ఐపీఎల్ గెలిచిన 48 గంటల్లోనే చిక్కుల్లో ఆర్సీబీ ? తొలి షాక్..!
ఐపీఎల్ లో 18 ఏళ్లలో తొలి టైటిల్ గెలిచి బెంగళూరులో విజయోత్సవ సంబరాలు చేసుకుని 11 మంది చావులకు కారణమైన తొక్కిసలాటకు బాధ్యులైన రాయల్ ఛాలెంజర్స్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్దకు ర్యాలీగా బయలుదేరి వెళ్లి తొక్కిసలాటకు కారణమైన క్రిమినల్ నిర్లక్ష్యం ప్రదర్శించారంటూ ఆర్సీబీతో పాటు కర్నాటక క్రికెట్ సంఘం, ఈవెంట్ నిర్వాహకులపై ప్రభుత్వం కేసులు నమోదు చేసింది.
బెంగళూరులో నిన్న నిర్వహించిన ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీలో తొక్కిసలాట చోటు చేసుకుని 11 మంది చనిపోవడం, మరో 47 మంది గాయాల పాలవ్వడంతో కర్నాటక ప్రభుత్వం విమర్శలపాలైంది. అసలు ఈ ఈవెంట్ కు ఎందుకు అనుమతించారంటూ ప్రశ్నలు తలెత్తాయి.దీంతో ఈ ఘటనకు కారకుల్ని గుర్తించేందుకు ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించిన కర్నాటక ప్రభుత్వం ప్రాథమిక సమాచారం ఆధారంగా ర్యాలీ నిర్వహించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో పాటు దీనికి సహకరించిన కర్నాటక క్రికెట్ సంఘంపై కేసులు నమోదు చేసింది.

బెంగళూరులో జరిగిన తొక్కిసలాట, అనంతర ఘటనలపై నగరంలోని కబ్బన్ పార్క్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. ఆర్సీబీ, కర్నాటక క్రికెట్ సంఘంతో పాటు ఈవెంట్ నిర్వహణ కంపెనీ అయిన డీఎన్ఏ నెట్ వర్క్స్ ను కూడా ఇందులో బాధ్యుల్ని చేశారు. ఈ ఘటనపై సుమోటా కేసులు నమోదు చేసినట్లు బెంగళూరు సెంట్రల్ డీసీపీ శేఖర్ తెలిపారు.

భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) లోని సెక్షన్ 105 (హత్యతో సమానం కాని నేరపూరిత నరహత్య), సెక్షన్ 125(12) (ఇతరుల ప్రాణాలకు లేదా వ్యక్తిగత భద్రతకు ముప్పు కలిగించే చర్యలు), సెక్షన్ 142 (చట్టవిరుద్ధమైన సమావేశం), సెక్షన్ 121 (నేరానికి ప్రేరేపించడం), సెక్షన్ 190 (ఒక సాధారణ లక్ష్యాన్ని సాధించడానికి చేసిన నేరాలకు చట్టవిరుద్ధమైన సమావేశం సభ్యుల బాధ్యత) వంటి వివిధ సెక్షన్ల కింద ఈ కేసులు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications