karnataka exit polls : కర్నాటక ఎగ్జిట్ పోల్స్ సారాంశమిదే- ఒకరిద్దరు మినహా అందరిదీ అదే మాట..
కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఇవాళ పలు మీడియా సంస్ధలు ఎగ్జిట్ పోల్స్ అంచనాల్ని వెల్లడించాయి. ఇందులో ఆసక్తికరంగా దాదాపు మెజారిటీ మీడియా సంస్ధలు, గ్రూపులు, సర్వే సంస్ధలు కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యం లభిస్తుందని చెప్పేశాయి. ఒకటి రెండు సంస్ధలు మాత్రం బీజేపీకి ఆధిక్యం లభిస్తుందని అంచనా వేశాయి. తద్వారా మరోసారి హంగ్ అసెంబ్లీ తప్పదనే అంచనాకు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇవాళ్టి ఎగ్జిట్ పోల్స్ ఫలితాల సారాంశం ఓసారి చూసేద్దాం..
కర్నాటక ఎన్నికల ఫలితాలపై ఇవాళ ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. వీటిలో మెజారిటీ సర్వే సంస్ధలు, జాతీయ ఛానళ్లు విపక్ష కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యం లభిస్తుందనే అంచనాకు వచ్చాయి. రిపబ్లిక్ టీవీ, ఇండియా టుడే, ఇండియా టీవీ, జీ న్యూస్, ఏబీపీ, టీవీ 9, టైమ్స్ నౌ వంటి ఛానళ్లు వెలువరించిన ఎగ్జిట్ పోల్స్ లో కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యం దక్కింది. వీటితో పాటు జన్ కీ బాత్, సీ ఓటర్, సువర్ణ న్యూస్, టుడేస్ చాణక్య, ఆత్మసాక్షి వంటి సర్వే సంస్ధల ప్రకారం చూసినా కాంగ్రెస్ పార్టీకి ఈసారి ఎన్నికల్లో ఆధిక్యం లభిస్తోంది.

కర్నాటకలో ఈసారి కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం సాధిస్తుందని మెజారిటీ ఛానళ్లు, సర్వే సంస్ధలు తేల్చిచెప్పగా.. ఇందులో మరికొన్ని సంస్ధలు హస్తం పార్టీకి సొంతంగా అధికారం చేపట్టే అవకాశం కూడా ఉందని అంచనా వేశాయి. ఇందులో ఇండియా టుడే మై యాక్సిస్ సర్వే కాంగ్రెస్ పార్టీ ఏకంగా 122 నుంచి 140 సీట్లు సాధించి అధికారం చేపట్టబోతోందని అంచనా వేసింది. ఇండియా టీవీ సర్వేలోనూ 110 నుంచి 120 స్ధానాల్లో కాంగ్రెస్ గెలవబోతోందని అంచనా వేసింది. అలాగే జీ న్యూస్ సర్వేలోనూ కాంగ్రెస్ 103-118 సీట్లు సాధించబోతున్నట్లు తేలింది. టుడేస్ చాణక్య సైతం 120 సీట్లు కాంగ్రెస్ గెల్చుకుంటుందని చెప్పింది.
మరోవైపు ఈసారి వెలువడిన ఎగ్జిట్ పోల్స్ లో కొన్ని మాత్రం కర్నాటకలో అధికార బీజేపీ అధికారం నిలబెట్టుకుంటుందని అంచనా వేశాయి. మరికొన్ని బీజేపీ అత్యధిక సీట్లు సాధించబోతోందని అంచనా వేశాయి. ఇందులో సువర్ణ న్యూస్ బీజేపీకి 94-117 సీట్లు వస్తాయని, న్యూస్ నేషన్(న్యూస్ 18) 114 సీట్లు వస్తాయని, సర్వే సంస్ధ రాజ్ నీతి బీజేపీకి 100 సీట్లు వస్తాయని అంచనా వేశాయి. అయితే బీజేపీ ఒంటరిగా అధికారంలోకి రాబోతోందని ఏ ఒక్కరూ చెప్పలేకపోయారు.
కర్నాటకలో మరోసారి జేడీఎస్ కింగ్ మేకర్ గా మారబోతోందని పలు సర్వే సంస్ధలు, ఛానళ్లు అంచనా వేశాయి. కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్దానాలు లభిస్తున్నా మ్యాజిక్ మార్క్ రావడం లేదని చెప్పిన సంస్ధలన్నీ జేడీఎస్ కింగ్ మేకర్ అవుతుందని అంచనా వేస్తున్నాయి. అయితే జేడీఎస్ 12-33 సీట్ల మధ్య గెలవబోతోందని ఎగ్జిట్ పోల్స్ సారాంశంగా తేలింది. మరోవైపు ఈ ఎన్నికల్లో డబ్బు ఖర్చుపెట్టడంలో వెనుకబడ్డామని, 25 సీట్లలోపే గెలవబోతున్నట్లు మాజీ సీఎం, జేడీఎస్ నేత కుమారస్వామి స్వయంగా ప్రకటించారు.












Click it and Unblock the Notifications