మోడీ సర్కారుకు సాధ్యం కానిది నేను సాధించా.. కేఎల్ పాల్ సంచలనం!
KA Paul: యెమెన్‌లో ఉరిశిక్షను ఎదుర్కొంటున్న కేరళ నర్సు నిమిష ప్రియకు ఊరట లభించింది. యెమెన్ అధికారులు నిమిష ప్రియ మరణ శిక్షను వాయిదా వేశారు. బుధవారం నిమిష ప్రియకు మరణ శిక్ష పడాల్సి ఉండగా.. చివరి క్షణాల్లో స్థానిక అధికారులు ఈ ప్రక్రియను నిలిపివేసినట్లు సమాచారం. మరోవైపు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కూడా నిమిష ప్రియ కోసం రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. యెమెన్ లో ఉన్న మతపరమైన నాయకులతో ఆయన కూడా సంప్రదింపులు జరిపారు. అయితే ఆయన జరిపిన సంప్రదింపులు సత్ఫలితాలను ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కేఎల్ పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత మూడు రోజులుగా రాత్రింబవళ్లు అవిశ్రాంతంగా కృషి చేయడంతో యెమెన్‌లో మరణశిక్ష పడిన భారతీయ నర్సు ఉరిశిక్షను వాయిదా వేసినట్లు కేఏ పాల్ ప్రకటించారు.
కేఏ పాల్ మాట్లాడుతూ.. తాను హౌతీ నాయకులతో చర్చలు జరిపానని పేర్కొన్నారు. ముఖ్యంగా సుప్రీంకోర్టులో మోడీ ప్రభుత్వం తరఫున న్యాయవాది.. "కేంద్రం ఏమీ చేయలేదని.. సనా నగరంలో ప్రభుత్వం లేదు" అని చెప్పినట్లు కేఏ పాల్ వెల్లడించారు. హౌతీ ప్రభుత్వం ఉందని.. వారిని కలిశానని.. వారిని ఒప్పించానని కేఏ పాల్ తెలిపారు. ఈ ప్రయత్నంలో అత్యంత కీలక పాత్ర పోషించిన వారిలో ప్రజాదరణ పొందిన ముస్లిం నాయకుడు డాక్టర్ సెమి అల్ ఆరియన్ ఉన్నారని కేఏ పాల్ చెప్పుకొచ్చారు. ఆరియన్ ఐదేళ్లు అమెరికా జైలులో ఉన్నారని.. 220 ఏళ్ల జైలు శిక్ష విధించబడినా.. ముస్లిం కొరకు, పాలస్తీనియన్ల కొరకు అమెరికాతో పోరాడి మంచి పేరు సంపాదించుకున్నారని పాల్ ప్రశంసించారు. ఆయన సహాయంతో పాటు ఛైర్మన్ మహ్ది ఇబ్రహీం, షేక్ అహ్మద్ గార్, హౌతీ నాయకుల మద్దతుతో ఈ విజయం సాధ్యమైందని అన్నారు. కొంత మంది ఇరానియన్లు, ఒమన్ నాయకులు కూడా సహాయం చేశారని పేర్కొన్నారు.

నిమిష ప్రియా ఉన్న జైలు సనాలో ఉందని.. అది ఒకప్పుడు అసలైన రాజధాని అని, అక్కడికి భారత ప్రభుత్వానికి యాక్సెస్ లేదని కేఏ పాల్ గుర్తు చేశారు. సుప్రీం కోర్టులోనే వారు ఈ విషయాన్ని చెప్పారని.. అయితే తనకు యాక్సెస్ ఉండబట్టి.. వారందరినీ కలిసి వీడియోలు, ఫోటోలు విడుదల చేశానని, ట్వీట్ కూడా చేశానని వివరించారు. ముస్లింలు, క్రైస్తవులు, హిందువులు ప్రార్థించారని.. ఈ ప్రార్థనల వల్లే నిమిష ప్రియ ఉరిశిక్ష వాయిదా పడిందని పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి మిలియన్ డాలర్లు ఇస్తానని తాను హామీ ఇచ్చానని, ఒక వారం లోపలనే ఈ డబ్బు ఇస్తారా లేక నన్ను ఇవ్వమంటారా అని భారత ప్రభుత్వాన్ని కేఏ పాల్ ప్రశ్నించారు. "మీరు గాని విడిపించారంటే మీరే మిలియన్ డాలర్లు పంపండి, మీరే క్రెడిట్ తీసుకోండి" అని సవాల్ విసిరారు. యెమెన్ చాలా ప్రమాదకరమైన దేశమని, ఎవరూ వెళ్లలేదని.. అయితే రాయబారులు, ప్రభుత్వాలు హోస్ట్ చేయడం వల్ల ఆ నాయకులను బయటికి రప్పించానని వివరించారు.












Click it and Unblock the Notifications