కర్నాటక సర్కార్ మరో సంచలనం-వచ్చే ఏడాది నుంచి జాతీయ విద్యావిధానం రద్దు...!
కర్నాటకలో బీజేపీ స్ధానంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం వరుసగా సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా గతంలో బీజేపీ అధికారంలో ఉండగా.. మనువాద భావజాలంతో తీసుకున్న పలు నిర్ణయాలు సమీక్షిస్తోంది. విద్యావిధానంలోనూ జరిగిన కాషాయీకరణను సరిదిద్దేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రంలో జాతీయ విద్యావిధానం అమలును నిలివేయాలని నిర్ణయించింది.
ఇవాళ కర్నాటక కాంగ్రెస్ పార్టీ జనరల్ బాడీ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలో జాతీయ విద్యావిధానం అమలు నిలిపేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. గతంలో బీజేపీ తమ రాష్ట్రాల్లో అమలు చేయని జాతీయ విద్యావిధానాన్ని కర్నాటకలో మాత్రమే అమలు చేసిందని సిద్దరామయ్య తెలిపారు. మనువాద భావజాలంతో కూడిన ఈ విద్యావిధానం కంటే రాజ్యాంగం ప్రకారం కర్నాటకలో విద్యావిధానం అమలువుతుందని సిద్ధరామయ్య ప్రకటించారు.

ఈ ఏడాది రాష్ట్రంలో విద్యా సంవత్సరం మొదలయ్యే సమయంలో ఎన్నికలు జరిగి ఫలితాలు రావడంతో ఈ నిర్ణయం అమలు చేయడం సాధ్యం కాదని, కాబట్టి వచ్చే విద్యాసంవత్సరం నుంచి జాతీయ విద్యావిధానం అమలు రద్దు నిర్ణయం అమల్లోకి వస్తుందని సిద్ధరామయ్య వెల్లడించారు. ఎన్‌ఇపిని ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రవేశపెట్టకుండా కర్నాటకలోనే అమలు చేశారని ఆయన తెలిపారు. ఈ సంవత్సరం కొంచెం ఆలస్యం అయిందన్నారు. కాబట్టి వచ్చే ఏడాది నుండి మేము ఎన్ఈపీని మారుస్తామని సిద్ధూ తెలిపారు.
రాజ్యాంగానికి అనుగుణంగా విద్యను అందించడానికి ప్రయత్నిస్తామన్నారు. ఎందుకంటే బీజేపీ రాజ్యాంగ వ్యతిరేకమని, వారు మనువాదాన్ని నమ్ముతారని సిద్ధరామయ్య అన్నారు.అవసరమైన సన్నాహాలు చేసిన తర్వాత ఎన్‌ఇపిని రద్దు చేయాలని భావిస్తున్నట్లు సిద్ధరామయ్య తెలిపారు.ఎన్‌ఇపిని విద్యార్థులు, తల్లిదండ్రులు, లెక్చరర్లు, ఉపాధ్యాయులు వ్యతిరేకిస్తున్నారని, ఇతర రాష్ట్రాలు అమలు చేయకముందే కర్నాటకలో ఎన్‌ఇపిని అమలు చేయడం ద్వారా బీజేపీ విద్యార్థుల ప్రయోజనాలను త్యాగం చేసిందని సిద్ధూ ఆరోపించారు.












Click it and Unblock the Notifications