కర్ణాటక ఎన్నికల పోలింగ్ లో మూడు చోట్ల హింస; పోలీసులను కొట్టి ఈవీఎంలు ధ్వంసం!!
కర్ణాటక ఎన్నికల పోలింగ్‌లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఉదయం నుంచి ప్రశాంతంగా కొనసాగిన ఎన్నికల పోలింగ్, అక్కడక్కడ హింసాత్మకంగా మారుతుంది. పోలింగ్ ప్రశాంతంగా కొనసాగించడానికి ఎన్నికల అధికారులు, పోలీసులు 144 సెక్షన్ విధించి మరీ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. అయినప్పటికీ అక్కడక్కడ హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడం ప్రధానంగా కనిపిస్తోంది.
కర్ణాటక ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్న వేళ మూడు చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ జరుగుతుండగా విజయపుర జిల్లా బసవన్ బాగేవాడి తాలూకా మసబినల గ్రామంలో ఈవీఎంలను గ్రామస్థులు పగలగొట్టారు. ఎన్నికల అధికారులు ఈవీఎంలను, వీవీప్యాట్‌లను మార్చారన్న రూమర్స్ నేపథ్యంలో ఒక్కసారిగా విరుచుకుపడిన కొందరు ఆగ్రహంతో ఉన్న గ్రామస్థులు ఎన్నికల సిబ్బందిపై దాడి చేయడం మాత్రమే కాకుండా, అడ్డొచ్చిన పోలీసులను కూడా చితకబాదారు.

ఈవీఎంలను, వివీ ప్యాట్ మిషన్లను గ్రామస్థులు పగలగొట్టారు. ఈవీఎంలను ధ్వంసం చేయడంతో అక్కడ పోలింగ్ నిలిచిపోయింది. ఎన్నికల సిబ్బంది కారును సైతం పల్టీ కొట్టించి ధ్వంసం చేశారు. అంతేకాదు బెంగళూరులోని పద్మనాభనగర్ నియోజకవర్గంలోని పాపయ్య గార్డెన్ లోని పోలింగ్ బూత్ లో కొందరు యువకులు హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు.
తమ రాజకీయ ప్రత్యర్థులపై దాడికి దిగిన కొందరు యువకులు, కర్రలతో దాడి చేయడంతో, క్యూలైన్‌లో నిలబడిన మహిళలకు గాయాలయ్యాయి. ఇదిలా ఉంటే. బళ్లారి జిల్లా సంజీవరాయల కోట్ వద్ద కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో అక్కడ కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక అన్ని చోట్ల పరిస్థితిని అదుపులోకి తీసుకురావటానికి పోలీసులు భద్రతను పెంచి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
ఇదిలా ఉంటె కర్ణాటక ఎన్నికల్లో నేడు 224 నియోజక వర్గాలలో నేడు 2613 మంది హోరాహోరీగా తలపడుతున్నారు. ఈ ఎన్నికల్లో ఈ సారి త్రిముఖ పోరు కొనసాగుతుంది. అధికారం కోసం కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ లు పోటీ పడుతున్నాయి. మరి ఈ ఎన్నికల్లో ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందనేది ఈనెల 13న తేలనుంది.












Click it and Unblock the Notifications