహదూర్ దేవ్‌బాకు మాజీ ప్రధాని ప్రచండ, సీపీఎన్ (మావోయిస్ట్) పార్టీ మద్దతు తెలిపింది. అయితే, జనతా సమాజవాదీ పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. జేఎస్పీ అధ్యక్షుడు ఉపేంద్ర యాదవ్ మద్దతు ప్రకటించినా.. మరో అధ్యక్షుడు మహంత ఠాకూర్ దీనిని వ్యతిరేకించారు. నేపాలీ కాంగ్రెస్ పార్టీకి 61, ప్రచండకు 49, జేఎస్పీకి 32 మంది సభ్యులున్నారు. విపక్షాలన్నీ విఫలం కావడంతో ఓలికి మరోసారి ప్రధానిగా అవకాశం దక్కింది.












Click it and Unblock the Notifications