భాష కోసం ప్రాణాలిచ్చిన చరిత్ర మాది-ఆడుకోవద్దు-కమల్ హాసన్ హెచ్చరిక..!
పీఎం శ్రీ స్కూళ్ల పేరుతో తమిళనాడులో హిందీ భాషను అమలు చేసేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పటికే సీఎం ఎంకే స్టాలిన్ తో పాటు అన్ని పార్టీలు, సామాజిక వేత్తలు, సినీ నటులు కేంద్రం ప్రయత్నాలను వ్యతిరేకిస్తుండగా.. తాజాగా ఈ జాబితాలో దిగ్గజ నటుడు కమల్ హాసన్ కూడా చేరారు. మక్కల్ నీది మయ్యం పార్టీ ఛీఫ్ గా ఉన్న కమల్ హాసన్.. కేంద్రం ప్రయత్నాలపై విరుచుకుపడ్డారు.
తాజాగా జరిగిన పార్టీ సమావేశంలో కమల్ హాసన్ తమిళ భాషపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక భాష కోసం తమిళులు తమ ప్రాణాలను కోల్పోయారని, వాటితో ఆడుకోకండని కేంద్రాన్ని హెచ్చరించారు. తమిళులకు, పిల్లలకు కూడా వారికి ఏ భాష అవసరమో తెలుసన్నారరు. వారికి అవసరమైన భాషను ఎంచుకునే జ్ఞానం వారికి ఉందని కమల్ హాసన్ తేల్చిచెప్పేశారు.
తమిళులు ఎదుర్కొంటున్న సవాళ్లను, ముఖ్యంగా వారి భాషను కాపాడుకోవడానికి వారు చేసిన పోరాటాన్ని కమల్ గుర్తుచేశారు.
హిందీ భాషా విధానానికి వ్యతిరేకంగా తమిళనాడు చేసిన చారిత్రాత్మక పోరాటాన్ని కూడా గుర్తుచేశారు.

మరోవైపు తన పొలిటికల్ కెరీర్ పై వస్తున్న విమర్శలపైనా కమల్ స్పందించారు. విఫల రాజకీయ నాయకుడిగా తన ప్రత్యర్థులు చేస్తున్న విమర్శల్ని అంగీకరించిన కమల్.. తాను ముందుగానే రాజకీయాల్లోకి వచ్చి ఉంటే బావుండేదన్న వాదనను అంగీకరించారు. రాజకీయాల్లోకి చాలా ఆలస్యంగా ప్రవేశించినందుకే ఓడిపోయానని భావిస్తున్నానని, 20 ఏళ్ల క్రితమే అడుగుపెట్టి ఉంటే నా మాట, స్థానం మరోలా ఉండేవని అన్నారు.
ఈ సంవత్సరం పార్టీ వాణిని పార్లమెంట్‌లో వినిపిస్తామని, వచ్చే ఏడాది రాష్ట్ర అసెంబ్లీలోనూ అది వినిపిస్తుందని కమల్ హాస్ వ్యాఖ్యనించారు. కమల్ ను డీఎంకే కూటమి రాజ్యసభ ఎంపీగా పంపేందుకు సిద్ధమవుతుందన్న వార్తల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అలాగే వచ్చే ఏడాది జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కమల్ హాసన్ పార్టీకి కూడా కూటమి కొన్ని స్ధానాలు కేటాయించే అవకాశాలున్నాయి. దీంతో అసెంబ్లీలోనూ తన పార్టీ వాణి వినిపిస్తుందంటూ కమల్ సంకేతాలు ఇచ్చారు.












Click it and Unblock the Notifications